అవును, కథ చెప్పడం ఒక కళ. తాను కథ చెప్పి, పిల్లల చేత కథాకథనంగా చెప్పించడం మరొక గొప్ప కళ. తాను ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు విద్యార్థులకు ఒకవైపు పాఠాలు బోధిస్తూనే విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతకు పదునుపెట్టి వారిచేత ఉపాధ్యాయులు ఎన్నో రచనలను చేస్తున్నారనేది నిస్సందేహం. ఆ కోవలోకి చెందిన బాల కథకులు, బాల సాహిత్యానికి పెద్దన్న, దిక్సూచి గరిపల్లి అశోక్. తాను ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ చెందినా, పిల్లలతో తనకున్న అనుబంధాన్ని మరిచిపోలేదు. అందుకే, పిల్లలు చేసిన అల్లరి, ఆటపాటలను మదిలో భద్రపరిచారు. వాటిని నెమరు వేసుకుంటూ బడిలో జరిగిన సన్నివేశాలను చక్కటి కథల రూపంలో మనకు అందిస్తున్నారు. ఇది ఆయనకు కొట్టిన పిండి.
అశోక్ రాసిన కథలన్నీ చదువుతుంటే నాటి జ్ఞాపకాలు ఒకసారి మదిని ముసురుకుంటాయి. మనకు మనమే మళ్లీ బాల్యంలోకి వెళ్లిపోతాం. అలాంటి చక్కటి కథకుడు గరిపెల్లి అశోక్ . ఆయన కలం నుంచి జాలువారిన 11 కథల సంపుటి ‘గోటీలాట’. ‘బఠాణీలు’ కథలో ఒంటరిగా ఉన్నప్పుడు ఒకరే తినాలి, స్నేహితులతో ఉన్నప్పుడు, అందరు కలిసి తినాలి ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునే ధోరణిని వివరించారు. ఇది విద్యార్థులకు చక్కటి సందేశం. మరో కథ ‘పిప్పరమెంటు’ ఈ కథలో ఒకటే చాక్లెట్ను ఇద్దరూ తీసుకోవాలని టీచర్ చెప్తుంది. అప్పుడు కాకి ఎంగిలి చేసి ఒకే చాక్లెట్ను పరసర్ప సహకారంతో విద్యార్థులు ఇద్దరు పంచుకుంటారు. విద్యార్థుల్లో పరస్పర సహకారభావం పెంపొందించేలా కథను చెప్పటం అభినందనీయం.
పుస్తకాల్లో ఉన్నది మాత్రమే చదువు కాదని, అంతకుమించి బతుకు పాఠాలు మరెన్నో ఉంటాయని ‘ఎండ్రికాయలు-చేప’ కథలో పాఠకులు తెలుసుకుంటారు. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మధ్య చక్కటి అనుబంధాన్ని తెలిపే మరో కథ ‘మక్క కంకులు’. పిల్లలు ఆడే గోటీలతో లెక్కల మాస్టారు సురేష్ గణితబోధనకు ఉపయోగించడం అతని సృజనాత్మకతకు నిదర్శనం. ఇలా చెప్పుకుంటూ పోతే ‘గోటీలాట’ పుస్తకంలోని ప్రతీ కథ ఒక అణిముత్యమే. అందుకే ‘గోటీలాట’ ఈ కథల సంపుటి అందరూ తప్పక చదవాల్సిందే. ఇందులో ఉన్న ప్రతీ ఒక కథ ఒక మంచి సందేశాన్ని అందించింది. ఇలాంటి కథలు మరెన్నో అశోక్ సార్ కలం నుంచి జాలువారాలని కోరుకుంటూ రచయితకు శుభాకాంక్షలు.
– యాడవరం రేవంత్ గౌడ్ 94417 62105