నడిచొచ్చిన మెట్లను
మరిచిపోయాక
మెట్లు కట్టిన చేతులెవరికి
గుర్తుంటాయి
మొదటి మెట్టు శిథిలావస్థను
పట్టించుకునే పాదాలెక్కడివి?
చేసిన ప్రయాణం చేతికి చేరాక
బాటను తొలిచిన
చేతులెవరిక్కావాలి
చేరాల్సిన తీరం చేరిపోయాక
ఈత నేర్పిన చేతులనెవరు చూస్తారు?
కొండలూ కోనలూ దాటి
గూడు చేరాక
పల్లకీమోసిన వ్యక్తులెవరికి
గుర్తుంటారు?
ఇవాళ
నదిని దాటాక
తెప్పను తగలేయటమే
బతుకుదెరువు సూత్రం
నీ గాయాలను చూసే
ఓపికా తీరికా ఎవడికీ లేదు
నీ కన్నీళ్లను ఒడకట్టే
సమయమెవడికీ లేదు
ఎండుటాకులా నిన్ను
తొక్కుకుంటూ పోవటమే నీతి
నువ్వు సృష్టించి ఇచ్చిన వసంతాలు
ఎవడికి గుర్తుంటాయి
నువ్విప్పుడొక పక్షులెగిరిపోయిన చెట్టువి
నువ్వు రెట్ట వేయటానికి
కూడా పనికిరానితొలిమెట్టువి
నిన్ను శిథిలం చేస్తూ
మరిన్ని మెట్లు
నిర్మించుకుంటూ పోవటమే
నీతో ఉన్న స్వార్థపరుల లక్ష్యమిప్పుడు
– చిత్తలూరి 9133832246