‘కళకైనా, కవితకైనా పెద్ద ఆర్భాటమూ, ఆడంబరమూ ప్రదర్శనా అవసరం లేదు. ప్రచారమూ అవసరం లేదు. నిజానికి అద్దమూ అవే, కాంతీ అవే, బింబమూ అవే, ప్రతిబింబమూ అవే’ సరిగ్గా ఈ మాటలకు అర్థం చెప్తూ ఆ భావాలను ప్రతిబింబిస్తూ వీకే శుక్లా రచనలు సాగుతాయి. అది కవిత్వమైనా, కథ అయినా, నవల అయినా అదే సింప్లిసిటీ, అదే సున్నితత్వం, అదే సరళత్వం. ఈ ఏటి జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికైన వీకే శుక్లా రచనలు సీదా సాదా రూపంలోనూ, గాఢమైన అనుభూతులతోనూ సాగుతూ తమదైన ప్రత్యేకతను సంతరించుకుంటాయి.
ఆయన రచనాశైలి వినూత్నంగానూ, సులభంగానూ ఉండి ఇట్లా అయితే మనమూ రాయొచ్చు అనిపిస్తుంది. కానీ, ఆ రచనల్లో అంతర్లీనంగా సాగే తాత్త్వికత అంత సులభంగా పట్టుబడేది కాదు. వినోద్‌కుమార్ శుక్లా ప్రసిద్ధ హిందీ కవి, నవలాకారుడు. అంతేకాదు, ఆయన చిన్న కథలూ రాశారు. మ్యాజిక్ రియలిజంకు సమీపంలో ఉండే ఆయన ప్రత్యేకమైన సృజనాత్మక శైలి దేశవ్యాప్తంగా విశేష ప్రశంసలను పొందింది. 1937, జనవరి 1న ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌లో జన్మించిన శుక్లాది సామాన్యమైన జీవితం. తాను ఎదుగుతూ, చదువుతూ రాస్తూ తనతోపాటు తన ఆలోచనా లోతులను తాత్తిక దృక్పథాలను సంలీనం చేసి హిందీ సాహిత్యంలో విశేషమైన కృషిచేశారు. ఆయన రచనలు ఆధునిక హిందీ సాహిత్యంలో ఒక కొత్త దృక్కోణాన్ని పరిచయం చేశాయి.
ఆయన తొలి కవితా సంకలనం ‘లగ్భగ్ జైహింద్’ 1971లో ప్రచురితమైంది. ఇది మనిషి సాధారణ జీవిత సౌందర్యాన్ని కష్టాలను ప్రతిబింబిస్తుంది. ఆయన రాసిన ప్రసిద్ధ నవలల్లో నౌకర్ కీ కమీజ్ను సుప్రసిద్ధ దర్శకుడు మణికౌల్ సినిమాగా రూపొందించాడు. మరొక అద్భుతమైన రచన దీవార్ మే ఏక్ ఖిడ్కీ రహతీ థీ (గోడలో ఒక కిటికీ ఉండేది) 1999లో సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నది. ఛత్తీస్‌గఢ్ నుంచి జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికైన మొదటి రచయితగా నిలిచారు. శుక్లా రచనా శైలి విలక్షణమైంది.
అందులో introspective, imaginati ve లక్షణాలు ఉండి, సాధారణ క్షణాలను విశ్వసత్యాలుగా మారుస్తాయి. ఆయన రచనలు మనిషి వ్యక్తిత్వాన్ని, చుట్టూ ఉండే మనుషులను పాత్రలుగా చేసుకొని జీవన తాత్త్విక అంశాలను ఆవిష్కరిస్తాయి. ఆ రచనలు పాఠకులను లోతుగా ఆకట్టుకుంటాయి. ఆయన కవితలు, కథలు సాధారణ మనిషి జీవితంలో ని సూక్ష్మతలను సులభమైన భాషలో ఆవిష్కరిస్తాయి. వీకే శుక్లా రచనలు సాధారణ మనుషుల భావాలను, వారి దైనందిన జీవితాన్ని, సమాజంలోని సంక్లిష్టతలను అందంగా వ్యక్తపరుస్తాయి.
