గట్లుంటది..
మన కాలి బొటనవేళ్లని తాళ్లతో ముడివేసి ఆ రెంటి మధ్యలోంచి జీవితాలను చూస్తున్న కవి ఒకరున్నారు. అప్పుడెప్పుడో ఆ పని బైరాగి చేశారు. తక్కువే రాసినా అద్భుత కవిత్వాన్ని పంచిన అజంతా కూడా ఇంచుమించు సరిసాటి అనిపించేలా ఈ పనిచేశారు. కొంతవరకూ నగ్నముని కూడా అదే పని చేశారు. మో అంటూ పిలుచుకున్న వేగుంట మోహన్ ప్రసాద్ చేశాడంటారు కొందరు. ఇదిగో ఈ కవి సీతారాం మాత్రం అదే పని నిరంతరాయంగా చేశాడు, చేస్తున్నాడు.
జీవికతో పాటు మృత్యువు నీడలా ఉంటుందనే ఎరుక కలిగినవాడు కనుకే పగిలిన కుండ పెంకులతో చితిని పేర్చుకుంటూ శ్మశానం వరకూ తీసుకుపోయాడీ కవి సీతారాం. అతగాడే కాదు… ఎవరైనా అనే మాట, అనాల్సిన మాట కూడా ఇదిగో ఇక్కడిదాకానే అని. అలాగని అక్కడే వదిలేస్తాడని కానీ, మనల్ని ఒంటరి చేసి వెళ్లిపోతాడని కానీ అనలేం. మనతోనే ఉంటాడు ఓ మూల నక్కి నక్కి చూస్తూంటాడు మన జీవితాలను. గతంలో కారా కిళ్లీతో కనిపించినా, నేడు ఆ పాన్ పరాగ్ రేణువులు నములుతూ మన దగ్గరే తచ్చాడుతున్నా ఆ ఎడమ బుగ్గ మీద సొట్టలా మన జీవితంలో సొట్టల్నీ మనకు చూపిస్తూ ఉంటాడు ఈ కవి సీతారాం. అలా చూపిస్తున్నాడు కాబట్టే యూ సఫ్ ఇంకా ఇంటికి రాలేదు అని గగ్గోలు పెట్టాడు. మనం వినాల్సిందే. వెతకాల్సిందే. ఒక్క యూసఫ్నే కాదు… యాదగిరినీ, మోజెస్ని, కారంచేడులో కాలిపోయిన మనుషులను, దూరాన రైలులో పడి మాడిపోయిన గోద్రా రైలును కూడా వెతకాలి.
‘కొమరయ్య తుపాకీకి అంటిన శవాన్ని/ తుడిచాడు కొమరయ్య ఇరవయ్యేడు తూటాలు/ ఎక్కడెక్కడ నాటా డు?’ ఇలా ప్రశ్నిస్తున్న కవిని మృత్యుకవి అని, శవ కవి అని పిలుచుకునే దౌర్భాగ్యపు తెలుగు సాహిత్యంలో ఉన్నాం కదా. ఎవరైనా చెప్తారా ఆ ఇరవయ్యేడు తూటాలు ఎక్కడ నాటాడో. ఈ మధ్యనే తనువు చాలించిన ఆ చక్రాల కుర్చీ సాయిబాబా చెప్పగలడు. సీతారాం అనే అచ్చమైన కవి వదిలిన ఈ తూటాల గురించి దండకారణ్యం చెప్పగలదు. ఇప్పుడు చెప్పండి ఈ కవి ఎవరో. అంతే కాదు… మోగునూరు రావులపాటి మాణిక్యం… మదర్ ఆఫ్ సీతారాం… పాదాలకు తొడుగాలనుకున్న బంగారు చెప్పులు కోసం వెతుకుతూ…
‘మా అమ్మ కాళ్లకి సరిపోయే బంగారు చెప్పులు/ అమ్ముతారా కొంటానని అంటూనే ఉన్నా/ మా అమ్మ కాళ్లకి సరిపోయే చెప్పులు అమ్ముతారా…’ అంటున్నాడు సీతారాం. ఈ కవిత్వంలో అమ్మ పాదాలు తప్ప మరే అలంకారాలు ఉండవంటే ఉండవు. మరే వాదాలు కనిపించవంటే కనిపించవు. అదిగో ఆ వెతుకులాట నుంచి… అదిగో అప్పటి నుంచి మొదలైంది ఈ కవి గానం.
