ప్రయాణం అంటే ప్రవాహంలా
సాగిపోవడమే
వాగులానో, వంకలానో
నదిలానో, హిమానీ నదంలానో
సాగిపోవడమే దాని గుణం కావాలి
ప్రయాణంలో మజిలీలు ఉంటాయి
ఇతిహాసాల్లో పర్వాలుగానో,
కావ్యాల్లో ఖండికలుగానో…
ప్రయాణంలో జీవితం ఇతిహాసం
గానో, కావ్యంగానో నిలిచిపోవాలి
నలుగురి నాలుక మీద
ఓ పద్యంగానో, గుర్తుండి పోయే
ఓ వాక్యంగానో మిగిలిపోవాలి
షడ్జమ స్వరంలో నెమలి నాట్యంలా
జీవనోత్సాహంలా పరిమళించాలి
జీవితమంటేనే ప్రయాణం,
ప్రయాణమంటేనే జీవితం
ప్రయాణం జీవలక్షణం కావాలి
ప్రయాణంలో దూరాలు
కొనసాగుతూ వుంటే
ఆశ్చర్యపోనక్కర్లేదు!
ఈ ప్రస్థానంలోకొన్ని గొప్ప
సంఘటనలు జరగవచ్చు
లేదా ఎదురు కావచ్చు
ప్రయాణం ఒకరి కోసమే కాకూడదు,
కొమ్మలాంటి దారి మీద ప్రయాణం
ఆకుపచ్చని ద్రవమై ప్రవహించాలి
చెట్టు నీడై గొడుగు పట్టాలి
డాక్టర్ రూప్ , కుమార్ డబ్బీకార్
91778 57389