విశాల విశ్వంలో విశేషాలెన్నో
అనంతమైన అవకాశాలు కూడా ఎన్నో అందుకోవాలని అంతరంగాన
మార్గం తెలియదు, గమ్యం మదిలోన!
ఎప్పుడూ ఒడ్డున
నత్త గువ్వలు ఏరుకుంటూ ఉంటే
సముద్ర గర్భాన
రత్న రాశులు తాకేదెన్నడు!
ఆశల పతంగీలు ఆకాశాన
నేను నేలపైన చేతిలో దారంతో
నేనెగిరే రెక్కలు
ఎప్పుడు పుట్టుకస్తాయో!
తృష్ణ కృష్ణా నదంత
ఆలోచన ఆకాశమంత
ప్రయత్నము ప్రతినిత్యమూ
ఫలితము ఇంకా పిసరంతే!
సమయం ఇంకా రాలేదా
ఆరంభమే ఆలస్యమైనదా
చరిత్రలో పాఠకుడిగానే మిగిలిపోవాలా
నాకంటూ ఓ చరిత్ర లిఖించలేనా!
అడుగులు పడుతున్నాయి
నా గమ్యం చేరే దారేదో?!
జగ్గయ్య.జి
98495 25802