పర్యావరణం మీద ప్రేమంటాడేంటో ఈ కవి. ప్రపంచం మీద లాలస అంటాడు. పిల్లల కోడిలా చుట్టూ కూనలనేసుకుని తిరుగుతూంటాడు. ఆ రమణమూర్తి మరచిపోయుంటాడేమో కానీ మనం ఎలా మరిచిపోతాం ఆ ‘ఏడుపు పుట్టినప్పుడు’ సీతారాం పడిన బాధను. ‘అమ్మ పిచ్చిది/ వొట్టి పిచ్చి పిల్ల నిజంగా పిచ్చి పిల్ల/ మీ నాన్న యుద్ధాన్ని తలచుకు నవ్వుతాడు/ నీ ఏడుపు వినలేనందుకు తానేడుస్తాడు…/ అమ్మకి భయం/ అర చేతుల్లో కదిలే పాదాలు చూసి భయం/ ఊగే శ్మశానంలా అనిపించే/ ఊయలను చూస్తుంది’ వెళ్లిన యూసఫ్ ఇంకా రాలేదని తల్లడిల్లిన సీతారాం… వచ్చిన శిశువు వెళ్లిపోయిందనీ కన్నీరయ్యాడు. ఇది చదివాం కదా… ఇతగాడిని మృత్యుకవి అని ఎలా అంటాం.
‘అక్షరం అరూపం కావాలి’ అంటున్నాడు రహస్యోద్యమకారుడితో.. ఇంకా అంటాడూ… ‘అక్షరం ఉనికి లేని గాలై/గా యాల్ని పరపరా కోయాలి’ అని వాంఛిస్తున్న కవి ఈ సీతారాం. ఖమ్మం కవిత్వ గుమ్మంలో నిలబడి మువ్వురు కవులు రక్తస్పర్శ అంటూ లోకమ్మీదకి వచ్చారు. ముగ్గురూ నిలబడ్డారు. కవిత్వం కోసం ఎగబడ్డారు. కలిసి పుస్తకం వేశారు కానీ, ఈ ముగ్గురి దారులు వేర్వేరు. పద్యాన్ని అంతర్లీనంగా… ఏదో దాగి ఉందన్న భ్రమను కల్పించేలా పాఠకుడిని తనవెంట తిప్పుకోవడం సీతా రాం కవిత్వ సొబగు. ఇలా చేసిన కవులు తెలుగులో చాలా అరు దు. ఇలాంటి వారిలో మరీ ముఖ్యమైన కవి వేగుంట మోహన్ ప్రసాద్. సీతారాం కూడా ఇలాంటి కవే కానీ ఇతనికో మార్గం వేసుకున్నాడు. అది అర్థం కాకపోవడం వల్లే చాలామం ది సీతారాంను వేగుంట జేగంట అన్నారు. సీతారాంతో నిరంతరం అంటకాగుతాడు కదా ఆ ప్రసేన్. అందుకే ఆ మధ్య ఎ ప్పుడో చుక్కల తోటలో విహరిస్తున్నప్పుడు అడిగాను సీతారాం ఎలాంటి కవి అని… దానికి అతనంటాడు ‘హి ఈజ్ యాన్ ఎ పిటాఫ్ ఆన్ ఎమోషన్’ అని. చెప్పొద్దూ… సీతారాం కవిత్వాన్ని, అతని ముందుమాటలను, సభల్లో ప్రసంగాలను కాసింత శ్రద్ధగా చదివి, వింటే ప్రసేన్ చెప్పింది నిజమేననిపిస్తుంది.
కవిగా సరే, ఏదో ఒక ముద్ర వేస్తాం. వాదులాడుతాం. చర్చలాడుతాం. మనిషిగా కూడా చూడాలి కదా కవి అన్నవాడిని. నే చూశాను. సీతారాంలో కవి మనిషిని. తాను పాఠాలు చెప్పిన ప్రతి చోటా ఆకలి తీర్చే అకడమిక్ పాఠాలే కాదు, బతుకు పాఠాలు కూడా చదవమని చెప్పే కవి సీతారాంను నేను చూశా ను. కవిత్వమంటే పారిపోతున్న, కవులను వివిధ రూపాల్లో పోలుస్తూ ఆనందిస్తున్న ఈ కాలంలో విద్యార్థుల్లో కవులను చూస్తున్నాడు సీతారాం. తాను పనిచేస్తున్న కళాశాలను కవులను, కథకులను తయారుచేసే ఫ్యాక్టరీగా మారుస్తున్న సీతారాంను నేను చూశాను. ఇప్పుడు చెప్పండి… ఈ కవిని ఏమంటారు..?
ముక్కామల చక్రధర్
99120 19920