క్యారెల్కు నాలుగు బిందెలు కట్టుకొని
పోరడు కస్తీగా సైకిల్ తొక్కంగ
సొమ్మసిల్లిన చైన్ కక్ష్య దాటిన చప్పుడు
బతుకు లంకెను పణం చేసింది
వాలిపోయిన భుజాల
వట్టి పోయిన ఆశలు
నడుం బొక్కలరిగి
వాకిలి కూలిన అక్క చెల్లెలు
వెన్ను వంగిన అమ్మా నాయ్నలనేమని పలకరిస్తరు ?
దశాబ్దాలు దశాబ్దాలుగా
ఈ ఎడారుల సంచారంలో
వచ్చిపోయే నీటి భ్రమల కోసం
కాలుతున్న గచ్చు మీదా
కందెనింకిన గిరక మీదా
కాళ్లు తడవని నేలమీదా
ఆనని బొక్కెన వెక్కిరింపులు సహించలేదా !
పుట్టుకకు చావుకూ
ముందే పుట్టిన ఈ నీటి బొట్టు
ఎవరి దురదృష్టమవుతున్నదని !
కలవరిస్తున్న నీటికన్ను నిప్పుల జ్వాల
తెగింపు భగీరథుని వాగ్దానం చేసింది
పరితపించే తాపసులకే ఎరుక
కూకటి వేరు గుబురులోకి పోయి
నీటి తుట్టెను కదిలించటం ఎట్లనో
ప్రవాహాన్ని మళ్లించడం ఎట్లనో
పారే నరాలను అనుసంధానం చేయటం ఎట్లనో
పరితపించే తాపసులకే ఎరుక
కాలుష్యం చుక్కరాలని
ఊసుల కన్నులకు ఊరడింపు ఎట్లనో
పొక్కిలైన వాకిలిని
తలవంచిన మేఘాన్ని
వెన్నెలను
పిలుచుకోవాలెట్లనో
ఎదురు చూపుల ఆత్రానికి
కడగండ్లు కడిగే మిషన్
కదన రంగాన కాలు దువ్వుకుంటూ
పరవళ్లు తొక్కుతున్నది
బతుకు ప్రధాన జీవనాధారం నీరు
ఉపరానంత ఆశలకు ప్రాణం పోస్తూ
వాకిట ఉదయిస్తున్నది
ఏ సూక్ష్మ కణాన్ని శోధించు
మళ్లి పోయిన ఊటలన్నీ ఒకటొకటిగా
బతుకు జలాశయంలోకి చేరుకుంటున్న
జీవ నదుల సవ్వడులే
ఉప్పొడి పులకిస్తున్న
ఆనందాల బాష్పధారలే
రెండు కొలుకుల రెప్పల నిండా
తెలంగాణమంత
హరివిల్లులై పూచే పూలదండలే.
బెల్లంకొండ సంపత్ కుమార్
99085 19151