కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎగవేతలు, కోతలు సర్వసాధారణమమైపోయాయి. ముఖ్యంగా రైతులకు ఇచ్చిన హామీలు అటకెక్కాయి. పెట్టుబడి సాయం దాగుడుమూతలు ఓ పక్కన, విత్తనాలు, ఎరువులు అందుబాటులో లేకపోవడం మరోపక్కన.. రైతును ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయడంలోనూ సర్కార్ కొర్రీల మీద కొర్రీలు పెడుతూ నరకం చూపిస్తున్నది. వరి రైతులకు బోనస్ అన్నారు. కానీ ఆచరణలో సున్నా చుడుతున్నారు. ఎలా ఇవ్వాలని గాకుండా ఎలా ఎగ్గొట్టాలనేది సర్కార్ ధోరణిలా కనిపిస్తున్నది. మొన్న సీఎం జరిపిన వ్యవసాయశాఖ సమీక్షలో బోనస్‌ను మైనస్ చేసేందుకు సన్నరకాలను తగ్గించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏ రకం ధాన్యం వేయాలో సర్కార్ నిర్ణయించడం అంటే రైతన్న మెడపై ప్రభుత్వం కత్తి పెట్టడమే అవుతుంది. మ్యానిఫెస్టోలో అన్ని రకాల పంటలకు రూ. 500 బోనస్ అన్నారు. తర్వాత వరికి మాత్రమే అన్నారు. ఇప్పుడు మాటమార్చి 33 రకాల సన్నాలకు పరిమితం చేశారు. ఇప్పుడు దాన్ని 7 రకాలకు తగ్గించారు. అలాగైతే ఇప్పటికే నారు వేసిన రైతుల పరిస్థితి ఏమిటి? ఏడు రకాల సన్నాలకు మాత్రమే బోనస్ ఇవ్వాలన్న అనాలోచిత నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. రెండు యాసంగి పంటల బోనస్ ఇంతవరకు రైతుల కాతాలో జమచేయకుండా మాటలతోనే సరిపెడుతున్నారు.
ఇక ఇప్పటి పంటలపై రైతులు ఆశలు ఎలా పెట్టుకుంటారో సర్కార్కే తెలియాలి. ఇదంతా అసలు ధరకు అదనంగా ఇస్తామన్న కొసరుకు సంబంధించిన గొడవ. అసలు మద్దతు ధరల మాటేమిటన్న ప్రశ్న ఎప్పుడూ వేలాడుతూనే ఉంది. ఈసారి పంటలను మద్దతుధరకు కొంటామని ప్రభుత్వం హామీ ఇస్తుందా? దానికి గ్యారెంటీ ఏమిటి? యాసంగి మాదిరిగానే రైతులను రోడ్డున పడేస్తుందా? అన్నదాతల పట్ల ఇంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఏమున్నది? రైతులంటే ఈ ప్రభుత్వానికి ఎందుకు అంత కోపం? రైతు బంధు, పంట బీమా, రైతు బీమా గురించి సమావేశంలో అసలు సమీక్షే జరుగలేదు. అంటే ఇవేవీ సర్కార్ ఎజెండాలో లేవని అనుకోవాలా? గత మూడు సీజన్లకు రైతు భరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం గత యాసంగికి రెండు ఎకరాలకు రైతుభరోసా ఇచ్చి చేతులు దులుపుకుంది. 45 రోజుల్లో ఇస్తామని సిద్దిపేట వేదికగా సీఎం చెప్పి 85 రోజులు దాటింది.
ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకే దిక్కూదివాణం లేకుండా పోయింది. మాటలే తప్ప చేతలుగా మారవని మరోసారి తేలిపోయింది. ఠంచనుగా పడాల్సిన పెట్టుబడి సాయం దైవాధీనం సర్వీసుగా మారింది. 5 నెలలుగా రైతు బీమా కిస్తీ కట్టకుండా, రైతు కుటుంబాలకు భద్రత, భరోసాను లేకుండా చేశారు. పంట మార్పిడీ అంటూ గొప్పలు చెప్తున్న రేవంత్‌రెడ్డి.. మాటలు నమ్మి గత సీజన్ లో మొక్కజొన్న, జొన్న, పొద్దు తిరుగుడు, సోయా, వేరుశనగ సాగు చేసిన రైతుల పరిస్థితి రోడ్డు పాలైంది. మేనిఫెస్టోలో చెప్పినట్లు అన్ని రకాల పంటలకు పంట బోనస్ చెల్లించాలి. గత యాసంగి, ఈ యాసంగి పంటలకు పెండింగ్ పెట్టిన బోనస్ డబ్బులు వెంటనే రైతు ఖాతాల్లో జమ చేసి ప్రభుత్వం తన చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సి ఉంది.