ఆకాశానికి అలంకారాలెక్కువ
ఉదయాస్తమయాలు రంగురంగుల
దుస్తులు, నగలు
వజ్రాలు, వైడూర్యాలు పొదిగిన సిగ్గుల మొగ్గలా
రాత్రుళ్లు చుక్కలు, చంద్రునితో కదలికలు
అప్పుడప్పుడు మేఘాల చుట్టాలతో ఆలింగనం
మేకప్ పై పూతలు లేవు, సహజత్వ సందడులన్నీ
ఉరుములు మెరుపుల వానల సంగీతం
ఇంద్ర ధనుస్సుల కానుకలు పంచుతుంది
సొగసులాడి భూమి తక్కువదేం కాదు
కాలం తీరు మార్పుల పరేడ్లు చేస్తూ
నవ్వుతుంది, నవ్విస్తుంది,
ఏడుస్తుంది, ఏడిపిస్తుంది
ఎన్ని డైమెన్షన్ల కలలు కంటుందో, పరుస్తుందో
జీవజలాన్ని సృజిస్తుంది, విస్తరిస్తుంది
జీవితాంతం బ్రతుకు పాట పాడిస్తుంది
ప్రకృతి ఏదీ అరువు తెచ్చుకోదు మనుషుల్లా
పంచభూతాలు పరిమళించినంత కాలం
హెచ్చుతగ్గుల ఆటుపోట్లున్నా బెంగపడదు
ధైర్యంగా జీవిస్తుంది, ధైర్యాన్ని నూరిపోస్తుంది
తన నడకకు సెలవు చెప్పదు, నడత మార్చుకోదు
ప్రకృతి నేర్పే పాఠాలు అందరికీ గుణపాఠాలు
– కొమురవెల్లి అంజయ్య 98480 05676