తెలంగాణ జన జీవితంతో పెనవేసుకున్న జానపద కళారూపం పిట్టల దొర. సమాజంలో మంచిని చెప్తూ, చెడును వ్యంగ్యంగా ప్రశ్నిస్తూ, సమాజాన్ని మేల్కొలిపే నిజమైన వైతాళికులు ఈ తుపాకీ రాముళ్లు. ఈ జానపద కళారూపాన్ని బుడిగెజంగాలు ప్రదర్శించేవారు. మొదటగా కూచిపూడి బాగవతులు ఈ జానపద వృత్తిని ఆశ్రయించి జీవనం కొనసాగించారు. నాటి తెలంగాణ సమాజంలో ప్రగల్భాలు పలికేవారు తరచూ తారసపడే రోజుల్లో ఇలాంటి కోతల రాయుళ్లను ఎండగట్టి, వారి నిజస్వరూపాన్ని బహిర్గతం చేసేవారు. ఇలాంటివాళ్లను చూసి నవ్వుకోవడం సమాజానికి పరిపాటి. కానీ, వారు చెప్పే విషయాలను విని కొందరైనా ఆలోచించే వ్యక్తులు లేకపోలేదు. చాలా జానపద కళారూపాల్లో హాస్యం పోషించబడుతుంది. కొంతైనా బూతు లేకపోతే కవిత్వాన్ని తిరస్కరించేవారు కూడా లేకపోలేదు. అలాంటిది జానపద కళారూపాల్లో హాస్యానికి ప్రత్యేకమైన స్థానం కల్పించారు జానపదులు. తోలుబొమ్మలాటలో, వీధి భాగవతాల్లో, జంగం కథల్లో, హరికథల్లో హాస్యాన్ని పోషించడానికి ప్రత్యేకమైన పత్రాలుండేవి.
ఈ తుపాకీ రాముడి జానపద కళారూపంలో వేషధారణ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. చారిత్రక నేపథ్యంగా చూసినా, సమాజ సంస్కృతి, సంప్రదాయబద్ధంగా చూసినా ఈ జానపద కళారూపం వాటిలో ప్రతిబింబిస్తుంది. తుపాకీ రాముని వేషం ధరించేవారు ఖాకీ రంగు ప్యాంటు, అదే రంగు పాత చొక్క, తల మీద ఇంగ్లీషువాళ్లు ధరించే టోపి, భుజం మీద కర్ర తుపాకీ, ఎడమ భుజానికి జోలె వేసుకొని, ఒక కాలు ప్యాంటు చివరను పైకి మడుస్తారు. కొంత మంది వేషంలో చిరిగిన మేజోళ్లు, పాత బూట్లు తొడుక్కొని, జేబులో బీడీలు పెట్టిన సిగరెట్ ప్యాకెట్టు పెట్టుకొని విచిత్రమైన వ్యక్తిలా సమాజానికి కనిపిస్తారు. దాదాపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఈ తుపాకీ రాములు కనిపిస్తారు. పూర్వ కాలంలో ‘వెంకట్రాముడు’ అనే బుడిగె జంగం కళాకారుడు ఈ తుపాకీ రాముడి వేషం ధరించి సమాజంలో తనకంటూ గొప్ప స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. ఈ జానపద కళారూపంలో వేషం వేసే ప్రతి ఒక్కరిని ‘తుపాకీ వెంకట్రాముడు’ అని పిలవడం పరిపాటిగా మారింది. రాన్రాను విభిన్న పాటాంతరాల సమన్వయంతో ‘వెంకట’ అనే పదం జారిపోయి తుపాకీ రాముడిగా వ్యవహారమైంది. ఈ తుపాకీ రాముడు జానపద కళారూపం వైయుక్తిక కళారూపం. ఒక్కరే ఈ కళారూపాన్ని ప్రదర్శిస్తారు. తన దగ్గర ఉన్న కర్ర తుపాకీతో కాకులు మొదలైన పక్షులకు గురిపెట్టి ‘ఢాం’ అని నోటితో శబ్దం చేస్తూ అందరినీ నవ్విస్తుంటాడు. కాబట్టి, క్రమేణా అతన్ని ‘పిట్టల దొర’ అని పిలవటం మొదలైంది. తెలంగాణ సమాజంలో ‘లత్కోర్ సాబ్’ అనే పేరుతో కూడా ఈ జానపద కళారూపం ప్రసిద్ధి.
