తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ 2025,నవంబర్ 21 నాడు చెన్నైలోని ఒక సమావేశంలో సంస్కృత భాషను మృతభాషగా పేర్కొంటూ ఆ భాష కోసం కేంద్ర ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయించడాన్ని ప్రశ్నించారు. తమిళ భాషకు ఎక్కువ నిధులు ఇవ్వాలని కోరడంలో తప్పులేదు. కానీ, మరో భాషను, అందునా భారత సంస్కృతికి ఆధారమైన సంస్కృత భాషను కించపరచడం అజ్ఞానమే కాదు, హద్దులు మీరిన అహంకారం కూడా.
మనం నిత్యం ఆలపించే జాతీయగీతం జనగణమన ఉన్నది సంస్కృతంలోనే. వందేమాతరం కూడా సంస్కృతమే. రాజ్యాంగం 8వ షెడ్యూల్లో ఇతర ప్రాంతీయ భాషలతో పాటుగా సంస్కృత భాషను పొందుపరిచారు. మరి అది మృత భాష ఎలా అవుతుంది? చీటికీ మాటికీ రాజ్యాంగం
పవిత్రత గురించి నీతులు చెప్పేవారు దీన్ని విస్మరించి సంస్కృతాన్ని మృతభాష అంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్టు కాదా? సంస్కృతం ఒక మతం భాష కాదనీ, అది మన జాతీయ సాంస్కృతిక వారసత్వ భాష అని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 1994లో సంతోష్ కుమార్
తదితరులు ప్రతివాది కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ కేసులో తీర్పు ఇచ్చింది. ప్రతిరోజూ కోట్లాది హిందువుల ఇండ్లలో, దేవాలయాల్లో చేసే ప్రార్థనలు, పూజలు సంస్కృతంలోనే ఉంటాయన్న కనీస ఇంగితజ్ఞానం లేని వ్యాఖ్యలివి.
సంస్కృతం ఒక మతానికి చెందిన భాష కాదు. అది భారత జాతీయ భాష. సంస్కృతం ఒక మృతభాష కాదు. అది వేల ఏండ్లుగా కొనసాగుతున్న అమృత భాష. సంస్కృతం ఒక వర్గం (బ్రాహ్మణ) భాష కాదు. అది భారతీయులందరి సాంస్కృతిక వారసత్వ భాష. సంస్కృతం ప్రాచీన గ్రంథాలకే పరిమితమైన గతం భాష కాదు. భారతీయ భాషల్లో పాలూ తేనెలా కలిసిపోయిన జీవ భాష. మన దేశంలో సంస్కృత భాష పదాలు, ప్రభావం లేని ప్రధాన ప్రాంతీయ భారతీయ భాషలు లేవు. ఆసేతు హిమాచలం ప్రజల పేర్లలో సంస్కృత పేర్లు పెనవేసుకుపోయి సొంత భాషగా పరిగణించబడుతున్నాయి. ద్రావిడ ప్రత్యేకతను నొక్కిచెప్పే పెరియార్ రామస్వామి పేరులో రాముడు, స్వామితో సహా ఇప్పటి ఉదయ, నిధి కూడా సంస్కృత పేర్లే కదా? సంస్కృతం చచ్చు భాష అయితే, మరి సంస్కృత పేర్లున్న వీరు మృతజీవులా? ఇంతెందుకు, మన పొరుగున ఉన్న నేపాల్లో జాతీయ భాష నేపాలీ భాష లిపి దేవనాగరి (సంస్కృతం) లిపియే. ప్రాంతీయ తత్త్వం వేర్పాటువాదం కారాదు. ప్రాంతీయ ప్రత్యేకత జాతీయ సమైక్యతకు భంగం కలిగించరాదు. ద్రావిడ భాష గొప్పదనాన్ని చాటడానికి సంస్కృత భాషను కించపరిచనవసరం లేదు.
సంస్కృత భాష ఔన్నత్యాన్ని ఎందరో చరిత్రకారులు, భాషాపండితులు, తాత్త్వికులు, నాయకులు కీర్తించారు. సంస్కృతం ఒక వర్గం, ఒక మతం భాష కాదు. అది భారతీయులందరి భాష అని మాజీ భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అన్నారు. సంస్కృత భాషాధ్యయనం చేయకుండా ఎవరు నిజమైన భారతీయుడు కాలేడు. యధార్థమైన విద్యావంతుడూ కాలేడని భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ సీవీ రామన్ చెప్పారు.
