తెలుగు సాహిత్య చరిత్రలో ఎన్నడూ జరుగని ఒక ఘట్టం జరిగింది. మామూలుగా సిన్మా యాక్టర్ల వస్తువలకో క్రికెటర్ల వస్తువులకో లేదా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పెయింటింగ్లకో జరిగే అరుదైన గౌరవం అదే రాజీ కథల పుస్తకం ‘అర్రాసు’కు జరిగింది. ఈ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా చోటుచేసుకున్న అద్భుత పరిణామం ఇది.
పుస్తకం విడుదల రోజే రవీంద్రభారతిలో జరిగిన వేలం పాటలో ఆ పుస్తకంలోని మొదటి కాపీ రూ.25,116లకు అమ్ముడుపోయింది. పుస్తకాన్ని వేలం పాటలో దక్కించుకున్న నాగార్జునకు అభినందనలు. ఇది కేవలం ఒక పుస్తకం విక్రయం కాదు. తెలుగు కథా సాహిత్యానికి తిరిగివచ్చిన వసంతం. ప్రజల నుంచి మంచి సాహిత్యానికి, సాహిత్యకారులకు లభించిన పిడికెడు భరోసా.
నిజానికి రచయిత రాజీ కథలు పల్లె ఆత్మను పట్టి చిత్రించాయి. మంచిర్యాల జిల్లా తాళ్లపల్లి గ్రామానికి చెందిన రాజీ జీవితంలో ఎన్నో హోదాల్లో, ఎన్నో బాధ్యతల్లో పనిచేసినా తనలోని సున్నితత్వాన్ని ఎప్పుడూ కాపాడుకున్నది. ఒకప్పుడు ఉపాధ్యాయురాలు, తర్వాత జర్నలిస్టు కానీ ఎక్కడ ఉన్నా ఆమెలోని పల్లె తడి ఆరిపోలేదు. కాంక్రీట్ జంగిల్లో కూడా పల్లెను, పల్లె భాషను, పల్లె మనుషుల అమాయకత్వాన్ని తన హృదయంలో పదిలంగా దాచుకొని, ఆ అనుభూతులను అక్షరాల మాల కట్టింది. ఫలితంగా పుట్టిందే ‘అర్రాసు’. ఇది ఓ మనిషి జీవితపు శకలం మాత్రమే కాదు, ఒక పల్లె ఆత్మ అడ్రస్ కూడా!
ఈ పుస్తకంలో ఏడు కథలు, వాటితో పాటు రాజవ్వ ముచ్చట్లున్నాయి. ప్రతి కథ, ప్రతి ముచ్చట ఒక గట్టిపెరుగు గడ్డ. ఆయిటి మూనిన వానచినుకు. మట్టి వాసనతో నిండిన అనుభవం. పల్లె పండుగలు, మనుషుల నవ్వులు, చిన్న చిన్న బాధలు, చిన్న సంతోషాలు. ఇవన్నీ రాజవ్వ ముచ్చట్లతో కలిసి, పాఠకుడిని వేలు పట్టుకుని పల్లెల్లో నడిపిస్తాయి. మన అత్త, మన అవ్వ, మన పొరుగింటి పెద్దమ్మల మాటలు ఈ కథల్లో గలగలలాడతాయి. ఆత్మీయత, మమకారం, బాధ, తడబాటు, అమాయకత్వం ఈ నాలుగు భావాల సమ్మేళనం ‘అర్రాసు’ పుస్తకం.
ఈ ఏడు కథలు విభిన్నంగా తాళ్లపల్లిలో తను చూసిన, తను విన్న, తను అనుభవించిన జీవితాన్ని చెప్పినా అది సమకాలీనతకు మాతృకలా నిలిచింది. దొరల ఆగడాలు, సామాన్య ప్రజల కష్టాలు, స్త్రీలను మనుషులుగా కూడా గుర్తించలేని పరిస్థితులు, పగలు, ప్రతీకారాలు, అప్పుడప్పుడే విస్తరిస్తున్న వసంత మేఘపు గర్జనలు, పల్లెలకు పిడికెడు భరోసా ఇచ్చి మేమున్నామని ఆసరాగా నిలుస్తున్న అన్నలు, వీటన్నింటి కలబోత ఈ పుస్తకం. ఇదంతా ఓ జ్ఞాపకాల నెమరువేత. వాటిని ఉన్నది ఉన్నట్టుగా అక్షరాల్లోకి దించి కథలుగా మలిచింది. ఇందులో అర్రాసు విలక్షణమైనది. మారుతున్న ఆర్థిక పరిస్థితుల్లో మానవ సంబంధాలు నశించిపోతున్న తరుణంలో మనుషులు ఎలా మృగంగా మారిపోతారు భార్యాభర్తలు, అత్తాకోడళ్లు.. ఇలా బంధాలేవైనా అవి ఎలా చిధ్రమైపోతాయో చాలా చక్కగా వివరించిన కథ.
వంద నోటు పేద పిల్లల బాల్యాన్ని దీనస్థితిని చిత్రించిన కథ. ‘జీతగాడు’ చైతన్యాన్ని నింపే కథ. ‘అర్రాసు’ చదివాక మనసు కదిలిపోతుంది. రాజీ కథల ‘అర్రాసు’ కేవలం ఒక కథా సంపుటి కాదు. ఇదొక భావోద్వేగ దినచర్య, ఒక పల్లె చరిత్ర, ఒక స్త్రీ హృదయానుభూతి.
-డాక్టర్ పెద్దింటి అశోక్ కుమార్
9441672428