కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాలు, చేసిన దానాలు లెక్కకు మించి ఉన్నాయి. వారి సామంతులు, కరణాధికారులు కూడా అనేక ఆలయాల నిర్మాణానికి పూనుకున్నారు. కాకతీయ గణపతి దేవుని వలన కొల్లిపాక-70 (కొలనుపాక-70) శ్రీకరణాధికారాన్ని పొందినవాడు ఆదిత్యామాత్యుడు.
ఇతడు కొల్లిపాక-70 కింద ఉన్న శ్రీకరణాలకు అధిపతి. ఇతని కుమారుల్లో గణపతిమంత్రి ఒకడు. ఇతడు సిద్దిపేట జిల్లాలో ఉన్న కొండపాకలో గణపతిదేవుని పేరు మీదుగా గణపతి సముద్రం అనే ఒక చెరువును కట్టించి శాసనం వేయించినాడు. శాసనకాలం శక సంవత్సరం 1147 (క్రీ.శ.1225). శాసనంలో ఈ వివరాలున్నాయి..
గణపతిమంత్రి కొండపాకలో ఉన్న ఐతేశ్వర, సోమనాథ, కేశవ నారాయణ ఆలయాలకు ప్రతిదానికి ఒక మర్తురు (భూమిని కొలవటానికి సంబంధించిన కొలమానం) భూమిని సమర్పించినాడు. ఇంకా ఐతేశ్వర దేవుని రంగభోగానికి 40 మాడలు విలువచేసే 40 మర్తురుల భూమిని సమర్పించినాడు.
అదేవిధంగా మూడు మర్తురులలో మూడు ఆలయాలకు నందా (అఖండ) దీపాలకు 3/4 భాగం, మిగిలిన 3/4 భాగము మూడు దేవాలయాల్లో దేవుళ్ళకు గొసగి ఓగిరము (ప్రాతఃకాల నైవేద్యం), మాపటి ఓగిరాలకు (సాయంకాల నైవేద్యం) ఎక్కటివీరుల (యుద్ధవీరుల) అనుమతితో గణపతిమంత్రి సమర్పించినాడు.
శాసనం రెండవపక్క ఈ వివరాలున్నాయి. భారద్వాజ గోత్రుడు, శ్రీకరణము అయిన ఆదిత్యామాత్యుని మేనల్లుడు కేశవామాత్యుడు తన మామ ఆదిత్యామాత్యుని పేర ఐతేశ్వర దేవరను, తాత పేర సోమేశ్వర దేవరను, తండ్రి పేర కేశవ నారాయణ దేవరను సపరివారంగా ప్రతిష్ట చేసి ఎక్కటి వీరుల పరివారం అనుమతితో పెద్ద చెరువు నందు ఐతేశ్వర దేవునికి వ్రిత్తి మర్తురు, గుగ్గిల ధూపాదులకు బాదుక, కేశవ నారాయణ దేవునికి మర్తురు, సోమనాథ దేవునికి మర్తురు ఇచ్చినాడు. ఈ ముగ్గురు దేవుళ్ళ ఉపకరణ (భోజనోపకరణాలు, నూనె, నెయ్యి, పప్పు, పండ్లు ఇత్యాదులు), ఆభరణాల నిమిత్తం ఆచంద్రార్కస్థాయిగా ఇచ్చినాడు. ఈ మూడు మర్తురుల ఆదాయంతో మూడు ఆలయాల స్థానాపతులు మూడు నందా దీపాలను ఎత్తించాలని చెప్పబడింది.
శాసనంలో కేశవామాత్యుడు ‘వినయపాత్రుండు, విబుధస్తోత్రుండు, శ్రుతి, స్మృతి, పురాణేతిహాస సకల కలా ఆగమార్థ తత్పఱత శ్రవణుండు, లక్ష్మీ నివహ సన్నిహిత నిజ భవనుండు, జన వన జవనానంద కరమిత్రుండును, వెన్నమాంబికా కలత్రుండు, సద్గుణ గణోపేత లక్షణ సంపూర్ణ గోత్రుండు, మనుముని చరితుండు, ధర్మ నిరతుండు, ఐశ్వర్యోపేతుండు, వన నిధి తటాక కృతినందన శివ భవనాగ్రహారలబుధ మహాసప్త సంతానుండును, ఈశ్వరారాధన తత్పరుండు’ అని ప్రశంసించబడినాడు. శాసనం చివర వ్యాస గీతా శ్లోకములున్నవి.
–డాక్టర్ భిన్నూరి మనోహరి
93479 71177