తెలంగాణ సాహిత్య అకాడమీ చేపట్టిన అనేక ప్రాజెక్టులలో ‘తెలంగాణ సాహిత్య గ్రంథ సూచి’ నిర్మాణం ఒక బృహత్కార్యక్రమం. ఇలాంటి సాహితీ ప్రాజెక్టులకు ప్రధానంగా విషయ సేకరణ ఒక యజ్ఞం లాంటిది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సాహిత్యపరంగా తన అస్తిత్వాన్ని, మూలాలను పలు పార్శాల నుంచి అన్వేషించుకుంటూ మరుగున పడిన వైభవాన్ని పునర్నిర్మాణం చేసుకునే దిశగా సాగుతున్నది. తన వంతు బాధ్యతగా తెలంగాణలోని మేధావుల, కవుల, రచయితల, సాహితీవేత్తల సృజనను బయటి ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరాన్ని సాహిత్య అకాడమీ గుర్తించి ‘తెలంగాణ సాహిత్య గ్రంథ సూచి’ని తీసుకురావాలనే ఆలోచన చేసింది. అప్పటి అకాడమీ తొలి అధ్యక్షులు డాక్టర్ నందిని సిధారెడ్డి, తొలి కార్యదర్శి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి వారి నిర్ణయాత్మకమైన ఆలోచనను సాకారం చేస్తూ అట్టెం దత్తయ్య ప్రధాన సంపాదకత్వంలో, సహ సంపాదకులు డాక్టర్ యెల్చాల నర్సింలు, డాక్టర్ మ్యాతరి ఆనంద్, వర్ధ వేణుల సహకారంతో ఈ గ్రంథ సూచి కార్యక్రమంలో అనేక సమస్యలు ఎదురైనా విజయవంతంగా పూర్తిచేయడం గొప్ప విషయం.
కార్యనిర్వాహక సంపాదకులుగా అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి వ్యవహరించగా, ఆచార్య వెలుదండ నిత్యానందరావు చెప్పినట్టుగా ఈ సూచి ఆధారంగా ఏయే ప్రాంతాల్లో ఎలాంటి స్పందన లభించిందో గమనించవచ్చు. స్థానిక ప్రసిద్ధులను గుర్తించవచ్చు. ఈ సాహిత్య గ్రంథ సూచిలో రచయిత పేరు, గ్రంథం పేరు, ప్రక్రియ, ప్రచురించబడిన సంవత్సరం, పుటలు, వెల, ప్రచురణ సంస్థ ఇత్యాది వివరాలను పట్టిక రూపంలో పొందుపరిచారు. 706 పేజీలలో దాదాపుగా 14,120 పైచిలుకు గ్రంథ వివరాలున్నా యి.
అన్నిరకాల సాహిత్య ప్రక్రియలు వచన కవిత, కథలు, పాటలు, శతకాలు, వచనాలు, జీవిత చరిత్రలు, మోనోగ్రాఫ్, నాట కం, గేయాలు, పరిశోధనలు, కావ్యా లు, ఉద్యమ చరిత్రలు, ఆధ్యాత్మిక రచనలు, యక్షగానం, నవల, యాత్రా చరిత్ర, విమర్శ, అనువాదాలు, వ్యాసాలు, బాల సాహిత్యం ఇంకా ఇతర రచనా ప్రక్రియల విషయాలను సేకరించి ఇచ్చారు. ఈ విషయ సేకరణ వాటి ప్రచురణ ద్వారా తెలంగాణ ప్రాంతంలో వెలుగు చూడని అన్ని ప్రక్రియలలోని సాహిత్య గ్రంథాలను ఒకచోట చేర్చి సాహితీ ప్రపంచానికి అందజేసే అవకాశం లభించింది.
ఒక జాతి బహుముఖీనమైన సమగ్రాభివృద్ధిలో సంస్కృతి, సాహిత్యాలది ప్రముఖ స్థానం. భాషా సాహిత్యాలు ఒక జాతి వికాసానికి ముఖ్యాంగాలనడం అతిశయోక్తి కాదు. వర్తమాన తరానికి దిశానిర్దేశం చేసేవిధంగా అనేకమైన విశేష సాహితీ కార్యక్రమాలు చేపట్టడమే గాక అరుదైన గ్రంథాలను ప్రచురించి అందుబాటులో ఉంచుతూ ముందుచూపుతో అనేక సాహితీ ప్రాజెక్టులను కూడా భవిష్యత్తు ప్రణాళికలుగా వేసి నడిపించిన సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు నందిని సిధారెడ్డి నిబద్ధత, ముందుచూపు హర్షించదగినది. వారి బాటలోనే నడుస్తూ ఈ బృహత్ ప్రయత్నాన్ని నడిపించిన డాక్టర్ నామోజు బాలాచారికి, బాధ్యతలను భుజానికెత్తుకొని కార్యాన్ని సాధించినందుకు ప్రధాన సంపాదకులు అట్టెం దత్తయ్య బృందానికి అభినందనలు.
– డాక్టర్ రూప్‌కుమార్ డబ్బీకార్ 99088 40186