పొద్దు పొద్దున్నే
ఆమె నా ముందు వెచ్చని తేనీరవుతుంది
గుమ్మం ముందు వాలిన పేపర్ వైపు
నా రెండు కండ్లు సారిస్తానా…
పత్రికలో ఆమె
పదునైన అక్షరాల కొడవలి
మెరుగైన లక్షణాల పిడికిలి
కన్నీళ్లు కాటుక కళ్లల్లో దాచుకొని
కమ్మని వంటల విందవుతుంది
కాలం కదిలిపోవాలికదా అంటూ..
రాజీ తుపాకిని ఎత్తుకున్న
సిపాయి అవుతుంది
లోపలి మనిషి బయటి మనిషీ అంటూ
సెటైర్ల సాహిత్య సివంగవుతుంది
ఆమె నాకు పాఠమో
నేను ఆమెకు గుణపాఠమో అర్థంకాదు
నేను బండిపై బడిబాట పట్టగానే
ఆమె కెమెరా కన్నుల్ని
తగిలించుకొని
విపణిని వీక్షించే విహాంగమవుతుంది
నేను ఇల్లు చేరుకోగానే
ఆమె బరువెక్కిన
సమాచార సంచవుతుంది
అలసిన నా దేహానికి
పలకరింపుల పాలను వొంపి
వార్తా పదబంధాల కోసం తనకుతానే
క్షీరసాగర మథనమవుతుంది
అక్షరాలే ఆమెకు ఆయుధం
అక్షరాలే ఆమెకు అమృతం
ఆశయాల అల్లికతో కుస్తీ
మానవత్వ మల్లికతో దోస్తీ
ఎప్పుడూ ఆమె వ్యాపకం చైతన్య కారకం
అప్పుడప్పుడూ ఈ అడవిలో
మృగాల చూపుల ఘర్షణలో ఎరుపెక్కి
ఆటుపోటుల సముద్రమవుతుంది
పరిపరి విధాల పరివ్యాప్తమవుతున్న
రేపటి నిజం కోసం నిజంగానే
ప్రసవ వేదనల మాతృకవుతుంది
నిద్రపట్టక నినాదాలను నెమరేసుకుంటూ..
తిమిరాలను రాత్రంతా చీల్చుకున్న నాకు
ప్రతిరోజు ఆమె ఒక సూర్యోదయం
– డాక్టర్ కటుకోఝ్వల రమేష్ 9949083327