చీకటి మా బతుకులు వెలుగుని కోరుతున్నాయి…
వెలుగు మాత్రం అక్షరంతోనే వస్తానంటుంది!
ఓ అక్షరమా… నాతో అడవికొస్తావా?
అక్షరాలు కలిస్తేనే పదాలుగా మారతాయి…
ఓ పదమా నాతో మా పల్లెకొస్తావా?
పదాలన్నీ కలిస్తేనే వాక్యమవుతుంది…
ఓ వాక్యమా నాతో మా వాడకొస్తావా?
వాక్యాలన్నీ కలిస్తేనే గేయమవుతుంది…
ఓ గేయమా.. నాతో మా గూడెంకొస్తావా?
నువు లేక మా బతుకులు అక్కడే ఆగిపోయాయి..
అక్షరం లేక ఆగిపోయిన బతుకులు మావి!
ఓ అక్షరమా.. నాతో పాటు మా అడవికొస్తావా?
ఓ అక్షరమా.. నాతో పాటు మా పల్లెకొస్తావా?
ఓ అక్షరమా…. నాతో పాటు మా వాడకొస్తావా?
ఓ అక్షరమా… నాతో పాటు మా గూడెంకొస్తావా?
ఓ అక్షరమా… నాతో పాటు మా బస్తీకొస్తావా?
నీ కోసం తరాల నుండి వేచి
చూస్తున్న బతుకులు ఎన్నో ఉన్నాయి…
నువు రావాలని బతిమాడుతలేను,
నువు రావడం నా హక్కని అడుగుతున్నాను!
నీ రాకకై వేచి చూస్తుంటా…
– పోరిక వికాస్ 63039 69215