e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home ఎడిట్‌ పేజీ బుల్లెట్టు బండెక్కిన జానపదం

బుల్లెట్టు బండెక్కిన జానపదం

పాట అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే పాట అనే పేరును జానపదంలో ఆధునికతతో జతచేసి మనకు అందించాడు రచయిత లక్ష్మణ్‌. జానపదగీతం అంటేనే ఎటువంటి నిర్బంధాలు, ఆడంబరాలు లేనటువంటిది. ఎవరైనా తమ సందర్భానికి అనుగుణంగా మార్చుకోవడానికి కుదిరేటువంటిది.

పెళ్లి కాబోయే ఆడపిల్ల మనస్సును తెలిపే ఈ పాట ప్రజల్లోకి వచ్చిన తర్వాత పిల్లలను బడికి రప్పించే బడిపిల్లల పాటగా, కరోనా భూతాన్ని తరిమివేయాలనే అవగాహనా మంత్రంగా, ఇంకా అవసరానికి అనుగుణంగా ఒక్కొక్కరికి ఒక్కోవిధంగా మారిపోయింది.

- Advertisement -

బుల్లెట్టు బండి పాట పెళ్లీడుకొచ్చిన ఆడపిల్ల ఆశలు, కలలను ప్రతిబింబిస్తుంది. ఆమె తాను భర్తకు ఏమివ్వగలననేదే చెప్తుంది కానీ, తనకు భర్త నుంచి ఫలానాది కావాలని అడగడం లేదు. ఒకరి నుంచి పొందినప్పటి కంటే ఒకరికి ఇచ్చినప్పుడు పొందే ఆనందం అనంతం, అనిర్వచనీయం. ఈ పాటలో ఆ అమ్మాయి కూడా అటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ తాను గొప్ప ప్రేమల మధ్య పెరిగానని ఆ మంచితనాన్ని, ప్రేమను నీకు పంచుతానని చెప్తుంది. ‘చెయ్యి నీ చేతికిస్తానురో, అడుగు నీ అడుగులేస్తానురో, నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా, ఇట్టే వస్తారా నీవెంటా’ అంటుంది. ఈ పల్లవి చివరనే కాక పాట ప్రతి చరణం చివరనా వచ్చే పదాల్లో చాలా గొప్ప కవిత్వం ఉన్నది.

వర్ధమాన గేయ రచయిత లక్ష్మణ్‌ విలక్షణ పద ప్రయోగంతో రాసిన ఈ ‘బుల్లెట్టు బండి’ పాటలో ‘పట్టుచీరనే గట్టుకున్నా, గట్టుకున్నుల్లో గట్టుకున్నా’ అంటూ అందమైన తెలంగాణ నుడికారాన్ని వినూత్న రీతిలో ప్రకటించాడు. మధ్య తెలంగాణ ప్రాంతంలో అంటే జగిత్యాల, సిద్దిపేట జిల్లాల ప్రాంతంలో వాడే అందమైన పదప్రయోగం ‘ఉల్లో’. ఇదే ప్రయోగం తెలంగాణ దక్షిణ ప్రాంతంలో ‘అల్లా’గా కనిపిస్తుంది. ‘ఏడికి బోతున్నరల్లా, ఏంజేస్తున్నరల్లా’ అని అక్కడి ప్రజలు మాట్లాడుతారు.

‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ, నా అందాల దునియానే సూపిత్త పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ’… ఇక్కడ బండెక్కి వచ్చేస్తా పద అనకుండా ‘వచ్చేత్త పా’ అనడం, నా అందాల దునియాని చూపిస్తా పద అనకుండా ‘సూపిత్త పా’ అనడం పాటకు అందాన్ని నిండుతనాన్ని కలిగించాయి. ఇవి రెండు అచ్చమైన అందమైన తెలంగాణ పల్లె పదాలే.

‘చిక్కుబుక్కు’ అనే పదాలు ఇంతకుముందు మనం విన్నా ‘డుగ్గు డుగ్గు’ అనే శబ్దం మాత్రం మనం పాటల్లో తొలిసారి వింటున్నాం. ఇంకా ‘టిక్కీ బొట్టే వెట్టుకున్నా’ కూడా ఓ మధురమైన ప్రయోగం. పాట పల్లవిలో వచ్చిన అందమైన విలక్షణమైన ఈ పదజాలం పాట అందాన్ని ద్విగుణీకృతం చేసింది. ఈ పాటలో అమ్మాయి కాబోయే భర్తకు తన గురించి చెప్పడమే కాదు, పాటను రాస్తున్న రచయిత కూడా ఈ సమాజానికి తన అభిప్రాయాన్ని చెప్తున్నాడు. తెలంగాణ పల్లెల అందాలని, పల్లె ప్రజల అందమైన మనసులని, అక్కడి మట్టి పరిమళాలను, పల్లెటూరి శ్రామిక కుటుంబంలోని సభ్యుల మధ్య ప్రేమానుబంధాలను, ఆడపిల్లల పట్ల తల్లిదండ్రులు, అన్నదమ్ములు చూపించే ఆప్యాయతానురాగాలనూ రచయిత మరొకసారి మన ముందుకు తీసుకువచ్చాడు. అంటే పాటలోని మాటల్లో అటు అమ్మాయి గొంతు ఇటు కవి గొంతు రెండూ వినిపిస్తున్నాయన్నమాట.