అన్ని యూరోపియన్ భాషలకు తల్లి సంస్కృతం. భారత మాతృదేశం అనేక విధాలుగా మనందరి మాతృదేశమని ప్రముఖ చరిత్రకారుడు విల్ డ్యూరాంట్ స్పష్టం చేశారు. సంస్కృత సాహిత్యానికి యూరప్వాసులు ఎల్లప్పుడూ మేధో రుణగ్రస్థులై ఉంటారనేది కాదనలేని సత్యమని బ్రిటిష్ భాషావేత్త, సంస్కృత విద్వాంసుడు, ప్రొఫెసర్ మాక్డోనెల్ తెలియజేశారు.
భారతదేశంలో ఉన్న అత్యున్నత సంపద ఏది? దాని గొప్ప వారసత్వం ఏది? అని నన్నడిగితే… నిస్సందేహంగా అది సంస్కృత వాఙ్మయం-దానిలో నిక్షిప్తమైన సాహిత్యమంతా అని చెప్తాను. మన ప్రజల జీవనంలో ఈ సాంస్కృతిక వారసత్వం భాగమై ప్రభావితం చేసినంతకాలం, భారతీయ మౌలిక చేతన సజీవంగా ఉంటుందని జవహర్లాల్ నెహ్రూ తన డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకంలో వివరించారు.
ప్రపంచంలో ఏ భాషలో లేనంత విస్తృతమైన, ఇప్పటికీ పండిత, పామరులను ఆకట్టుకునే వాఙ్మయం సంస్కృతంలోనే ఉన్నది. నాలుగు వేదాలు; ద్వాదశ ఉపనిషత్తులు, వేదాంగాలైన శిక్షా, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పాలు; రామాయణ, మహాభారతాది ఇతిహాసాలు, దార్శనిక భగవద్గీత, 18 పురాణాలూ, 18 ఉప పురాణాలూ, 18 ఉపోప పురాణాలూ; నారద, పరాశర, మనుస్మృతి వంటి ధర్మశాస్ర్తాలు; పతంజలి యోగసూత్రాలు, పాణిని వ్యాకరణ సూత్రాలు, కౌటిల్యుడు తదితరుల అర్థశాస్ర్తాలు; వాత్సాయనుడు తదితరుల కామశాస్ర్తాలు; పన్నెండు దర్శనాలు (ఆరు ఆస్తిక, ఆరు నాస్తిక దర్శనాలు); ఆయుర్వేదం, గాంధర్వ వేదం, ధనుర్వేదం, శిల్పవేదం, అలంకార శాస్త్రం, తంత్రశాస్ర్తాలే గాకుండా, అనేక భౌద్ధ, జైన మతగ్రంథాలు, నీతి శతకాలు సంస్కృతంలో ఉన్నాయి. కల్హణుడు రాసిన కాశ్మీర చారిత్రక గ్రంథాలే గాకుండా ఆర్యభట్టు, వరహామిహీరుడు, భాస్కరాచార్యుడు తదితరులు రాసిన ఖగోళ, గణిత శాస్త్ర గ్రంథాలు, కాళిదాసు కావ్యాలు, భారవి, భట్టి, అశ్వఘోషుడు, మాఘుడు, క్షేమేంద్రుడు, హర్షుడు, దండి, భాసుడు, శూద్రకుడు, విశాఖదత్తుడు, భవభూతి, రాజశేఖరుడు, బిల్హణుడు, దిజ్ఞాగుడు, జయదేవుడు తదితరుల మహా గ్రంథాలు, భర్తృహరి సుభాషితాలు, ప్రపంచంలో మొదటి నవలలు కాదంబరి, దశకుమార చరిత, ప్రపంచం కథామంజరి అయిన బృహత్ కథ, కథా సరిత్సాగరం, పంచతంత్రం; శంకరాచార్యుల ప్రభోధాల వంటివి సంస్కృత వాఙ్మయాన్నే కాకుండా ప్రపంచ సారస్వతాన్ని సర్వతోముఖంగా పరిపుష్ఠం చేశాయి.
ప్రపంచంలో లభ్యమయ్యే సంస్కృత గ్రంథాల సూచీని 1978లో తయారుచేసిన కేటీ పాండురంగి ఐదు లక్షల సంస్కృత గ్రంథాలున్నట్టు నిర్ధారించారు. వీటిలో నాలుగు లక్షలు మారుప్రతులు ఉన్నాయని భావించినా, లక్ష నిజప్రతులు ఉండవచ్చని సంస్కృత సాహిత్య చరిత్ర గ్రంథంలో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సంస్కృత భాష ప్రభావం గురించి ప్రముఖ చరిత్రకారుడు విలియమ్ డాల్రింపుల్ ‘ది గోల్డెన్ రోడ్’ పుస్తకంలో ఇలా వివరించారు.. సామాన్య శకానికి వెయ్యేండ్ల నుంచి ఆసియా ఖండంలో అత్యధిక ప్రాచుర్యంలో ఉన్న పవిత్రమైన భాషగా సంస్కృతం ఉండేది. ప్రపంచంలో ఏ దేశంలో గాని, ఏ భాషలో గాని మానవ జీవితంలోని అన్ని కోణాలను వివరించే ఇంతటి వైవిద్యభరితమైన, ఇంత విస్తారమైన వాఙ్మయం ఏది లేదనేది సత్యం.
