తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడినా కళలు, సాంస్కృతిక వైభవానికి కొదువ లేదు. ఆధునిక సమాజానికి దూరంగా ఉన్నా మౌఖిక, సాంప్రదాయిక కళారూపాలను స్థానిక సామాన్య ప్రజలు కాపాడుతూ వస్తున్నారు. అడవులు, గుట్టలు, వాగులు, వంకల కారణంగా వారి జీవితాలు ఉన్నచోటే గడిచిపోతున్నవి. ఆధునిక సాంస్కృతిక మార్పులకు దూరంగా ఉన్నా, వారసత్వంగా వస్తున్న కళలను మాత్రం తరాలుగా కాపాడుతూ వస్తున్నారు.
చదువులు నేర్వకున్నా పెద్దల నోట విన్న పాటలు, పద్యాలను అర్థవంతంగా, రాగయుక్తంగా తన్మయానందంతో పాడడంలో వీరు ఎవరికీ తీసిపోరు. పుస్తక జ్ఞానం లేకున్నా సాహిత్య అంతరార్థాలను విడమరచి చెప్పగలరు. ఆలకించి నేర్చుకున్న పద్యాలు, గేయాల కోవలో వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా పదం కట్టగలరు. మట్టిలో మాణిక్యాలైన ఇలాంటి కవి గాయకులెందరో తమ విద్వత్తుకు గౌరవం దక్కకుండానే కాలగర్భంలో కలిసిపోయారు. వారిలో ఒకరు కంభగౌని లక్ష్మణ్ గౌడ్. ప్రస్తుత కొమురం భీం జిల్లాలోని చిన్న రాస్పల్లి అనే మారుమూల కుగ్రామంలో 1920-1990 మధ్యన ఆయన జీవితం గడిచింది. తండ్రి ద్వారా నేర్చుకున్న భక్తిగీతాలకు తోడుగా ఆయన సొంతంగా పద్యాలు, గేయాలు రచించారు. అయ్యవారి అరుగుమీది బడిలో దిద్దిన అక్షరాలను కలుపుకొని గేయకవితలను అల్లారు. వాటిని శ్రావ్యంగా, రాగయుక్తంగా పాడి జనం మన్ననలు అందుకున్నారు.
గోదావరికి ఉపనది ప్రాణహిత. కెరమెరి గుట్టల్లో పుట్టిన పెద్దవాగు మురళిగూడ సమీపంలో ప్రాణహితలో కలుస్త్తుంది. పెద్దవాగు ఒడ్డునే వెలిసిన గ్రామం చిన్న రాస్పల్లి. ఏ పనికైనా వారు పెద్దవాగు దాటక తప్పదు. ఆ రోజుల్లో వంతెన లేకపోవడం వల్ల వర్షాకాలంలో ఆ గ్రామానికి రాకపోకలు పూర్తిగా మూసుకుపోయేవి.
అంతేకాకుండా అప్పుడప్పుడు వచ్చే వరదలతో గ్రామంలో పంట నష్టంతో పాటు ఇండ్లు కొట్టుకుపోయేవి. పుట్టినూరుపై మమకారంతో వరదల దాపున వారి జీవితాలు గడిచేవి. 1958లో ఎడతెరిపి లేని వర్షాల వల్ల పెద్దవాగుకు వచ్చిన వరదలు గ్రామానికి భారీ నష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఆ బీభత్సం లక్ష్మణ్ గౌడ్ కవి హృదయాన్ని కలిచివేసింది. తట్టుకోలేని వేదనతో ఆయన ఆ వరదకు తనదైన రీతిలో అక్షర రూపాన్ని ఇచ్చారు. ఎనిమిది, తొమ్మిది పంక్తుల్లో రాసిన 36 గేయపద్యాలతో వరద తాండవానికి దృశ్యమానం చేశారు. ఆ రచనలకు ‘పెద్దవాగు మోసం’ అని పేరు పెట్టారు. ఊరు పేర్లను, ఆనాటి మనుషుల పేర్లను ఉటంకిస్తూ వరద ఎవరెవరి ఆస్తిని ఎలా ధ్వంసం చేసిందీ అనే వివరణాత్మక వర్ణన ఈ వచన పద్యాల్లో ఉన్నది.
‘ఎంత మోసం పెద్దవాగు మహిమెన్నడు కని వినము’ అంటూ రచనను మొదలుపెట్టే ముందు తొలి గేయంలో ‘సారసాక్షి నను దూరము జూడకు/భారము నీవని మదిలో నమ్మితి’ అని శ్రీ భారతిదేవిని స్తుతించారు. రచనలో ఏమైనా తప్పులు దొర్లినా నేరములెంచకు అని సరస్వతితో వేడుకోలు ఇందులో కనిపిస్తుంది. ‘అట్టి వర్షమూ మూడు దినంబులు పగలు రాత్రి జూడా/చెట్లును కంపలు మొట్లును తరువులు పుట్టలు మరియు గట్లు ద్రవ్వుకొని/అట్టివెల్లి ఆసీఫబాదులో ముట్టె రాత్రి ముప్పై ఆగస్టుకు’ అని వర్షం రాకను వర్ణించారు. దాని ఉధృతికి ‘గొడవెల్లి లో యాభై గృహాలు నడివాగులోన బాయే/జాడలేదు ఏ ధాన్యము జూసిన నీడ లేదు నిలువంగ బోయినా’ అని నష్టాన్ని వివరిస్తారు. ‘భగవంతాయని నీళ్లలో మునుగుచు తేలుచు కొందరునూ/పాలు దాగు పసిపిల్లలనైతే కాళ్లకు త్రాడిడి కట్టిరి చెట్లకు’ అంటూ బ్రతుకుజీవుల పరిస్థితిని వివరించారు. పసి పిల్లలను వరద నుంచి కాపాడేందుకు వారి కాళ్లకు తాడుతో చెట్ల పైకొమ్మలకు కట్టారని తెలిస్తే ఒళ్లు జలదరిస్తుంది.
