రమ్మన రాదు యెంత సురరాట్టును వేడిన గాని భూతలిన్
పొమ్మన పదు వారిదము పొంగుచు పంటల ముంచెనంతటన్
ఝుమ్మని వీచే గాలులిక జోరుగ కూలెను మ్రానులన్ని యున్
చెమ్మను గాంచి కీటములు చేర్చెను రోగము గీములందునన్
నిండెను వాగువంతలును నిత్యపు వర్షపు నీటి ధాటికిన్
గండి పడంగ కొల్లలుగ గట్టి గృహంబులు కూలుచుండగన్
అండగనున్న పాడిపసులన్నియు నంతము చెందుచుండగన్
గుండెలు మండుచుండె నతి ఘోర గతిన్ గని మానవాళికి
చక్కటి నేల లేదు మరి సాగదు వాహన చక్ర మెచ్చటన్
చుక్కలు కానరావు శశి చూడడు పున్నమి రాత్రి నందునన్
మిక్కుటమౌ పయోదములు మిన్నున నాటలు నాడుచుండగన్
ఎక్కడ చూచినన్ జలము ఏపుగ పంకిల మంటునంతటన్
కూలికి పోవువారలకు కూటికి కష్టము గుండె మెండుగన్
బాలురు పాఠశాల జన బాటలు నిండెను బంక మట్టితోన్
కాలపు కట్టెలెక్కడను గంజిని వేడిగ గ్రోల బోవగన్
తాలిమి తోడ వేచినను తప్పక పోయెను తిప్పలెల్లెడన్
– వూట్ల భద్రయ్య 95502 56840