ఎవరు పోసిన క్రోధాజ్యమో
ఎవరు రాజేసిన మహాయజ్ఞమో
ఇది పనిగట్టుకొని, పగబెట్టుకొని
సర్పాలను చంపాలనుకునే
జనమేజయ యజ్ఞం కాదు
ప్రాణాలను ప్రమిదలుగా
సామాన్యులను సమిధలుగా మార్చే
నిర్జన కోరికల దుర్జనుల యజ్ఞమిది
మంచుకొండలు యజ్ఞకుండాలైతే
మత మంత్రోచ్ఛారణతో
కొబ్బరికాయలా పగిలిపోవాలనో
తుపాకీ తూటాలకు పువ్వులా రాలిపోయి
నైవేద్యంగా మారిపోవాలనో
భార్యలెవరైనా తమ భర్తలను కోరుకుంటారా?
ఓట్లదండలేసుకునే రాజకీయ దేవతలకు
మొగుళ్లను మొక్కుబడిగా అర్పించుకుంటారా?
కాళ్లపారాణింకా చెదరకముందే
ఉగ్రవాదం
రక్తపారాణిని అదుముతుంటే
నదులను ఆపినంత తేలికగా
కన్నీటి కాలువలను ఆపగలమా?
ఇప్పుడు భార్యల హృదయాలు
లోతు చెప్పలేని అగాధాలు
హింసాపాచికలు యమపాశాలై ప్రాణాలను తోడేస్తే
నూరేళ్లు కలిసుందామని
కళ్లల్లో ముద్రించుకున్న భర్తల ప్రతిరూపాలు
వారికన్నీటి కడలిలో నిమజ్జనం చేసి
గుమ్మడికాయలా పగిలిపోయే తమ గుండెకాయకు
ఏడుపు ముడులేసుకొని ఎవరూరుకుంటారు?
ఏ దిక్కూతోచక ఎలా మిగిలిపోతారు?
(కశ్మీర్ ఉగ్రవాదుల చేతుల్లో భర్తను కోల్పోయిన
నవవధువు బాధను చూసి రాసిన కవిత)
– సందీప్ వొటారికారి 93902 80093