కాలింగ్ బెల్
గాయత్రీ మంత్రం చదువుతుంది
లేదా, వీధి తలుపు
ఆంజనేయ దండకం అందుకుంటుంది
నీ సకల చరాచర స్వప్నాలనూ, కోరికలనూ
విడిచిపెట్టి-
విష్ణుమూర్తిలా వెళ్లి
గబుక్కున తలుపులు తెరుస్తావ్,
అంతవరకే నీకు తెలుస్తుంది,
తర్వాతదంతా ప్రపంచం చెప్పుకుంటుంది
– వచ్చింది మృత్యువని.
ప్రియురాలా, మనకేం తెలుసు –
ఏమో, మరో క్షణంలో
మన తలుపు ఎవరు కొడతారో?
నీకసలే కంగారెక్కువ –
గబుక్కున వెళ్లి తెరిచేయకు సుమీ.
నడి మధ్యలో కలిసినా,
మనకు దొరికినది నడమంత్రపు సిరి కాదు.
అయినా, క్షణాల్లో ఎంతదూరం వచ్చేశామో.
తలచుకుంటే ధైర్యంతో గుండెలుప్పొంగవూ?
సముద్ర పక్షులన్నీ నదుల్లో ఈతకెళ్లినట్టు
మనమింకా దేనికోసమని దేవులాడటం?
ఇంటి మీంచి విమానం వెళ్తున్న చప్పుడేదో
చివరిసారిగా వింటాం,
నువ్వో నేనో- మాత్రం చెప్పలేం!
వారసులెవరో శిథిలాలన్నీ జమ చేస్తారని ధీమా
కావచ్చు, లేక చెల్లాచెదురుగా విసిరేయొచ్చు
చెరిపేయొచ్చు, యాంటీవైరస్ వాడి.
మనకు తెలియనప్పుడు దుఃఖమేల?
చల్లారిన గుసగుసలతో..
చప్పబడిన గుండెలతో
బలంగా కౌగిలించుకునే వుందాం –
మార్కండేయుడిలా.
చివరి నిర్ణయంలోనూ
ఓ చిరు సవాల్ విసురుదాం
ఎప్పటి, నీ పంతంలాగే
– దేశరాజు