మిగతా భాషల మాటెలా వున్నా తెలుగు సాహిత్య సీమలో ప్రస్తుతం రాజ్యమేలుతున్న ప్రక్రియ కథానిక. ఇది పుట్టిన ఊరు ఫలానా అని చెప్పడం దాదాపు అసాధ్యం. “రణరంగము కాని స్థలము భూతలమంతా వెదకినా దొరక”దన్నాడు కవి. ఆ మాట కదన రంగానికి ఎంతగా వర్తిస్తుందో, కథన రంగానికి సైతం అంతగానూ వర్తిస్తుంది! అంతకన్నా, కథ పుట్టని వూరేదని అడిగితే తేలిగ్గా జవాబు చెప్పొచ్చేమో! ఎందుకంటే, కథనం తెలియని జాతిప్రజాతులు ఎక్కడా కనిపించవు. కాగా, మనిషి రాయడం నేర్చుకోడానికి సహస్రాబ్దాలు పట్టింది. ఆ లోగా, కథలను గుర్తు పెట్టుకునేందుకు వాటిని రాగతాళబద్ధంగా రూపొందించుకునేవారు. అదే క్రమంగా “ఛందస్సు”గా రూపుదిద్దుకుంది. ప్రపంచంలోని ప్రాచీన నాగరికతలన్నింట్లోనూ గేయకథలు కనిపించేదందుకే. అది కథనానికి ఆదిమ రూపం కాగా కథానిక దాని అత్యాధునిక రూపమంటారు చదువుకున్న పెద్దలు.
మధ్య ప్రాచ్యంలో వెలువడిన పాతకాలపు గేయ కథలన్నింట్లోకీ ప్రాచీనమైంది పగిలిన ఓడలో నావికఁడు అంటారు. సామాన్య శకానికి పూర్వం రెండువేల సంవత్సరాల కిందటి అంటే, నాలుగువేల యేళ్ళ నాటి కథ అది. ఇజిప్షియన్ ఆరబిక్ భాషలో ఆ కథ రూపుదిద్దుకుందంటారు. అదే కాలానికి అటూఇటూగా వెలువడిన రుగ్వేదంలో కూడా బీజప్రాయమైన కథలెన్నో కనిపిస్తున్నాయి. ఉదాహరణకి, రుగ్వేదం పదో మండలంలోని 34వ సూక్తం అక్షసూక్తమ్ (పందెగాడి ప్రలాపం) వ్యసనపరుడైన జూదరి హృదయావేదనను చిత్రిస్తుంది. ఇది ఓ నీతికథ లాంటిది! వైదిక సాహిత్యంలో ఇలాంటి కథలు మరికొన్ని కూడా కనిపిస్తాయి. ప్రపంచం నలుమూలలా కాస్త ముందువెనకలుగా ఒకే సమయంలో గేయకథలు పుట్టాయని చెప్పుకోవడమే అసలు విషయం.
సామాన్య శకానికి పూర్వం మూడునాలుగు శతాబ్దాల నాటికి స్థిరమైన రూపం తీసుకున్నవని చెప్పే భారత రామాయణాల్లో ప్రతి పాత్ర నేపథ్యమూ, ప్రతి మలుపు వెనకవున్న కార్యకారణ సంబంధమూ ఒక్కో కథగా కనిపిస్తుందంటారు. ఇవన్నీ గొలుసుకట్టు కథలుగా కనిపిస్తూ మరో బృహత్కథను మనకు చెప్తాయి. కథానిక ప్రక్రియకు మూలరూపాల్లాంటివే ఈ గొలుసుకట్టు కథలన్నది కొందరి అంచనా; కాగా దానితో ఏకీభవించే వాళ్ళెందరున్నారో విభేదించేవాళ్ళూ అందరుండడం గమనార్హం. అయితే, గుర్తుంచుకోవలసిన విషయమేమిటంటే, ఇవేవీ మనం చెప్పుకునే కథానికలు కావు! అంచేత, ఈ చర్చ ఇక్కడితో ఆపడం శ్రేయస్కరం!!
