తెలుగువాళ్లు ఇద్దరు కలిస్తే తెలుగులో తప్ప, ఇతర భాషల్లోనే మాట్లాడతారనేది ప్రచారంలో ఉంది. అలాంటిది దేశం కాని దేశంలో తెలుగును మరుగున పడనీయకుండా కాపాడుకోవడం గొప్ప విషయమే మరి. భారత్ నుంచి బతుకుదెరువు కోసం మారిషస్‌కు వెళ్లిన వ్యవసాయ కూలీలు దాదాపు 190 ఏండ్లుగా భాషను పరిరక్షిస్తూనే ఉన్నారు. తెలుగు భాషను నేర్చుకోవడంలో, పరిరక్షించుకోవడంలో, మారిషస్‌లో స్థిరపడిన తెలుగువారికి నాటి నుంచి నేటి వరకు ధర్మపురి నరసింహ శతకం ప్రధాన పాత్ర వహించడం విశేషం.
మారిషస్ ఆఫ్రికా ఆగ్నేయ తీర సమీపాన బహుళ సంప్రదాయాలు, మతాలు, సంస్కృతులు, భాషలకు చెందిన ప్రజలున్నారు. ఈ ద్వీప దేశ ప్రభు త్వం వెస్ట్ మినిస్టర్ పార్లమెంటరీ సిస్టం విధానంలో రూపొందింది. మారిషస్ పాలన, ఆర్థికం, రాజకీయ స్వాతంత్య్రాలు అత్యున్నత స్థాయిలో ఉన్నట్టు వర్గీకరించబడింది.
ప్రపంచవ్యాప్తంగా స్థిరపడ్డ తెలుగు వాళ్లలో మారిషస్‌లో ఉన్నవారిది ప్రత్యేక స్థానం. అక్కడున్న 12.5 లక్షలకు పైగా జనాభాలో లక్ష మందికి పైగా తెలుగువాళ్లుంటారు. వారంతా 1835లో బానిసత్వ నిర్మూలన నిర్ణయం జరిగాక మారిషస్‌కు వెళ్లినవారే. అక్కడకు వెళ్లి స్థిరపడిన వారంతా స్థానిక మారిషియన్ క్రియోల్ని మాతృభాషగా చేసుకున్నారు. వారిలో తెలుగువారూ ఉన్నారు. తమ పూర్వీకుల భాష తెలుగును సొంత భాష అని, క్రియోల్ తమ మాతృ భాష అని చెప్పుకోవడం వారి ప్రత్యేకత. వారు ఇళ్లలో కూడా క్రియోల్ భాషలోనే మాట్లాడుకుంటారు. అయినా వారికి తెలుగు మీద ఆసక్తి, అభిమానం ఉన్నాయి.
1835 నుంచి మారిషస్‌లో స్థిరపడిన మొదటితరం వారిలో నిరక్షరాస్యులు అధికంగా ఉన్నా, అందులోని చదువుకున్నవారు, తమ పిల్లలకు ఇసుకపై తెలుగు అక్షరాలు దిద్దించి, నేర్పించడం ప్రారంభించారు. తర్వాత బీచ్‌లలో ఇసుక తిన్నెలపై, (తాటి ఆకుల) తాళపత్రాలపై అక్షరాలను నేర్పించారు. అక్షరాలు గుణితం రాయడం వచ్చినా, ఉచ్ఛారణ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యేవి. వాక్య నిర్మాణం రాని, వ్యాకరణం అంతగా తెలియని, విషయ పరిజ్ఞానం అంతగా లేని స్థితిలో, మౌఖిక బోధన ద్వారా పిల్లలకు భాషపై అవగాహన కల్పించే కృషి సల్పారు. ఈ క్రమంలో ధర్మపురి నివాసి శేషప్ప కవి రాసిన నరసింహ శతకం ప్రధాన పాత్ర పోషించింది. ఆపాటికే తెలుగువారి స్వస్థలాల్లోనే గాక, ఇతర ప్రాంతాల్లోనూ మాధ్యమం ఏదైనా, తెలుగు విద్యార్థుల కోసం నరసింహ శతకం పాఠ్యాంశంగా ఉండేది. బ్రిటిష్, నైజాం పాలకుల హయాంలోనూ నరసింహ శతకం పద్యాలు అధ్యయన అంశాలుగా చేర్చబడి, కంఠస్థంగా ఉండేవి. సులభతరమైన భాష, ఆసక్తి కలిగించే విషయాలున్న నరసింహ శతకం పద్యాలను వీధి బళ్లల్లో కంఠస్తం చేయించేవారు. తద్వారా పిల్లలకు ఉచ్ఛారణలపై సాధికారికత కల్పించేవారు. అదే పద్ధతిని అనుసరించి మారిషస్‌లోనూ పిల్లలకు కంఠస్తం చేయించేవారు.
అక్కడి కొత్త తరం చాలా ఆసక్తిగా తెలుగు నేర్చుకుంటున్నది. ఒకటో తరగతి నుంచి యూనివర్సిటీ వరకూ తెలుగు నేర్చుకునే అవకాశం ఉంది. అక్కడి వారు తెలుగు సినిమాలు చూస్తుంటారు. మారిషస్ అధికారిక టీవీ ఛానల్లో కూడా వారానికి ఒక తెలుగు సినిమా వేస్తారు. డీడీ యాదగిరి ఛానల్ మారిషస్‌లో ప్రసారమవుతుంది. ఇక తెలుగు వారికోసం చాలా సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థల ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాల్లో అందరూ తెలుగులోనే మాట్లాడే ప్రయత్నం చేస్తారు. భాషే కాదు, సంస్కృతిపై కూడా వారికి ప్రేమ ఉంది. కూచిపూడికి మారిషస్‌లో ఆదరణ ఎక్కువే.
ఆ దేశంలో ప్రభుత్వం తెలుగు నేర్చుకోవడానికి ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నది. ప్రాథమిక స్థాయి నుంచి విశ్యవిద్యాలయ స్థాయి వరకూ తెలుగు నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. మారిషస్ యూనివర్సిటీలో తెలుగులో డిప్లొమా, డిగ్రీ కోర్సులు ఉన్నాయి. అంతేకాకుండా, మారిషస్ తెలుగు మహాసభ, తెలుగు సాంస్కృతిక కళా నిలయం, తెలుగు సాంస్కృతిక నిలయం, తెలుగు భాషా సంఘం వంటి సంస్థలు అక్కడ తెలుగు భాషను, సంస్కృతిని కాపాడటానికి ప్రయత్నిస్తున్నాయి.
-రామకిష్టయ్య సంగనభట్ల
94405 95494