ప్రజల హితముకోరి ప్రగతినిపంచియు
రాజకీయకులిల రాటుదేలి
కోరినట్టిపనులు కోర్కెలుదీర్చంగ
జనులవల్లవార్కిజయముగల్గు!
మంచిమనసుకల్గి మానవకష్టాలు
ఇల్లుఇల్లుతిరిగి యిడుములగని
అవసరాలుతీర్చి యాలంబనగనుండ
ప్రజలనాయకుండె పరగచూడ!
కర్షకులకుకలుగు కడగండ్ల బాధలు
వేదనంబులోన వెన్నుదన్ను
గానునిల్చితీర్చు ఘనుడేమేటియు
ఉండవలెనురైతు నిండుగుండె!
సమయకాలమందు సాయమందించగ
వణిజపంటతీరు వరుసచెప్పి
వ్యవసాయ‘లోను’వ్యయమేలేకను
కర్షజాతికివ్వ హర్షముగను!
పాడిపంటలున్న ప్రబలమౌదేశమ్ము
పరమరైతుజాతి ప్రగతినొందు
రాజనీతిగుణులు రాజిలుతోడుగా
పరిఢవిల్లురాష్ట్ర ప్రగతిపథము!
– డాక్టర్ గన్నోజు శ్రీనివాసాచార్య 85558 99493