అన్ని తెలిసినోళ్లం
అధిక తెలివి ఉన్నోళ్లం
అని చెప్పుకు తిరుగుతరు కదా
మరీ ఇప్పుడేమైంది…
వాన పడుతుందంటే వణికి పోతాండ్లు
దడ లేకుండా ధైర్యంగుండొచ్చు కదా
అలా మీరెందుకుంటరు?
చెప్పేటివి శ్రీరంగ నీతులు
చేసేటివేమో తప్పులు!
ఆనాడు మొరో మొరో మొత్తుకున్న
నా గోస చూసిండ్ల..?
నా బాధ ఇన్నరా..?
‘చెరువు’గా ఉండి మీ ఆదెరువు నైతాంటే
మట్టి పోసి నన్ను పూడ్చి
నాకు రూపం లేకుంటా చేసి
భవంతులు కట్టుకొని
భాగ్యవంతులమని భరోసాగుంటిరి
ఇండ్లు కట్టుకొని హాయిగా పంటిరి
మేఘం ఉర్మి కుండపోత వాన గురుస్తాంటే
ఇండ్లల్లకు నీళ్లొస్తున్నయని నీరుగారి పోతాంటిరి!
భూములను కబ్జా పెడితిరి
పంటలను పొట్టన పెట్టుకుంటాంటిరి
ఆనాడు నన్ను లేకుండా చేసినామని
జబ్బలు సరుసుకుంటిరి
విందులు చేసుకుంటిరి
ఈనాడు మీ ఇండ్లల్లకు నేనొస్తున్నందుకు
కుమిలి కుమిలి సత్తాంటిరి
కండ్లల్ల నీళ్లు తీస్తాంటిరి
నాకు ద్రోహం తలపెడితే ఊరుకుంటానా..?
ఉప్పెనై పొంగి మిమ్ముల ముంచెత్తను!
నేనున్న కాడనే నన్ను ఉండనియ్యండి
మీ దరికి రాను, మీకు చేటు చేయను
నేను నేనుగానే ఉంటా..
మీరు మీరుగానే ఉండండి
నాకు ఉనికే లేకుండా
చెయ్యాలని చూస్తే మాత్రం
ఉగ్రరూపం దాల్చి మీ ఊపిరి తీస్త!!
– తాండ్ర చిరంజీవి 9959180762