బజార్లో ఒక వీధి
బజార్‌లోని ఒక దారిలో…
బిజీగా వున్న కొనుగోలుదారు,
చేతిలో రెండు సంచులు పట్టుకున్నాడు
ఒకటి చినిగినది, మురికితో నిండింది
ఒకటి ఖాళీ,
మరొకటి నిండి ఉంది.
సంచిలో బంగాళా దుంపలు,
ఆకు కూరలు,
గరం మసాలా పాకెట్, మిరపకాయలు
ఎరుపు, పచ్చల రంగుల కాంతులతో
తాజా తాజాగా వున్నాయి.
నేనో పది రూపాయల నోటుగా మారి,
ఆ సంచిలో సేదదీరితే
ఎంత బాగుండేది.
అని ఎంతగానో అనుకున్నాను,
కానీ నేనూ…
నా సొంత సంచిలోనే చిక్కుకుపోయాను.
హిందీ మూలం: వినోద్ కుమార్ శుక్లా
ఇంగ్లీష్: డేనియల్ వేయిబోర్ట్తో కలిసి కవి
స్వేచ్ఛానువాదం: వారాల ఆనంద్
వినోద్‌కుమార్ శుక్లాను సమకాలీన హిందీ సాహిత్యాన్ని ‘సింహిక’ అని పిలుస్తారు. స్వభావంలో నిశ్శబ్దంగా, ప్రవర్తనలో మృదువుగానూ అస్పష్టంగానూ ఉండి, పాఠకుల్లో చాలామందికి అంతుపట్టని చిక్కు ప్రశ్నగా మిగిలిపోతాడు. ఒంటరితనాన్ని ఇష్టపడే శుక్లా తన రచనా ప్రేరణ కోసం చిన్న పట్టణాల బజార్లు, వాటి పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ, వర్షం నీటిని తప్పించుకుంటూ, రైల్వేస్టేషన్లో లేదా బస్‌స్టాప్ వద్ద నిరీక్షిస్తూ జీవితాన్ని పరిశీలిస్తాడు, ఆలోచన చేస్తాడు. ఆయన అనేక ప్రశ్నలు సంధిస్తాడు సమయానికి ధ్వని ఏమిటి? ప్రేమకు వాసన ఎలా ఉంటుంది? ఇట్లా అనేక ప్రశ్నలను సంధిస్తూ తన రచనల్లో పొందుపరుస్తాడు. అంతేకాదు కొత్త వ్యాకరణాన్ని ఆవిష్కరిస్తాడు.
తనకు అవార్డు వచ్చిన తర్వాత
శుక్లా స్పందిస్తూ… ‘నేను జీవితంలో ఎంతో చూశాను, ఎంతో విన్నాను, ఎంతో అనుభవించాను కానీ, కేవలం కొంచమే రాయగలిగాను. నేను ఎంతో రాయాల్సి ఉందని, ఇంకా చాలా మిగిలి ఉందని అనిపిస్తోంది’ అన్నారు. నేనున్నంత కాలం, మిగిలిన రచనలను పూర్తిచేయాలని ఆశిస్తున్నాను, కానీ, నా పని పూర్తిచేయగలిగే అవకాశం తక్కువ.
ఈ కారణంగా, నేను ఒక పెద్ద సందిగ్ధంలో పడిపోయాను. నా జీవితాన్ని నా రచనల ద్వారా కొనసాగించాలనుకుంటున్నాను. కానీ, నా జీవితం త్వరితంగా ముగింపు వైపుకు చేరుకుంటున్నది. నేనే ఆ వేగంతో రాయలేను, అందువల్ల కొంతవరకు విచారంగా కూడా ఉంది’ అని ఆయన అన్నారు. ‘ఈ అవార్డు నాకు చాలా తియ్యనిది అని కూడా నేను చెప్పలేను, ఎందుకంటే నాకు మధుమేహం ఉంది’ అని ఆయన చమత్కరించారు.
– వారాల ఆనంద్, 94405 01281