అడగండి
తెలంగాణలో ప్రతి చెట్టును, ప్రతి గుట్టను
నీళ్లింకిన తెలంగాణ కనుపాపల్లోకి చూడండి
ఎడారిని మరిపించీ పచ్చటి పచ్చికను చేసిన తీరును
తెలంగాణ తన కళ్లతో తాను చూసుకున్నది
తెలంగాణ తల్లే ఈ గోసను చూడలేక
గంగమ్మ పొంగించి ఎండిన తెలంగాణ గొంతు తడిపింది
బీడు పడ్డ తెలంగాణను చిగురింపజేసేందుకే కదా
పగిలిన కవి కంఠాలు ఉద్యమ ఉద్విగ్న గీతాలయ్యింది
తెలంగాణను తెచ్చుకొంది అధికారాల కోసం కాదు
నేల తల్లి బిడ్డల కన్నీళ్లు తుడిచేందుకు
తెలంగాణను చిగురింపజేసేందుకు కదా!
మా నీళ్ళు మాకేనన్నది నినాదం కాదు,
మా బతుకురా అయ్యా…
నీళ్ళ కోసం మంచం బట్టి
నవిసిన నారాయణపురాన్నడుగు
ఎగువకు నీళ్ళెక్కవని గొంతు నులిమి
సంపిందెవరని చరిత్రనడుగు
నీళ్ళు లేక వూళ్ళన్నీ ఖాళీలై
గ్రామాలు గోడ్రాండ్లయి
వలసల బాట పట్టించినదెవడు?
ఎండిన తుమ్మచెట్లనడుగు
రాలిపోయిన రాయి చెట్టునడుగు
నేలకొరిగిన వీరుల స్థూపాలనడుగు
నీళ్ళను పారించమంటే నెత్తురు పారించినోళ్లు ఎవరని?
మూసి మురికి నీటినడగండి నిజాలు చెప్పుద్ది
చివరనున్న మా నడిగూడెం సెరువు అలుగునడుగు సెప్పుద్ది
కృష్ణా గోదావరుల సంగమమెట్ల జరిగిందో
చీదాల నడుగు
కుర్చీల కోసం పదవుల కోసం తెలంగాణను తెచ్చుకోలే
మూగజీవాలు కోతలకు పోతుంటే
పురుగుల మందు తాగి రైతుబిడ్డలు
శవాల పంటలైతుంటే
గుండె మండి అరిచిన తెలంగాణకు
ఆకాశమే ప్రతిధ్వనించింది
నీళ్ళ కోసమేగా తండ్లాడింది
నీళ్ళ కోసమేగా ప్రాణాలిచ్చింది
నీళ్ళ కోసమేగా నిప్పు రాజేసింది
అధికార పీఠాల మీద కులికితే కులకండి
గొంతెండుతున్న భూముల దప్పిక తీర్చండి
ధాన్యాగారంగా మారిన తెలంగాణను
దరిద్రంగా మార్చకండి
మీకిది మంచిది కాదు
తెలంగాణకు అపశకునమిది
తల్లి స్తన్యాన్ని అందకుండా చేయకూడదురా
పంటలకు నీళ్ళియ్యాలి కానీ, ఎండిన పంటల్ని
గొర్రెలు తింటున్నాయి చూడండ్రా
కృష్ణా గోదావరిల సంగమం చీదాలలో
నేల చీలి నీళ్ళ కోసం గోస పడుతోంది.
కల్లాలు కన్నీళ్ళతో నిండుతున్నాయి
గొంతెండి పోతుంది గోదారి రావమ్మ
కృష్ణమ్మ ఉప్పొంగు కన్నీళ్ళను తుడిచేందుకు
ఈ నేలను శాంతింపజేసేందుకు…
(సూర్యాపేట జిల్లా చీదాలలో ఎండిన పంటలను గొర్రెలు తింటున్న సన్నివేశాన్ని చూసి కంట నీరు పెట్టిన జగదీశ్వర రెడ్డిని చూసి…)
– జూలూరు గౌరీశంకర్