‘రుక్మిణి, సుభద్రా కల్యాణము’లు ఎంతో ప్రసిద్ధిగాంచినవి. యుక్త వయస్సులో ఉన్న పెళ్లి కాని యువతులు శ్రీకృష్ణుడు, అర్జునుడి లాంటి విశిష్ఠ లక్షణాలు కలిగిన వ్యక్తులు భర్తలుగా రావాలని ఆకాంక్షిస్తూ వీటిని పారాయణం చేయడం పరిపాటి. తొలి తెలుగు కవయిత్రి, 15వ శతాబ్దానికి చెందిన తాళ్లపాక తిమ్మక్క ‘సుభద్రా కల్యాణము’ను వస్తువుగా స్వీకరించి ఒక ద్విపద రచన గావించారు. ఇందులో స్త్రీలను చైతన్యపరిచే అంశాలను చాలా సమయోచితంగా క్రోడీకరించారు. ముఖ్యంగా బహు భార్యత్వమనే సాంఘిక దురన్యాయానికి బలైపోతున్న మహిళలు సమాజంలో ఎంతోమంది ఉన్నారని, పురుషుడికి ఒక భార్య ఉండగా, మరికొందరిని వివాహమాడినప్పుడు, మొదటి భార్య ఎంతటి మనస్తాపానికి గురవుతుందో, ఆమె మానసిక సంఘర్షణ గురించి చెప్పాల్సిన పనిలేదని తిమ్మక్క ఈ రచన ద్వారా వెల్లడించారు. అంతేకాదు, అది అనుభవించేవారికే తెలుస్తుందన్నారు. దీన్ని తిమ్మక్క స్వయంగా ఎదుర్కొన్న విదుషీమణిగా సాహితీప్రియులకు ఎరుకే. పదకవితా పితామహులైన అన్నమాచార్యులకు (1408-1503) తిమ్మక్క (తిరుమలాంబ), అక్కలమ్మలని ఇద్దరు భార్యలు.
నన్నయ భారతం ఆదిపర్వంలోని అష్టమాశ్వాసంలో 135 గద్య పద్యాలలో విజయవిలాసం రాశాడు. దీన్ని ఆధారం చేసుకునే తిమ్మక్క ‘సుభద్రా కల్యాణము’ వెలయించింది. ఇందులో 1,163 పంక్తులు ప్రాసలేని మంజరీ ద్విపదలో ఉన్నాయి. ఈ లఘుకృతిని సుప్రసిద్ధ పరిశోధకులైన వేటూరి ప్రభాకరశాస్త్రి శ్రీకాళహస్తి రాజావారి ఆస్థాన తాళపత్ర గ్రంథ సంచయం నుంచి వెలికితీసి, పరిష్కరించి, పీఠిక రాయగా, 1950లో టీటీడీ ప్రచురించింది. ఇదే ప్రతి 1956లో పునర్ముద్రణ కూడా పొందింది.
సాధారణంగా కావ్యావతారికలో చాలామంది తమ పేరు రాసుకుంటారు. కానీ, తిమ్మక్క మాత్రం కావ్యం చివర్లో అవనిలో ‘తాళ్లపా-కన్నయ్యగారి/ తరుణి తిమ్మక చెప్పె- దాసు సుభద్ర/కల్యాణ మను పాట- కడుమంచి తేట/పలుకుల, నీపాట- పాడినా విన్న/శ్రీహరి వారికి- చేరువై యుండు/నానాట పాపములు- నాశనం బౌను/ఆప్తులు బంధువు- లను వృందగలరు/సప్త సంతానములు- సమకూర గలవు’ (సుభద్రా కల్యాణము పుట: 47) అని రాశారు. ఇది ఒక పెండ్లి పాట. దీన్ని ఎవరికి అంకితం ఇచ్చారన్నది ఆమె చెప్పలేదు. రచయితలు మామూలుగా ఆశ్వాసం ఆదిలోగాని, ముగింపులోగాని పూర్వ కవులను స్తుతిస్తుంటారు. అయితే, తిమ్మక్క మాత్రం అవేవీ చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్లారు. అర్జునుడు సుభద్రను వివాహమాడినదే ఇందులోని కథావస్తువు.
