తూరుపున వేకువ కళ్ళు
తెరుచుకుంది
కలల తలుపులకు తాళాలు వేసి
మస్తిష్కం మేల్కొంది
సౌందర్యాన్ని పూయిస్తున్న వాతావరణంలో
గాలి చిలిపి పరుగులు తీస్తుంది
ఆలోచనల లోయల్లో పచ్చని
లేత ఆకులు రెపరెపలాడాయి
సెరొటోనిన్, ఎండార్ఫిన్లు చేసే
రసాయన చర్యలతో మనసు
తన నిండా ఉత్సాహాన్ని నింపుకుంది
2
అడెల్లు దాటినాక అడవి
షేక్ సౌ లొద్ది నుంచి మొదలయ్యే
మహబూబ్ ఘాట్ రోడ్డు మెలికలు
తిరిగి పడుకున్న నల్లని అనకొండలా ఉంది
రోడ్డుకిరువైపులా గగనాన్ని తాకే పచ్చదనం
అద్భుత దృశ్యరూపం కళ్ళప్పగించి చూసే కళాఖండం
లేత పెదవుల మీద విరబూస్తున్న తెల్లని
ముత్యాల్లా రాలుతున్న చినుకులు
దూరంలో చిత్రకారుడు తన కాన్వాస్‌పై
గీసిన చిత్రంలా ఉంది గోదావరి
నవ్వులు చిలకరిస్తూ ఆహ్వానం
పలుకుతుంది
మంచు దుప్పటి కప్పుకున్న గ్రామాలు
సూక్ష్మ రూపాన్ని ధరించినట్లుంది
అక్కడి గిరిజనుల మనసుల నిండా
మంచితనం
3
కళ్ళ నిండా పచ్చదనం మనసంతా
వెచ్చదనం
కళ్ళల్లో పరుచుకున్న పచ్చని ఊహలు
బతుకుకు భరోసానిచ్చే ఆవరణం
అది ఊహల్లో బతికే స్వప్నాలను
ఉనికిలోకి తెస్తుంది
ఆకాశంలోని చిత్రాలను చూస్తే
జీవితం మీద ఆశను చిగురింపజేస్తాయి
చల్ల గాలి పిలుపులను సందె కాంతి
మలుపులను ఏకాంతపు కన్నులు
గమనిస్తున్నాయి
4
లేత ఆకుల మీది నీటి చుక్కలు
అక్కడి యాడీల రవికల మీద
ఉన్న అద్దాల్లా మెరుస్తున్నాయి
మనసంతా పచ్చదనంతో నాకు నేను
అడవిగా మారిపోయాను
కోయిల పిలుపులు కోనల్లో రాగాల
చినుకులై కురుస్తున్నాయి
అక్కడక్కడా పురివిప్పిన నెమళ్ళు
కనుల విందు చేస్తున్నాయి
పచ్చని రామ చిలుకలు అడవి
పచ్చదనాన్ని పెంచాయి
ఆమని మాటే మరచిన అడవిని మేఘం
తడిపేసింది
5
ఘాట్ రోడ్డు మీద కారు
ఆయాసపడుతుంది
పరిగెట్టడం మరిచి నడుస్తుంది
అద్దం మీద ఫాగ్ (మంచు)
కమ్ముకుంటుంది
కారు లోపల చల్లని కుంపటి
వణుకు పుట్టించే స్థితి
రోడ్డు పక్కన ఛాయ దుకాణాల్లో
రేపటి మీద ఆశ లేని వృద్ధుల
నిస్సహాయపు నవ్వులు విరబూస్తున్నాయి
మైదాన ప్రాంతాల జాడ్యాలు
లేని ఆ అమాయకపు ముఖాల్లో
ఇప్ప పువ్వు పూసినట్లుంది
ఏ టెన్షన్ లేని అమాయకపు
పసి నవ్వులు రోడ్డు పక్కన
ఆడుకుంటున్నాయి
6
గుట్టను చీల్చుకుంటూ వచ్చే వాగు
పచ్చని చెట్ల కింద సేద తీర్చుకుంటూ
సాగుతోంది
కల్మషం లేని వాగు నీళ్ళు అక్కడి
గిరిజనుల మనసుల్లా ప్రవహిస్తున్నాయి
మహబూబ్ ఘాట్ ప్రయాణికుల
దాహం తీర్చే దాపు
వాగులో మౌనంగా సాగిపోయే
నీళ్ళ సోయగాలు నిద్ర పోని అడవికి
నిగరానీ కాస్తుంది
ఆ స్వచ్ఛదనం అక్కడి గోండుల
స్వచ్ఛతకు పతాక
ఆ నీటిలో మన ముఖం అద్దంలో కన్నా
అందంగా కనిపిస్తుంది
7
అడవి నుంచి రోడ్డు మీదకు వచ్చిన
వానర మూక సందడి చేస్తుంది
పరిగెడుతున్నాయి…
ఆడుకుంటున్నాయి
ఆహ్లాదకరమైన వాతావరణాన్ని
ఆస్వాదిస్తున్నాయి
అప్పుడప్పుడు వాహనాల చక్రాల
కింద పడి నుజ్జు నుజ్జు అవుతున్నాయి
వానర సమూహంలో విషాద ఛాయలు
కళ్ళల్లో తడి.. కనురెప్పలు
తడిచే సన్నివేశం
స్పందించే హృదయంలోనే తడి
ఉంటుంది
ఒక మరణం కొన్ని జీవితాల్లో
అమావాస్యను వెలిగిస్తుంది
తుప్పర చినుకులు కారు అద్దాన్ని
కమ్మేస్తున్నాయి
ఒక కన్నీటి తెర కళ్ళను
మసకబారుస్తుంది….
(నిర్మల్ నుంచి ఆదిలాబాద్‌కు ఘాట్ రోడ్డు మీద ప్రయాణించినప్పుడు కలిగిన అనుభూతులు)
– ప్రమోద్ ఆవంచ 70132 72542