సామాన్య శకానికి పూర్వం మొదటి శతాబ్దం మొదలుకొని, సామాన్య శకం 1వ శతాబ్ద కాలంలో సంస్కృత భాష సాహిత్య, రాజకీయ భాషగా పునరావిష్కరణ జరిగి సంస్కృత సాహిత్య సంస్కృతీ ఆఫ్ఘనిస్థాన్ నుంచి జావా దేశం వరకు ఆశ్చర్యజనకంగా విస్తరించింది. షెల్డన్ పొలాక్ చెప్పినట్టు మానవ లోకంలో దేవభాష అయిన సంస్కృతం కాలక్రమేణా యావత్ ఆసియా ఖండంలో ప్రజల భాషగా మారింది.
ఆఫ్ఘన్లోని బాల్క్ (సంస్కృత బాహ్లికమ్) మొదలుకొని సింగపూర్ (సంస్కృత సింహపురి) వరకు తన ముద్రవేసింది. బార్లీ గింజను పోలిన ఆకృతిలో ఉన్నందుకు సంస్కృత యావ నుంచి జావా దేశం పేరు వచ్చింది. థాయిలాండ్ రాజధానిని ఇప్పటికీ అయోధ్య పేరుతో ఆయుత్తాయ అని పిలుస్తారు! ఇండోనేషియా జాతీయ విమానయాన సంస్థకు విష్ణు వాహనమైన గరుడ పేరు పెట్టారు. సంస్కృతం ద్వారా భారతీయ సాహిత్యం, కళలు, విజ్ఞానశాస్ర్తాలు ఆసియా ఖండమం తా విస్తరించాయి. సంస్కృత సూర్య కిరణాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసరించాయి. చైనాలో జెన్ (సంస్కృత ధ్యాన) బౌద్ధ మతం వ్యాప్తిలో సంస్కృతం పాత్ర ఉన్నది. అంతేకాకుండా, ఇస్లాం పూర్వపు ఆగ్నేయాసియాలోని ఖ్మెర్, జావనీస్, కావి, లొంటారా, లావో, థాయ్, ఛాం, మలే భాషల ప్రస్తుత లిపి దక్షిణ భారత పల్లవుల కాలం నాటి సంస్కృత బ్రహ్మి లిపి ఆధారంగా ఏర్పడ్డాయని డాల్రింపిల్ పేర్కొన్నారు. అదే సమయంలో ఆఫ్ఘనిస్థాన్ నుంచి బాలి వరకు సంస్కృతం సార్వత్రిక ప్రజల భాషగా ఉండేదని స్పష్టం చేశారు.
మరో మాట… ఇటీవల బాలీవుడ్ నటి యా మి గౌతమిని మీరెందుకు దేశభక్తి సినిమాల్లో ఎక్కువగా నటిస్తారని ఒక విలేకరి అడుగగా ‘మన దేశంలో దేశభక్తి ఎప్పటి నుంచి తప్పు అయ్యింది. వాస్తవానికి దేశభక్తి ఉన్నందుకు గర్వించాలి కదా?’ అని ఆమె ప్రశ్నించారు. ఇ దెందుకు చెప్పవలసి వచ్చిందంటే.. మన భాష ను, సంస్కృతిని, సాహిత్యాన్ని ప్రోత్సహించాలని దేబరించే కాలం దాపురించింది!
ఇక్కడ మనం మరో చారిత్రక వాస్తవాన్ని, భారతీయ సంస్కృతి మౌలిక లక్షణాన్ని తెలుసుకోవాలి.సంస్కృత భాషను గానీ, హిందూ, బౌద్ధ మతాలను గానీ, మన సంస్కృతిని గానీ ఎప్పుడు ఇతర దేశాల ప్రజలపై బలవంతంగా రుద్దలేదు. ఇలాంటి మహోన్నత సంస్కృత భాష సంపదను, సాహిత్య, సాంస్కృతిక జాతీయ వారసత్వాన్ని తెలుసుకోవడం, కాపాడుకోవడం, ముందు తరాలకు అందించడం ప్రతి భారతీయుడి బాధ్యత.
-ఆనందేశి నాగరాజు