మద్దికుంట లక్ష్మణ్ మొదటి కవితా సంపుటి ‘వర్గమూలం’. 60 ఏండ్ల జీవితం 30 కవితలుగా విచ్చుకున్నది. పలుగురాళ్ల మీద నడిచిన పాదాలు ప్రాపంచిక దృక్పథాన్ని వీరికి అందించాయి. చదివిన చదువు జరుగుతున్న పరిణామాలను పట్టుకోవడం నేర్పింది. కష్టాలను, కడగండ్లను నవ్వుతూ దాటాలని అనుభవం తేల్చిచెప్పింది. బాధే సౌఖ్యమనే భావన మృదుత్వాన్ని ప్రసాదించింది. వీటన్నిటి సమాహారంగా లక్ష్మణ్ కవిత్వం కనబడుతుంది.
సైద్ధాంతిక కట్టుడు రాళ్లతో కాకుండా జీవితం ప్రసాదించిన పాకుడురాళ్లతో పొందికగా కవిత్వం కట్టిండు. మూగ బాధ, చేదు జ్ఞాపకం, ముక్కలైన గుండె, కూలిన మెదడులను అగ్గిపెట్టెలో అమర్చిన ఆకులందు బంగారు పురుగును పెట్టినట్టు కవితలుగా చుట్టి అందించాడు. భావకవి కాదు, బాధ కవి. నీటి కళ తెలిసిన పల్లె కవి. వస్తువు చెక్కిన మనిషిని తెలిపిన నగరకవి. మామూలు మాటలే అంతరార్థాన్ని పట్టిస్తాయి. ఉట్టి మాటలే కన్నీళ్లు తెప్పిస్తాయి. అల్కగనే చెప్తాడు. గొట్టు ముచ్చట తెలుస్తది. ఇది ఇతని శైలి. కైకట్టడం అంటే పేర్చడం కాదు, ఏరై కారడం. మనిషిలోని పూటికను వాడికే చూపించడం.
ఈ దారిలో ఇతడు నడిచాడు. నాస్టాల్జియాను నెమరువేస్తూ నిద్రపోతాడు. నిద్రపోతున్న పాఠకుడిని తట్టి లేపుతాడు. పల్లెను మానవీకరించి పరాయీకరణ ప్రభావాలను విశద పరుస్తాడు. తళుకు బెళుకు అక్షరాలను చెత్తబుట్టలోకి సారభూతమైన పదాలను గుండె గూటిలోకి నెట్టడం తెలిసిన పాఠకుడితడు. కొలతల లోకంలో మానవ విలువలు లెక్కతప్పడాన్ని గుర్తుచేస్తాడు. తిరుగుబాటును, పోరుబాటను జరుగుబాటు మార్గాలుగా ఉపమానీకరించి చెప్పడంలో భావుకత ప్రధాన భూమిక వహించింది. అధికారానికి దాసోహమయ్యే తీరును అందంగా వివరిస్తూ ఫలితాన్ని విషాదపుటంచున నిలబెడుతాడు. సంభాషణను కవితా నిర్మాణంగా స్వీకరించి స్పర్శను పంచుతాడు. గానశకలం లాంటి పదాలు పుల్లెందుల, నింగి నీళ్లు పోసుకుంటది లాంటి శీర్షికలు మనసును మురిపిస్తాయి. ప్రాంతోచిత భాష కొలుపు కొలుస్తది. కవితల్లోని భయద సౌందర్యం భ్రాంతిని పటాపంచలు చేస్తుంది.
– బీవీఎన్ స్వామి 92478 17732