కావ్యేతిహాసాల యుగం ముగిసిన రెండు వందల యేళ్ళకే సామాన్య శకానికి పూర్వం తొలిశతాబ్దిలో గుణాఢ్యుడు పైశాచీ అనే ప్రాకృత భాషలో బృహత్కథ కల్పించాడట. అది, ఏడింట ఆరువంతులు దగ్ధమై పోగా, మనకు లక్ష శ్లోకాలు దక్కాయంటారు! గుణాఢ్యుడి అస్తిత్వాన్ని దాదాపు అన్ని సాహిత్య చరిత్రలూ అంగీకరించినప్పటికీ, ఆయన జీవించి రచించిన కాలం విషయంలో ఏ యిద్దరు పండితులూ ఏకీభవించకపోవడం విశేషం! సంస్కృత వచనసాహిత్యంలో పుట్టిందని చెప్పే ప్రతి కథకూ మూలాలు ఈ ‘బృహత్కథ’లో దొరుకుతాయంటారు. (ఇలాంటి ప్రకటనలను యథాతథంగా తీసుకోకూడదు వాటిల్లో యత్కించిత్ ఆలంకారికత దాంకుని వుంటుంది!) జాతకకథలూ, బృహత్కథ, పంచతంత్రం, ఈసప్ కథల లాంటి రచనలోని ‘కథ’లు కథానికలు కావని ఆ ప్రక్రియ గురించిన ప్రాథమిక పరిజ్ఞానం వున్నవాళ్లు తేల్చి చాలాకాలమైంది. ఇప్పుడు మనం కథానికగా పిల్చుకునే ప్రక్రియకు మూలరూపమనదగిన కథలివేనన్నది ఒక వర్గం వాదన; కాదన్న మాదన్నలే ఎక్కువనుకోండి!
పందొమ్మిదో శతాబ్దంలో ఎడ్గార్ ఎలన్ పో, బ్రాండర్ మేథ్యూస్ మొదలుకుని ఇరవయ్యో శతాబ్దంలో ఫ్రాంక్ ఓ’కానర్ వరకూ విమర్శకులు నూరేళ్ళకు పైగా కథానికను నిర్దిష్ట సాహిత్య ప్రక్రియగా నిర్ధారిస్తూ చేసిన చర్చే ఈ సందర్భంగా ప్రాతిపదికగా నిలబడింది. ముఖ్యంగా పో ప్రతిపాదించిన లక్షణాలు బహుళ ప్రాచుర్యం పొందాయి. పాఠకపడిపై ఏకైక, ప్రగాఢ ప్రభావం ప్రసరింపచేసే పరిమాణంలోనే కథానిక వుండాలన్నాడు పో. కథాంశం, సంఘర్షణ, పతాకసన్నివేశం, ముగింపు కథానికలోని ప్రధాన భాగాలని అంటారు. పాత్రల మనోధర్మం, కథానిక నిర్మాణం ఈ ప్రక్రియకు మూలధాతువులన్నాడు పో. ఆ ప్రాతిపదికపైనే, 1842లో రష్యన్ రచయిత గగోల్ రాసిన ఓవర్‌కోట్ అనేదే ప్రపంచంలో మొట్టమొదటి కథానిక అన్నారు పాశ్చాత్య సాహిత్య చారిత్రకులు. అసలు, యాభై పేజీల ఓవర్‌కోట్ కథానికే కాదన్న విమర్శకులూ వున్నారు! దానిమాటెలా వున్నా పో చెప్పిన ఇతర లక్షణాలను ప్రమాణాలుగా తీసుకుని కథానికను గుర్తించడం ప్రపంచమంతటా స్థిరపడింది.
-మందలపర్తి కిశోర్
8179691822