ఈ తుపాకీ రాముడు తన ప్రసంగాన్ని యుద్ధ పరాక్రమంతో మొదలుపెట్టి, దేశాన్ని పాలించే రాజు వద్ద ఉన్న మంత్రులను పరిచయ వాక్యం చేస్తాడు. అందరికంటే తానే రాజుకు అత్యంత సన్నిహితుడినని, రాజు తన సలహా తీసుకోకుండా ఏ పని తలపెట్డడని, తను లేకుంటే రాజుకు ఏ పని చేతకాదని చెప్పుకొంటాడు. తాను గల్లా వసూలుకు బయల్దేరానని, ప్రజలందరికీ ‘బంగ్లా’లు కట్టిస్తున్నానని, తన బంగ్లా (బంగళా) వద్ద ప్రజలకు విందు ఏర్పాటుచేశానని, ఆ విందు ఏర్పాట్లను వివరిస్తాడు. తన వద్ద ఉన్న బంగారాన్ని కుక్క ముడితే బావిలో పారేశానని, మీకు కావాలంటే మేలు రకానికి వడ్లను పంపిస్తానని, తన వద్ద ఉన్న వరి రకాలను చెప్తుంటాడు. తన అత్త పెండ్లి కోసం గల్లా వసూలు చేస్తున్నానని, దేశంలోని గొప్ప గొప్పవాళ్లు తన అత్తపెండ్లికి వస్తున్నారని, పెండ్లి ఏర్పాట్లు గొప్పగా చేస్తున్నానని చెప్తాడు. కాబట్టి ఊళ్లోవాళ్లంతా వెంటనే ఇంటికి మానెడు ధాన్యం కొలవాలని పురమాయిస్తాడు. హాస్యం పండించే విధంగా పైన పేర్కొన్న ఘట్టాలకు సంబంధించిన మాటలు వల్లిస్తూ, వాచికానికి అనుగుణమైన ఆంగికాన్ని అభినయిస్తాడు. ఈ వేషానికి సంబంధించిన ప్రసంగ పాఠానికి మించి, ప్రజల మెప్పు పొందటంలో విజయం సాధిస్తాడు.
తుపాకీ రాముడు తన ప్రతాపాన్ని నవ్వు పుట్టించే విధంగా చాటుకుంటాడు. ప్రజలకు తాను కట్టించే బంగ్లాల గొప్పతనాన్ని ఈ విధంగా తెలియజేస్తాడు. ‘ఇక్కడ ఊరి బైట ఇప్పుడు సర్కారు బంగ్లాలు గట్టిస్తున్న. పెద్ద పెద్ద బంగ్లలు వడ్తున్నయి. వేడంత్రాల బంగ్లాలు. బంగ్లకొక్క లక్ష రూపాయల్ కర్సైపోతున్నయి. జద్దాల జిలేమాల్.. గాలివెడ్తె గల గల. వాన వడ్తె జల జల.. తుంగవి వాసాలు.. వరిగడి దూలాలు. వర్యాకు కప్పు, ఏపవి నిచ్చెన్లు, మీదికెల్లి వాన వడ్తా వుంటె, బంగ్లా కింది కెళ్లి వాన నీళ్లు పడిపోతున్నయి. అటువంటి గట్టి బంగ్లాలు గట్టిపిస్తున్న ఇప్పుడు’ అంటూ అపూర్వ, విచిత్రమైన బంగళాల నిర్మాణాన్ని వివరించి వినోదం కలిగిస్తాడు. బంగ్లా వద్ద ఇచ్చే విందు విశేషాలను ఇలా తెలుపుతాడు. ‘బంగ్లా కాడ దావత్ జెయ్యనీకి బియ్యం గొండవొయిన.
చెరువుల నానబోసి తూముకింద మంట బెట్టిన. పొట్టు పలావ్ జేసిన. తెడు చాయ్ జేసిపెట్టిన. చాలామందిని పిలువనంపిన. భోజనాలకు మొకం కడుక్కొని రమ్మంటే, కడుక్కోకనే వొచ్చిండ్రు. వాళ్లకు ఏం కూరగాయలు వొండిపెట్న అనుకున్నావు మారాజా. అటువంటి కూరగాయలు మీరు గూడంగ ఎన్నడు రుచిచూసిండరు. అంత మంచి కూరగాయలు జేపిచ్చిన. పొవ్వాకిత్తుల పొగు సేపిచ్చిన, గాంచునూనె తాలింపేసిన. ఒక సంచి ఉప్పు బోసిన. ఒక మిరపకాయేసిన మారాజా. ఒక బస్త యాపకాయ దెచ్చిన. పచ్చిపులుసు పిసికి పెట్టినాను వాళ్లకు. పొట్ట నిండా అన్నం తినాల్నని జమ్మాకేమో ఇస్తార్లేసిన. తుమ్మాకేమో డొల్లలు గుట్టిచ్చిన. ముగ్గురి నడుమ ఒక్క మెతుకు ఇడ్సిపెట్టిన. పొట్ట నిండా తింటావున్నరు. పొట్ట మీద బట్టేసుకొని వచ్చిండ్రు. బట్టెందుకంటే దిష్టి తగులకుంట మా రాజా. మిగిలిన అన్నమంతా పెంట మీద పారేస్తా ఉంటే కుక్కులుగూడంగ దింటలేవు’ అంటూ కనీవినీ ఎరుగని రీతిలో భోజన పదార్థాలను వడ్డించిన, అద్భుతమైన విందును నవ్వులూరే విధంగా గబ గబా చెప్పుకొని పోతాడు. ఈ విధంగా తుపాకీ రాముని వేషం, పల్లె ప్రజలకు ఆనందాన్ని, హాస్యాన్ని అందిస్తూ, జానపద కళలలో విశిష్ఠమైన స్థానాన్ని సంపాదించుకున్నది.
– కర్నె మల్లికార్జున్ 6303744239