రచయిత చెప్పినట్టుగానే ఈ పాటలో 30 ఏండ్ల కిందటి తెలంగాణ పల్లె సొగసులు వర్ణించబడ్డాయి. ‘చెరువుకట్ట పొంటి చేమంతివనం, మా ఊరు వాగంచున మల్లెవనం’ అన్నప్పుడు తెలిసేది తెలంగాణ పల్లె అందమే కాదు తెలంగాణ భాషా సౌందర్యం కూడా. ‘చెరువుకట్ట పొంటి, వాగు అంచున, చేమంతులు దెంపి, మల్లెలు దెంపి’ అనేవి అందమైన తెలంగాణ పదాలే. ఇంకా బతుకమ్మ పేర్చడంలో తంగేడు పూలు, గునుగు పూలు ఆ తర్వాత బంతులు, చేమంతులు ఎక్కువగా వాడతారు. కనుక ఇక్కడ బంతివనం, చేమంతివనం అనడం తెలంగాణ ప్రాంతీయతలో కలిసిపోయి పాటకు మంచి అందాన్నిచ్చింది. ఆ రోజుల్లో మల్లెచెట్టు ప్రతి ఇంట్లో ఉండే చెట్టే, మల్లెపువ్వు ప్రతి ఆడపిల్ల మెచ్చే పువ్వే. బంతి చేమంతుల పూలదండ నీ మెడలో వేసి నీ చెయ్యి పట్టుకుంటా, మల్లెపూలు నా జడలో పెట్టుకుంటా అని చెప్తూ ‘మంచి మర్యాదలు తెలిసినదాన్ని, మట్టి మనుషుల్లోనా వెరిగినదాన్ని’ అని తన పెంపకంలోని గొప్పతనాన్ని తెలియజేస్తుంది. తనకు తెలిసిన మంచీ మర్యాదలన్నీ తనను పెంచిన ఆ మట్టిమనుషుల నుంచే నేర్చుకున్నానని అన్యాపదేశంగా చెప్తుందిక్కడ. తను ఎందరి ప్రేమల మధ్యలో పెరిగిందో తర్వాత చరణంలో తెలియజేస్తుంది. ఏడిండ్లలో తను ఒక్కతే ఆడపిల్లనని, తల్లిచాటు పిల్లనని, తండ్రిగుండెలో ప్రేమనని అన్నదమ్ములకు ప్రాణమని అంటుంది. వెన్నెల్లో గోరుముద్దలు తినిపిస్తూ ఎంతో గారంగా చేతుల్లో పెంచారు పువ్వల్లే నన్ను, నీ చేతికిస్తారా నన్నేరా నేను అని ప్రేమగా చెప్తుంది. చేతుల్లో పెంచడం అనేది తెలంగాణాలోని ఒక గొప్పమాట. లేకలేక పుట్టిన పిల్లలని కిందికి దించకుండా చేతుల్లో ఎత్తుకునే పెంచడం అంటే చాలా ప్రేమగా పెంచడం అన్నమాట.

మల్లెచెట్టు ప్రతి ఇంట్లో ఉండే చెట్టే, మల్లెపువ్వు ప్రతి ఆడపిల్ల మెచ్చే పువ్వే. బంతి చేమంతుల పూలదండ నీ మెడలో వేసి నీ చెయ్యి పట్టుకుంటా, మల్లెపూలు
నా జడలో పెట్టుకుంటా అని చెప్తూ ‘మంచి మర్యాదలు తెలిసినదాన్ని, మట్టి మనుషుల్లోనా వెరిగినదాన్ని’ అని తన పెంపకంలోని గొప్పతనాన్ని
తెలియజేస్తుంది.

అలా అపురూపంగా పువ్వులాగా పెరిగిన తనను నీ చేతికిచ్చుకుంటాను అని చాలా అందమైన పదాలలో తెలిపింది.

పెళ్లి అయినాక నేను మీ ఇంటిలోకి కుడికాలు పెట్టి వచ్చాక మీకు తప్పకుండా కలిసొస్తుంది. నిన్ను కన్నవాళ్ళని నా కన్నవాళ్ళుగా చూసుకుంటా, నీ కష్టాలలో నేను పాలుపంచుకుంటా. అందరూ మనల్ని చూసి మురిసిపోయేలా ‘నా ఏడు జన్మాలు నీకిచ్చుకుంటా, నీ తోడులో నన్ను నే మెచ్చుకుంటా’ అంటూ ఏడు జన్మలు నీతోనే జీవిస్తా అని చెప్పింది. మన నమ్మకాల ప్రకారం పెళ్లి అనేది ఏడేడు జన్మల బంధం. నా ఏడు జన్మలు నీకు ఇచ్చుకుంటా అనేది చాలా అందమైన ప్రయోగం.

సంగీతమూ సాహిత్యమూ రెండూ కూడా శ్రోతల్ని ఆకట్టుకునేవే అయితే ఆ పాట విజయం ‘బుల్లెట్టుబండి’ పాటలాగా ఉంటుంది. ఈ ఘనత కూడా గీత రచయిత లక్ష్మణ్‌కే చెందుతుంది. గాయని మోహనభోగరాజు పెళ్లి కాబోయే ఆడపిల్ల కలలని తెలిపేలా ఓ పాట కావాలని అడిగినప్పుడు, ఇరవై రెండు రోజులు తపస్సు చేసి ఈ పాట రాశారు. అది ఆమె స్వరంలో తీయని మధువై మనకు వీనులవిందు చేసింది. పాటలోని రాగం, లయ చెవులకు ఇంపుగా ఉండటమే కాదు పాటలోని భావం ప్రజల మనోభావాలకు అద్దం పడుతుండటం పాట విజయానికి ముఖ్య కారణం.

  • డాక్టర్‌ చింతల రాకేశ్‌ భవాని
    92466 07551
    (వ్యాసకర్త: తెలుగు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌)
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement