ఉత్కంఠమైన కాలం
కరిగిపోతున్నది
కాలగర్భంలో కలిసిపోతున్నది
కుంచించుకు పోతున్న
మెదళ్ల మొదళ్ల మధ్య
అగ్గి రాజేస్తూ..
సమయం సచ్చీలంగానే
బాధల బంతిని
వేగంగా బౌండరీకి గిరాటు కొట్టింది
ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్
కురస ఆట మోజులా
ఒలికి పోతున్న క్షణాలను
ఉబుకుతున్న ఉద్వేగంతో
ఎంతో తీక్షణంగానే తిలకించాం
మనం హీరోలమో జీరోలమో
తేల్చేసే కాలం
కొత్త క్యాలెండర్ మీద కొలువైంది
ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్
ఎన్ని పథకాలను డైరీలో లిఖించుకోలే
ఎన్ని ప్రారబ్ధాలను పేజీల్లో తిప్పేసుకోలే
మళ్లీ మళ్లీ తిరోగమనంలోకి వద్దు
అన్నింటా వేగం దౌడు తీస్తోంది
కాలం వెంట పరుగిడక తప్పదు
బాధలోనూ బతుకులోనూ..
కాలమెప్పుడూ కొత్తగా
ఓ బూచోడిని సృష్టిస్తుంది
భయంలో బతకటానికో
బతుకే భయం కావటానికో
ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్
చీకటి వాకిట్లోని భేతాళ ప్రశ్నలు
కాపు గాసుకొని కాలాన్ని గీస్తుంటే!
విధ్వంసమవుతున్న
మానవీయ విలువలకు సమాధానంగా
మరో విక్రమార్కుడివై పోవాలి
ఉదయార్కుడివై పొడుసుకు రావాలి
గతమంతా మూఢంగా మూడ్గా
కృంగిపోయాం.. కూలిపోయాం
ఇప్పుడిది ట్వంటీ ట్వంటీ ఫోర్
వన్.. టూ.. త్రీ.. స్టార్ట్
ఉయ్ షెల్ ఓవర్ కమ్..
అలా నిస్తేజంగా నిశ్శబ్దంగా
నిట్టూర్పు విడుస్తూ కూర్చోకు
కాలం నీ ముందు మోకరిల్లదు
లే.. నడువ్.. పరుగులుతియ్
యూ విల్ విన్.. యూ విల్ విన్
ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్!
– డా.కటుకోఝ్వల రమేష్ 99490 83327