ఆ అడుగుల గురించి మాట్లాడుకుందాం
తోవలన్నీ పిడికిళ్లయ్యి
ఊర్లన్నీ నినాదాలైన
ఆ అడుగుల గురించి మాట్లాడుకుందాం
జైలుగోడల్లో గాయాలైన
విద్యార్థి లోకాలగురించి
ఒంటిపై తేలిన, కమిలిన గాయాల గురించి
మాట్లాడుకుందాం
ఎగిసిన అగ్ని ఖిలలలోనుండి
బిగిసిన పిడికిలి త్యాగాలకు వినమ్ర గీతమౌదాం
నెర్రెలువారిన బీడులోకి వెండి జలతారులై మెరిసే
నీటిలో తనివితీరుతున్న పానాలవుదాం,
ఈ ఉత్సాహ కవితా పదాలకు కారణమైన
కూలీల నినాదాల గురించి ,
మన బతుకుల కోసం బలైన
అమరుల గురించి మాట్లాడుకుందాం.
కన్నీటిని కడతేర్చి, కలల్ని తీర్చిన
ఆ చేయిని గురించిమాట్లాడుకుందాం
ఇప్పుడు ముత్తైదు పాటలా నిండైన
ఆడబిడ్డ తిరుగాడుతున్న వాకిళ్లు అవి,
ఇప్పుడు రైతు తలఎత్తి
తలపాగ చుడుతున్న చేను గట్టు అది,
మనవి మనకుఅయ్యాక మనకోసం
శ్రమించిన చెమట చుక్కల గురించి,
నీళ్లను ఎదురెక్కించిన నీటినిపుణుల
గురించి ఎడారికి పచ్చని పావడాచుట్టిన
ప్రాజెక్టుల గురించి చీకట్లను తరిమిన
వెలుగుల గురించి మాట్లాడుకుందాం.
మన ఉనికి కోసం ఉరకలెత్తిన
మిలీనియాల గురించి
సబ్బండ వర్ణాల సుదీర్ఘ
పోరాటాల గురించి
మాట్లాడుకుందాం.
మాట్లాడుకుందాం కొన్ని
అభివృద్ధులను
మరికొన్ని త్యాగాలను.
సీహెచ్ . ఉషారాణి
94412 28142