అతను మెట్లెక్కి కప్పు పైకి పాకాడు
గూన పెంకుల్ని ఒక్కొక్కటిగా తీసి ఏదో వెతుకుతున్నాడు
కాసేపు వెతుకులాట
తర్వాత దిగి ఇంటి దొడ్డి గుమ్మం వైపుకి
ప్రవాహంలా సాగి..
పెరిగిన మొక్కల్ని ఒక్కొక్కటిగా
పెరికి నేల మీద గిరాటేశాడు
అతని జీవితంలో అసందర్భాలు
అలా అలా వస్తూ ఉంటాయి
అతనేమీ లెక్క చేయడు!
తెరుచుకున్న ఇంటి మధ్య
భాగంలో నిలబడి తల పైకెత్తి చూస్తాడు
అంతటా నిశ్శబ్దం కప్పబడి వుంటుంది!
ఆకాశంలో చుక్కలు కనబడలేదు
ఇంకా చీకటి కాలేదని గ్రహించాడు..
పగటి వెలుతురును పిడికిలిలో
పట్టుకోవాలని అతని తపన
పిడికిలి పుట్టిన ప్రతిసారి చీకటి గుప్పిట్లోకి జొరబడుతోంది
గుప్పిట్లోకి తొంగి చూసిన
ప్రతిసారి చుక్కలు కనబడతాయి
ఆశ్చర్యం -భార్య, పిల్లలు,
తల్లి, తండ్రి, బంధువులు,
స్నేహితులు, శత్రువులు
ఇంకా ఇంకా.. అనేకం దర్శనమిస్తాయి!
అప్పట్నుంచి-పగటి వెలుతురులో
చుక్కలు చూడటం మానివేశాడు.
ఇప్పుడతను కప్పు పైన ఒక్కో
గూన పెంకును పొందికగా సర్దుతున్నాడు
పీకి పారేసిన మొక్కల్ని ఒద్దికగా నాటుతున్నాడు..
– డాక్టర్ రూప్ కుమార్ డబ్బీకార్ 91778 57389