బ్యాక్వర్డ్ క్లాస్ ఆంగ్లంలో అందాన్నిచ్చింది
వెనుకబడిన తరగతులు తెలుగులో మరీ అందాన్నిచ్చింది
రాయడానికి మీకేమి సిగ్గనిపించటం లేదా
వెనుకబాటు పదాన్ని రాస్తున్నామంటే
రాజ్యాంగానికి వృద్ధాప్యం వచ్చిందా?
పాలకులుగా మీరు ఎంత అణచివేశారో అర్థమవుతుంది!
చెరువు మట్టి తెచ్చి చేతుల్లో పిసికి
సారె మీద మట్టి
కళాఖండాలకు పోతపోసి
ఆదినుంచి సేవలందించిన శాలివాహనులకు
మీరిచ్చిన బిరుదు వెనుకబడినోడు
వైద్యుల దగ్గరకు అనుమతులు
వేల రూపాయల ఫీజులు
శరీర పరీక్షలు, మందుల
దుకాణంలో కమీషన్లు
దేశానికేదో సేవలు చేసినట్టు
పద్మశ్రీ అవార్డులు
వెనుకబడిన కులగణన
అంటేనే గుబుళ్లు
బీసీలకు హామీలు
తీర్పులు దిండు కింద పాములు
వృత్తేదేదైనా
సమాజానికి అంకితమై నడిచారు
సంచార కళలతో సైనికులై
కవాతులు చేశారు
సబ్బండ వర్ణాలే దేశానికి వెన్నెముకలు
ఊరును దేశాన్ని నిర్మించాం
నీళ్లకై ప్రాజెక్టులు నిర్మిస్తూ బలయ్యాం
ఇటుకలను పేర్చి బహుళ అంతస్తులుగా
అసెంబ్లీ, పార్లమెంట్ భవనాలు కట్టాం
స్వేచ్ఛా సమానత్వం, సౌభ్రాతృత్వం
సామాజిక న్యాయమంటూ
ప్రతిజ్ఞ చేసి చట్టాలకు పురుడుపోశాం
కానీ
అందులోకి ప్రవేశం లేకుండా
సామెతలతో సంస్కృతాధిపత్యాలతో హీనపరుస్తూ
అవమానాలు, అవహేళనలు
అంబరపు చినుకులు
విత్తనాలకు తడులు
వికాసపు ఝరులు
చలికి వెచ్చని గొంగడి
అలిసిన తనువుకు ఈతకల్లు
పంట కంకులకు కొడవలై
నూతన గృహానికి గుండు దారమై పార, తైట్టె వంటికి తెలుపై
నునుపై సుందరమై
బాసింగాలు మంగళ సూత్రాలు
నల్లపూసలు కాళ్ల కడియాలు
నగల అలంకరణలతో కులుకుతున్నారు
నాగళ్లను చెక్కిన పెద్ద బాడిస
పని ముట్లను పొదిగిన కొలిమి
సోకులు చేసుకోలేదెన్నడు
ఈత సాపలల్లిన చేతులు
మగ్గాలు నేసిన చేనేతలు
సన్నాయి వాయించిన చేతులు
డమరుకం ఆడించిన చేతులు
శంఖులూదిన కాటికాపరులు
తంబురాలను పలికించిన రాగాలు
పొందలేదు గౌరవాలు
మా సేవలు రాయబడని మహాకావ్యం!
పంచనామాలు జరగాలి
పోస్టుమార్టం చేయాలి
పార్టీలిచ్చేది భిక్షం
చట్టం మా హక్కు
బహుజన సేవలు వృథా అయితే
భారతమ్మ గుండెకు గాయాలు
ఉదయం ఉదయించటం మానేసినట్టే!
హరితవర్ణమైన పత్రహరితమైనా
బహుజనుల ఘర్మ జలమే
వీధుల్లో దిమ్మెలమై
మీ జెండాలను భుజాన మోస్తున్నాం
జేజేలు కొట్టి స్వాగతాలు
పలికేది మేమే ఓట్లేసేది మేమే
కానీ, పాలకులయ్యేది మీరు
మీ రాక కోసం వసంతకేళీలు ఆడాం
ఎన్నేళ్లీ గ్రహణాలు
ఎన్నేళ్ళు అమవాస్య పాలన
కావాలి బహుజన పున్నమి
సప్తనదుల సంగమంలా
పంచభూతాల కలయికలా
బీసీలకు అధికారాలు కావాలి
అగ్రవర్ణాల కుటిల నీతిలో
స్వప్న సింహాసనాలేనా?
(అసెంబ్లీలో బీసీ బిల్లు డిమాండ్‌కు….)
– వనపట్ల సుబ్బయ్య
94927 65358