‘గొర్లు, మేకలు, ఆవులు, లేగలు, బర్లు, దుడ్డెలు, కోడెలు, ఎడ్లు/దార్లు తెలియక ధారలోన బడి పొర్లకుంట పొలిమేర్ల దాటే’ అని పశువుల దీనస్థితిని తెలిపారు. ‘ఎక్కడజూచిన నిలువటికెక్కువ పొక్కలాయెనయ్యా/చక్కటి పొలములు చేండ్లు ఒక్కటీ లెక్కదొరకదయ్యా!’ అని పంట భూములకు జరిగిన నష్టాన్ని ఏకరువు పెట్టారు. ‘బిబ్బెర ఐనం సారసాల మహా తబ్బిబ్బులు ఆయె అబ్బాబ్బా దాగామా లోపల అంతకెక్కువాయె’ అని బాధిత ఊర్ల పేర్లను ఉటంకించారు. ‘కొప్పెర బిందెలు సర్వలు బోళ్లు కుర్చీ మేజులయ్యా/తేనె బుడ్లు తకియా పరుపులు వానగొడుగులు అత్తరు సబ్బులు/పప్పులు బియ్యం ఉల్లిగడ్డలు ఉప్పట్ల గలిసెనయ్యా!’
అంటూ ఆ ఉప్పెనలో కొట్టుకుపోయిన వస్తువులను వివరించారు. ఒక్కో ఇంటి కష్టం ఒక్కోతీరు అన్నట్లు కొన్ని ఖండికలు ఉన్నాయి. ‘లెక్కల వారి బాలయ్య గారిది ఒక్క కష్టమయ్యా/చక్కగాను తన భార్యకు ప్రొద్దులు ప్రసవవేదనయ్యా/నిక్కముగా ఒక తడ వచ్చెను టక్కున మంచము లేపుకపాయెను/ఎక్కటి కష్టమొ బాలుని తల్లికి చిక్కజేసే ఒక ఇంటి మీదను’ అని మొత్తానికి తల్లి, పిల్ల బతికిపోయారని చెప్పి మనసులను శాంతపరిచారు. ఇందులోని చివరి పద్యంలో ‘నీలవర్ణునికి నిత్యమంగళ హారతులివ్వరే బాలురు వృద్ధులు’ అంటూ రచనకు ముగింపు వాక్యాలుగా రాశారు.
సాహిత్య విలువల విషయంలో ఈ వచన పద్యాలు అన్ని అంశాల్లో సరితూగుతాయి. గ్రామీణ పదాలతో పద్యాలకు స్థానిక మెరుగులద్దారు. పామరులకు కూడా అర్థమయ్యేలా, అందరు రాగయుక్తంగా పాడుకొనేలా తన పాండిత్యాన్ని సామాన్యుల స్థాయికి తెచ్చారు. నది పోటెక్కుతే ఒడ్డున ఉన్న గ్రామాల పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో అనే దృశ్యాలను కవి మన
కండ్లముందు ఉంచారు.
నిజానికి ఇదొక విలక్షణమైన రచన. కరువుపై, వరదలపై పద్యకావ్యాలు అరుదుగా ఉండొచ్చు కానీ ఒక అరకొర చదువుల గ్రామీణుడు తన కండ్ల ముందు జరిగిన ఉప్పెనకు ఇంత సమర్థంగా అక్షర రూపాన్ని ఇవ్వడం ఊహకందని విషయమే. 1958లో వచ్చిన వరదలపై రచన కనుక రాసి 60 ఏండ్లు దాటే ఉంటుంది. తన రచనలను కాగితాల్లో తప్ప పుస్తకరూపంలో చేసుకోకుండానే ఆయన జీవితం గడిసిపోయింది. తెలంగాణ వెనుకబాటుతనమే ఒక శాపంలా ఈ కవిని చీకట్లోకి నెట్టేసింది. లక్ష్మణ్ గౌడ్ మాదిరే ఆయన కొడుకు కేశవ గౌడ్‌కు కూడా సాహిత్య పిపాస ఉన్నందువల్ల ఈ వరద కవిత సందుకలో భద్రపరిచారు. ఆదిలాబాద్ గ్రామీణ కవుల రచనలను సేకరిస్తున్న బోయినపల్లి లక్ష్మణస్వామి దృష్టిలో ఈ రచన పడింది. కుటుంబ సభ్యుల సహకారంతో, కవి తుమ్మూరి రాంమోహన్ రావు సంపాదకత్వంలో ఈ మధ్య ముద్రణకు నోచుకున్నది. వీరి కృషి తెలంగాణలోని మరో విస్మృత కవి, చక్కని రచనను వెలుగులోకి తెచ్చాయి.
సుమారు 40 ఏండ్ల వయసులో ‘పెద్దవాగు మోసం’ రాసిన లక్ష్మణ్ గౌడ్ సాహిత్య ప్రస్థానం ఈ ఒక్క రచనతోనే ఆగిపోలేదు. పోచమ్మ దండకం, మంగళహారతి పాటలు, అనావృష్టిపై గేయాలు, భక్తిగీతాలు రాశారని అతని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దివంగత కంభగౌని లక్ష్మణ్ గౌడ్ రచనలన్నీ కలిపి ఒక సమగ్ర గ్రంథంగా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో తెలంగాణ సాహిత్యానికి పట్టం కట్టిన అకాడమీ ఈ పనికి పూనుకోవాలి.
– బద్రి నర్సన్ 9440128169