కవిత్వం ఆమెను పాడుతున్నట్టు
కవిత్వం ఆమెను
ప్రశంసల వెల్లువలలో ముంచెత్తుతున్నట్టు
వెన్నెలై వేకువై గతం మొత్తం
నవ్వుల కిరణాల వరసైపోతున్నది
గొంతుముడి విప్పిన పాట
నిశ్శబ్ద పేటికలో దాగిన చీకటిని తరిమినట్టు
ఆమె చరిత్ర కథలై
ఆమె చరిత్ర కవనమై
రణగీతికలను పాడుతున్నది
ఆమె రుద్రమ!
కాకతీయ సామ్రాజ్య తేజోప్రభ!!
అలలు అలలు సముద్ర హోరై
తీరం పాదాలను ముద్దాడినట్టు
ఆమె ఎత్తిన ఖడ్గం తళతళల పురివిప్పి
కాకతీయుల చరితకు గీటురాయి అయ్యింది
కళానైపుణ్యాల ఓరుగల్లు వైభవాల తరంగాలు
సాధనాంతరంగాల పాదుకలు మోపింది
ఆమె పాలనా చాతుర్యోదయాలు
దీక్షాదక్షతల కాంతి మయూఖాలు
స్త్రీ శక్తి ప్రతీకగా అస్తిత్వ చిహ్నమై
ప్రశ్నల సందేహాల దీటుగా
గుప్పెడు నిప్పుల పువ్వులై
యుగానికొక్క వెలుగుల రేఖ అయ్యింది
కుటిలత్వం ఎప్పుడూ మాటు వేసే ఉంటుంది
మూట విప్పనంత వరకే గుట్టు
ఆకాశం తిరగబడినట్టు
నేల చుక్కల రవ్వల్ని రువ్వినట్టు
అనుభూతి అభేదత్వం
మిత్ర సాంగత్యంలోనూ
శత్రుత్వమై బుసలుకొట్ట
కుటిల రాజకీయాల్ని తిప్పి కొట్టె
మహారాజ్ఞిగా రుద్రమదేవి!
చెయ్యి ఎత్తిందంటే చాలు
కత్తి డాలు స్వైర విహారాల గుర్రపు దౌడు
రుద్రమదేవి యుద్ధరంగాన భయద స్వరూపిణి
కన్ను ఎత్తిందంటే చాలు పాలనారంగాన
అన్నార్తుల ఆకలి తీర్చే మాతృమూర్తి!
సరిహద్దు భద్రతనిచ్చే రాజనీతి ప్రజ్ఞ
దుష్టశిక్షణ శిష్ఠ రక్షణ అయినప్పుడు
ప్రజల ప్రేమైక దృక్కులు పోటెత్తినవి!
ఆమె విశాల దృక్కులు సమ్యక్ భావనలైనప్పుడు
సౌజన్య గాథల దృశ్యాలై పాటెత్తినవి!!
గణపతి దేవ చక్రవర్తి వారసత్వ తేజం
పౌరుషాగ్నుల విద్యా విజ్ఞానాల చైతన్యం
ఆమెతో కలిసికట్టుగా ఎదిగిన జోడు ధైర్యాలు
సమయస్ఫూర్తి సాధికారతా
ఆమెలో ఒదిగిన వికాసాలు
రాజ్యం ఆమెకు పట్టాభిషక్తమయ్యె
పుట్టకోట మట్టికోట రాతికోటల
కట్టడాలు ఆమె తెలివి తేటల పతాక
పోరులో వీర సైనికులకు
రుద్రమదేవే ఓ ఉత్తేజం
ఆమె చూసిన ఎనభై వసంతాలు
నిత్యనూతనత్వ పరీమళాల
పూలనే పూయించినవి
అమ్మ అమ్మమ్మ అయినా ఈ మహారాణి
ఎనభై ఏళ్ల వయసును చేతబట్టి
యుద్ధం చేసిన మహోజ్వల చరిత్ర
పుటల పుటలలో సువర్ణాక్షరాలే లిఖించింది!
పక్క రాజులు బల్లాలయ్యి
కుతంత్రాలకు ఎర అయిన
ఆమె ప్రాణత్యాగపు
రక్తపుటేరులు
యుద్ధరంగానికి దేశభక్తి గంధాలైనవి
అప్పుడు ప్రతాపరుద్రుడి విజయాలకు ప్రేరణ
ఇప్పుడు…
జీవిత గమ్యం అగమ్యమైపోయే
అనర్థకాలంలోనూ…
స్ఫూర్తిప్రదాత ఆమె
ఆమె చరిత్ర
ఓ సత్య చరిత్ర
ఆడపిల్లలు అబలలు కాదు సబలలు
ఏకవీరాదేవి దివ్య వాణిలా వెల్లువెత్తిన
భద్ర సందేశమయ్యె
ఆమె కదన వీర కవనాలు భావి బంగరు బాటలు
ఆమె రుద్రమదేవి! ఇది రౌద్ర సందర్భం!!
– డాక్టర్ కొండపల్లి నీహారిణి