యదార్థభావం వ్యథార్థ రూపంలో బయటపడితే అది ఫణి మాధవి కవిత్వం. రామాయణ మహా కావ్య సృజన కూడా శోకం నుంచే శ్లోకమై, కథనమై, కవిత్వమై, ఇతిహాసమై, చారిత్రక ప్రమాణమై, భారతీయ జీవన వేదమై భాసించింది. కాంతి పుంజానికి వెనకాల చీకటి ఉన్నట్లు సంతోషం వెనక దుఃఖం ఉంటుంది. సామభేదలో కవిత్వం అర్థవంతమై, వేదనారోదనలలో భేదం భావ యుక్తంగా రక్తి కట్టినది.
బాధతో నిండిన హృదయంలో మొలకెత్తిన భావ జ్వాలలకు ఆలోచనాజ్యం పోసి అక్షరాలలో ప్రజ్వలింపజేశారు ఫణి మాధవి. వామపక్ష వాద కవుల ప్రభావం ఆమెపై ఒకింత ఎక్కువగానే ఉంది. అందుకే ఆ భావన ఆమె కవితల్లో తొంగిచూస్తూనే ఉంటుంది. సచేతనమైన శరీరం నిర్జీవమైతే, బాహ్య ప్రపంచ బంధాల నుంచి విడుదలైనప్పుడు అది మరణమవుతుంది. ఆ మరణానికి కూడా కబురంపట మంటే!..‘మొన్న ఆఖరిసారిగా మరణించినప్పుడుశోకగానం ఆలపించలేదేం!?’ అంటూ మరణం గురించి సరికొత్తగా చెప్పారు.
‘దెబ్బ కాయటం తెలుసులే– కానీ
రాయికెందుకో ఉబలాటం
పదేపదే గాయపరచడమే లక్ష్యం’.. అంటూ
రాళ్లలోనూ మనసు ఉంటుందని కొంగొత్తగా చెప్పారు. కనిపించకుండా విసిరిన చేయి అసలు ముద్దాయిగా తెలిశాక, తగిలిన గాయాన్ని సాక్ష్యంగా చూపెడుతుంది. మానవ జీవన జనన మరణ పరిభ్రమణంలో ఇది అనివార్యం. చనిపోయిన ప్రతిసారి కొత్తగా పుట్టక తప్పదు. ఆ పుట్టుక ఎలాంటిదనేదే ప్రశ్నార్థకమవుతుంది. బతకటం కష్టమైనప్పుడు మరణం అనివార్యమే కదా! ఇది చర్విత చరణం. అది కొత్తేమీ కాదు, కొత్తగా తెలుసుకున్నట్టు అనుకుంటాం. అదే మానవ జీవితంలో విచిత్రం. ‘కబురు’ కవితలో ఈ ధ్వని ఉంటుంది.
‘జై రామ రాజ్యంలో రావణ రథం ఊరేగుతుంది పాండవ ధర్మ పాలనలో కీచక జయధ్వానాలు మిన్నంటుతున్నాయి’ అంటూమతోన్మాదులను, వేర్పాటు వాదనను సమర్థించేవాళ్లను అందలాలు ఎక్కిస్తే దుర్మార్గమే రాజ్యమేలుతుందని చెప్పారు.
అఘాయిత్యాలు చేసేవాళ్లు కూడా అభినందనల కరచాలనం చేస్తారని, అవకాశం దొరికితే ఆబగా కబళించాలని చూస్తారని, తన భావాలు అరణ్య రోదనలేనని, కుచించుకుపోయిన ఆడతనం మహిళా దినోత్సవానికి పెద్దగా స్పందించదని.. మనుషులు పరిణతి చెంది మహిళల్లో తల్లిని, చెల్లిని చూడగలిగితే నిర్భయంగా తన భౌతిక దేహంపై మోజు పడని మగరాయుళ్ల ముందు కూడా ధైర్యంగా వెళ్లగలిగితే, అది నిజమైన మహిళా దినోత్సవమనేది కవయిత్రి ఉవాచ.
‘తన అరుపులు అరణ్య రోదనలేనని ఆమె మౌనంగా
తిరుగు పయనమైంది’ అంటూ ‘ఎప్పటిలాగే ఎప్పటిలాగే’
కవితలో తన ఆంతర్యాన్ని చెప్పారు కవయిత్రి. నాన్న లేని కుటుంబ వేదన చెప్పినా, అమ్మే నాన్నయిందని అమ్మని ఆకాశానికెత్తినా,‘పూర్ణం మిగలాలంటే పూరించాల్సిందేదో ఉంది అర్థం చేసుకోలేని ఆల్గారిథం
బతుకు పుస్తకం నిండా’ అని గణితం చెప్పినా, కిం కర్తవ్యంలో లోపలి చీకటిని పదాల్లో ఒంపినా, పెదాలపై పూసిన నవ్వును మనసుకు పట్టించుకోవడం, దేనికోసమంటే..
‘చేతనకు రాదారి చీకటేనని నిజాన్ని ఎరుక బట్టటం’ అని చెప్పినా కవయిత్రికే చెల్లుతుంది.
చివరి కవిత ‘వెన్నుచూపకు’లో ‘మనసు ఉక్కిరిబిక్కిరైనప్పుడు పక్కన కిటికీ తెరుస్తుంది. స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ, ఊపిరి ఒరిపిడిలోనూ భావం వదల్లేదని చెబుతుంది. గదిలోని చీకటి కాటుకలా నల్లనిదైనా దానిని ఏ వెలుగూ మసక బార్చదు’ అంటుంది కవయిత్రి. మధ్య పుటలలో మానవ జీవిత సంగ్రహ సారాన్ని..
‘ఉరిమే ఉరుముల మబ్బులలో
మెరిసే మెరుపుల తళుకులలో
కురిసే వడగళ్ల వర్షపు చినుకులు’గా కవిత్వీకరించారు. సామభేద గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. ప్రతిఒక్కరూ చదవాల్సిన మానవ జీవన సంవేదనలు కలగలిసిన కవిత్వ సంపుటి సామభేద.
వేంకట రాణా ప్రతాప్
93984 32567