నా తెలంగాణ యాస
అందంగా ముస్తాబయి
అత్తరు పరిమళాలతో
కొత్త సొగసులు అద్దుకుంటుంది
తేనెలొలుకు తెలుగు
మా హృదయ భాషావనంలో
జానపదమై జాలువారింది
నా తెలంగాణ తల్లి సిగలో
పరిమళ పద కుసుమమై
వికసించింది
బతుకమ్మ తంగేడుల
బంగారు యాసను కలగలుపుకొని
చిగురించింది
ఉద్యమాల ఉగ్గుపాలలోంచి
ఉబికిన చైతన్యమై
కొత్త పుంతలు తొక్కుతూ
పలుకుబడుల భాషగా
వాసికెక్కి
బడి పలుకులు పలికించింది
హరివిల్లెరుగని మది వర్ణంలో
ముగ్ధ మనోహరమై
వెలుగులీనింది
మట్టి మనుషుల పదకోశమై
గాయపడిన హృదయంలో
గేయాల జలపాతమై
భావతరంగాల్ని ఒలికించింది
యాసకు పట్టం గట్టి
తెలంగాణ భాషను నిలబెట్టిన
మా కాళన్న కలమై
లక్ష మెదళ్లను మేల్కొల్పింది
సాహిత్య తోటలో
విశ్వ జగతికి కావ్యాల పూల
పరిమళాన్ని అద్దినట్లుంటుంది
గునుగు పూల
ఘుమ ఘుమల్ని గుమ్మరిస్తూ
నా దారెంట
నడిసొచ్చినట్టుంటుంది
– నెల్లుట్ల సునీత 79894 60657