నీట తడిసిన బరువైన ధాన్యం బస్తాలా
రైతు ఆర్తిగా వడ్ల బస్తాల మధ్య
కొనేవారి కోసం జాగరణలు చేస్తున్నాడు
శోకానికి కేంద్రంగా కిసాను..!
రైతు చుట్టూ ఎప్పుడూ పద్మవ్యూహాలే
కిస్మత్ కిసానుకు కోసు దూరం
పండేంత వరకు మబ్బుల ఆకాశానికి దండాలు
పండినాక కొనేవారి కోసం తంటాలు
దండన ఎప్పుడూ భూమి పుత్రులకే..!
రైతు రోడ్డెక్కితే అక్షయపాత్ర పంట భూమి
బోర్లించినట్లే మరి గోదాములు బోడ బోడ
నాగలిని దొబ్బి వస్తే మనకు అనాగరికంగా
పచ్చి మాంసం గుంజి తినే
శిలాయుగం నాటి దుస్థితే..!
ఢిల్లీకి వినిపించని లయ తప్పిన రైతు గుండె దడ!
దున్నేవాడికే పెయి నుంచి
ఏకధారగా చెమట రావటం తెలుసు
రైతు స్వేద సుగంధం
భూమి వాసన ఒకటేనని ఎందరికి తెలుసు..?
బుక్కలు బుక్కలు ఎగబడి తినడమే
అందరికీ తెలుసు..!
ఏ దేశంలో రైతు కన్నీటి లావాలో కరిగిపోతాడో
అక్కడ పచ్చ గడ్డి మొలిచేనా?
పరిశోధనలు కావు
శోధనలు పాలకులు చేసుకోవాలి
ఏ కాలానికైనా రైతు క్షేమమే దేశ క్షేమం
లేకుంటే అంతా అకాలమే..!
కందాళై రాఘవాచార్య
87905 93638