కథలో సుభద్ర ఉండే ఇల్లు రత్నాల బొమ్మరిల్లు లాంటిది. అక్కడ దంతపు బొమ్మలు తయారుచేసుకొని వాటిని అలంకరించి వినోదిస్తుంటుంది సుభద్ర. ఆమె ప్రవర్తన చిన్నపిల్లలా తోస్తుంది. అక్కడికి అర్జునుడు వచ్చి, తానే పురోహితుడై బొమ్మల పెళ్లి చేయించాడు. దీన్ని తీర్చిదిద్దడంలో తిమ్మక్క తీసుకున్న జాగ్రత్తలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. ఒకసారి అర్జునుడు సుభద్ర చెయ్యి పట్టుకొని నర్మగర్భంగా నీకు జాతకం చెప్తానన్నప్పుడు కోప్పడి తన అన్న అయిన శ్రీ కృష్ణుడితో ఫిర్యాదు చేస్తుంది. అప్పుడు కృష్ణుడు ఆమెను బుజ్జగించి, బలరామునితో ఏమైనా చెప్పిందేమోనని కంగారు పడతాడు. అనంతరం ఎందుకు ఇలా చేశావని అర్జునుడిని కూడా ప్రశ్నిస్తాడు. సుభద్రకు అర్జునుడిపై ఉన్న కోపాన్ని చల్లార్చేందుకు శౌరి ‘అమ్మరా! ముద్దుల- గుమ్మ రా! వేగ/కొమ్మ రా! నవకంపు- బొమ్మ రావమ్మ!/ముత్యాలసరమ రా! ముద్దరాలా రా!/చిత్తజుబాణమా! – చెలియ రావమ్మ!’ (పుట: 18) అని ప్రేమగా సంబోధించినట్టు తిమ్మక్క పేర్కొన్నది. స్త్రీ హృదయాన్ని బాగా అవగాహన చేసుకున్న తిమ్మక్క అదే శ్రీకృష్ణుడితో మాయ యతిని గురించి పలికిస్తుంది. పాశుపతం పొందేటప్పుడు అర్జునుడు శివుడితో యుద్ధం చేశాడు కదా! ఆయనే ఈ యతీశ్వరుడని చెప్పటంతో కృష్ణుడి ఆంతర్యాన్ని సుభద్ర గ్రహించి వారికి కావాల్సిన సపర్యలు చేస్తుంటుంది.
కావ్యంలో తిమ్మక్క చిలుక రాయబారాన్ని నడిపి అర్జునుడి అందచందాలను ఇలా ఎంత గొప్పగా వర్ణిస్తుంది. ఈ వర్ణన చేమకూర వేంకటకవి లాంటి వారి కి ఆదర్శమైంది. నన్నయ భారతంలో ఈ వర్ణన లే దు. అప్పటికే ప్రబంధాలు మొదలైన కాలమది. శ్రీనాథుడు మొదలు రామరాజ భూషణుడి వరకు మన ప్రబంధాల్లో ఎలాంటి వర్ణనలు చోటుచేసుకున్నాయో మనం చూశాం. ప్రబంధ కవులు స్త్రీని వర్ణించినదానికీ, ఒక స్త్రీగా తిమ్మక్క పురుషుడిని వర్ణించినదానికి వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకోవాలి. అప్పటి సాహిత్యాన్ని దృష్టిలో పెట్టుకొని స్త్రీలు పురుషులతో సామరస్యాన్ని కోరుకుంటుంటే, పు రుషులు మాత్రం స్త్రీని కావ్యాల్లో అశ్లీలం గా వర్ణించడం ఎంతవరకు సమంజసం?!
అర్జునుడు తన తీర్థయాత్రలో భాగంగా ఉలూచి, చిత్రాంగదలను వివాహం చేసుకోవడం, ఐదుగురు అప్సరసలకు శాపవిముక్తి కలిగించడం, బభ్రువాహన జననం మున్నగు విషయాలను తిమ్మక్క సంక్షిప్తం చేసి, సుభద్ర కల్యాణాన్ని మాత్రం విస్తరించడానికి ప్రయత్నించారు.
సాధారణంగా మన తెలుగువారి ఇండ్లలో కనిపించే అనుబంధాలు, అనురాగాలు, అన్నదమ్ముల ప్రేమ లు, వది నా మరదళ్ల ఆప్యాయతలను తిమ్మక్క అర్జునుడు, ద్రౌ పది, కృష్ణుడు, బలరాము డు, రుక్మిణి, సుభద్ర పా త్రల ద్వారా చెప్పారు. సుభ ద్ర పాత్రను తిమ్మక్క తీర్చిదిద్దేందుకు ఎ న్నో జాగ్రత్తలు తీసుకున్నది. ఆమెతో ఈడుకు తగిన ఆటలు ఆడించింది. గొప్ప భద్రతకు సుభద్ర మనసును చిహ్నం చేసింది. దీని మూలంగానే చేమకూర వేంకటకవి తమ ‘విజయవిలాసము’లో ‘మన సుభద్ర మనసు భద్రమయ్యే’అన్నారనిపించింది. ఆనాడు పురుషులు రాజ్యమేలుతున్న సాహిత్యంలోకి ఒక స్త్రీ ఏ విధంగా ప్రవేశించింది? దానికి ప్రేరణ ఏమై ఉంటుంది? కేవలం రాజ ఆస్థానాల్లోనూ, సంస్థానాల్లోనూ ఉన్నటువంటి సాహిత్య రూపాలు సామాన్య ప్రజల చేరువలోకి తాళ్లపాక తిమ్మక్క ఈ కావ్యం ద్వారా తీసుకురావడం ఒక సాహసమనే చెప్పాలి. దీంతో తిమ్మక్క ఇటు తెలుగు సాహిత్యానికి, ము ఖ్యంగా స్త్రీ సాహిత్యానికి ఎంతో ఆదర్శనీయంగా నిలబడింది. నిజానికి అర్జునుడు ఆ కాలం లో చేసిన యాత్రలను బట్టి ఆయనకు విజయుడనే పేరు వచ్చింది. ‘విజయవిలాసము’ వంటివి అర్జునుడి కేంద్రంగా నడిస్తే, తిమ్మక్క ఒక స్త్రీగా ఆమె అస్తిత్వాన్ని తెలపడానికి ‘సుభద్రా కల్యాణము’ అనే పేరు పెట్టిందనవచ్చు. కావ్యంలో సుభద్రార్జునుల ప్రేమానురాగాన్ని వెల్లడించే సందర్భంలో మిగతా వర్ణనలు ఎంతో ఆసక్తిని రేపుతాయి. పెండ్లయిన పురుషులు మరొక స్త్రీని ఇష్టపడటం జరిగిందంటే అలాంటివారిని నమ్మకూడదనీ, బహు భార్యత్వం ఉన్నచోట సవతులపై ఈర్ష్యాద్వేషాలు పెంచుకోవడం కన్న, సవతితో ఎటువంటి వంచనలకు పోకుండా ప్రేమగా ఉండమని రుక్మిణి తన స్వానుభవాన్ని తెలుపుతుంది.
సుభద్ర అత్తవారింటికి వెళ్లినప్పుడు ద్రౌపదికి నమస్కారం చేసి ఆవిడ హృదయాన్ని చూరగొంటుంది. సుభద్రార్జునులకు శోభన ఏర్పాట్లప్పుడు ఆ బాధ్యత మొత్తం ద్రౌపది తీసుకున్నట్టు కావ్యంలో ఉన్నది. బాగా అలంకరించుకొని వస్తున్న సుభద్రార్జునులను చూసిన ద్రౌపది ‘ఝణ ఝణత్కారమై పణతు లిద్దరును’ (పుట: 44) అంటూ జోడు చిలుకల్లా శోభిల్లుతున్నారని భావించింది. మరో చోట తిమ్మక్క ‘మూడువేల్ వెలసేయు – ముక్కఱ బెట్టె’ (పుట: 23)నంటూ… సుభద్ర అర్జునుడి దగ్గరకు వెళ్లిందని చెప్పడంలో ఆమె అలంకార ప్రీతిని మనం అర్థం చేసుకోవాలి.
పూర్వం సవతుల మధ్య ఉన్న స్నేహ సంబంధాలు నేడు కనబడటం లేదు. అయినప్పటికీ అర్థం చేసుకునేవాళ్లు లేకపోలేదు. దీనివల్ల స్త్రీకి కలిగే హృదయవేదన చెప్పలేనిది. నిజానికి అప్పట్లో రాజులకు ఎంతోమంది భార్యలు, ఉంపుడుగత్తెలుండేవారు. వారిలో రాజుకు సర్వస్వాన్ని అర్పించిన స్త్రీకి ఎంత బాధ ఉంటుందో మాటల్లో చెప్పలేం కదా! అలాంటి జటిలాంశం నుంచి మహిళ ఎలా బయటపడుతుందనేదానికి నిదర్శనంగా తిమ్మక్క ఈ కావ్యంలో సుభద్రను అర్జునుడి దగ్గరికి పంపించినప్పుడు ద్రౌపది.. ‘తలపోసె మనసులో- తాళంగ లేక/ యేమి వస్తువులైన నియవచ్చు గాని/ప్రాణేశు నిచ్చి మరి- బ్రతుకంగా రాదు!’ (పుట: 45) అని వాపోయింది. ఏ వస్తువునైనా ఇవ్వచ్చు కానీ, ప్రాణానికి ప్రాణమైన భర్తనిచ్చి ఎట్లా బతకాలని కుమిలిపోతుంది. నిజానికి ఆకాలపునాటి అంతఃపురాల్లో విపరీతమైన రాజకీయాలు జరుగుతుండేవి. ముఖ్యంగా స్త్రీలు ఎత్తుకు పై ఎత్తులు వేసేవారు. ఏదిఏమైనప్పటికీ అన్నికాలాల్లో స్త్రీల మధ్య ఆరోగ్యకరమైన సత్సంబంధాలను నెలకొల్పే గొప్ప కావ్యం ‘సుభద్రా కల్యాణమ’ని చెప్పవచ్చు.
– (వ్యాసకర్త: ప్రాచీన తెలుగు విశిష్ఠ అధ్యయన కేంద్రం (భారతీయ భాషా సంస్థ, మైసూరు)
డాక్టర్ బడిగె ఉమేశ్9494815854