‘వాము’ సంపుటిలో సంపాదకుడు డాక్టర్ అత్తెం దత్తయ్య ‘శ్రమ సౌందర్యం’ గురించి క్లుప్తంగా ప్రస్తావించారు. నిజానికి ఈ సంపుటిలోని ప్రతి కథ, ఏదో ఒక మలుపులో, పెద్ద సాంకేతిక పదజాలం లేకుండానే, సహజమైన తెలంగాణ తెలుగులో ఒక ప్రత్యేక అందాన్ని ఆవిష్కరిస్తుంది. కేవలం గొప్ప శిల్పాలు, చిత్రలేఖనాలు మాత్రమే కళ కాదని, దైనందిన శ్రమలో కూడా ఒక లోతైన సౌందర్యం దాగి ఉన్నదనే ఆలోచనతో ఈ వ్యాసం రాశారు. ‘వాము’ కథలు కుమ్మరి వృత్తిని కేవలం సామాజిక వాస్తవికతగా చిత్రించడమే కాక, దైనందిన శ్రమలో అంతర్లీనమైన ఒక సూక్ష్మ సౌందర్యానుభవాన్ని తెలుపుతుంది.
‘వాము’ పుస్తకం కవర్ పేజీ మౌనంగా మాట్లాడే శ్రమ సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తుంది. కుమ్మరి కొలిమి మంటలు, కుండల అమరిక తక్షణమే దృష్టిని ఆకర్షించినా, మన చూపు ఆగేది మాత్రం మొత్తం ముఖచిత్రం కూర్పు మీదనే. ఇది కేవలం ఒక దృశ్య రూపకల్పన మాత్రమే కాదు, బీసీల బతుకుల అంతరంగాన్ని, శ్రమ సంస్కృతిని, మట్టితో ముడిపడిన జీవిత తత్త్వాన్ని సున్నితంగా ఆవిష్కరించే ఒక సూక్ష్మ సౌందర్యశాస్త్ర ప్రయోగం. స్థూలంగా చూస్తే కుమ్మరుల జీవితం కనిపిస్తుంది. దాని అంతరాళంలోని అగోచర క్షణాలు, వస్తు తత్వం, సాంస్కృతిక రూపకాలు గాఢమైన సాహిత్య విమర్శకు తావునిస్తాయి.
శీర్షిక అక్షరాల విషయానికి వస్తే, ‘వాము’ పదం మట్టి రంగుల తెల్లటి ఛాయలతో, కుండల ఆకృతులను తలపించేలా తీర్చిదిద్దారు. అక్షరాలు కంప్యూటర్లో టైపు చేసిన అక్షరాల్లాగా యాంత్రికంగా లేవు, మట్టితో చేసిన శిల్పాల్లా సహజమైన వంపులతో ప్రవహిస్తున్నాయి. దాని కింద ‘కుమ్మరుల బతుకు చక్రాలు’ అనే ఉపశీర్షిక శ్రమను కాలంతోముడిపెడుతుంది.
కుమ్మరి చక్రం గిరికీలు కొట్టే కాలచక్రానికి ప్రతీక – కాలం ఎంత మారినా చక్రం తిరుగుతూనే ఉంటుంది. మట్టి రూపాలు మారవచ్చు కానీ ఆ బతుకుల గతి మాత్రం ఆగిపోదు అనే తాత్విక సత్యం ఈ కథల సంపుటి కవర్ డిజైన్లో దృశ్యమానమవుతుంది. చిత్ర కూర్పు ఒక విశేషమైన శ్రేణిని అనుసరిస్తుంది. నేపథ్యంలో పచ్చని చెట్టు, చిన్నపాటి ఊరు, గుడిసెలు సామూహిక జీవన సౌందర్యాన్ని ప్రతిబింబిస్తాయి. అక్కడి నుంచి దృష్టి క్రమంగా మధ్యభాగంలోని కేంద్రీకృత కుండల బట్టీ మీదకు, శ్రామికుడి శ్రమ మీదకు మళ్లుతుంది. విశాల ప్రపంచం నుంచి ఒక నిర్దిష్ట శ్రామిక కుటుంబపు సూక్ష్మ వేదనలోకి చూపు మళ్లించిన అనుభూతిని ఈ కూర్పు కలిగిస్తుంది. ఈ సంపుటిలోని కథలు చాలాచోట్ల ఈ సూక్ష్మ సౌందర్యాన్ని ప్రత్యక్షం చేస్తాయి. చేతిపని మీద గౌరవం, అది కనుమరుగవుతున్న తీరు వీటి చుట్టూనే కథనం తిరుగుతుంది. కుమ్మరి పనిలో అత్యంత ఆసక్తికరమైన సౌందర్య ఘట్టం మట్టిముద్ద చక్రం మీద ఆకారం తీసుకోవడం. ఇది కేవలం తయారీ దశ కాదు, ఒక కళాత్మక చర్య. ‘వాము’ కథల్లో వస్తువులు జ్ఞాపకాల నిల్వ కేంద్రాలుగా కనిపిస్తాయి.
కుండలు కేవలం నేపథ్యంలో అలంకారాలుగా మిగలవు, అవి కథాగమనానికి చుక్కాని అవుతాయి. పెండ్లి అంటే బోనం కుండ, చావు అంటే తద్దినం కుండ – తెలుగు పల్లె జీవితంలో ప్రతి కీలక ఘట్టానికీ ఒక కుండ ముడిపడి ఉంటుంది. ఒక్కో సందర్భానికి ఒక్కో ఆకారం, ఒక్కో అలంకారం. ఈ కథలు చదివిన తర్వాత, ఆ వస్తువు వెనుక సామాజిక బరువు, ఎవరు చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు అనే స్పృహ మెరుస్తుంది.
‘వాము’ కథలు కుమ్మరి జీవితాన్ని కేవలం సామాజిక వాస్తవికతగా నమోదు చేయడమే కాక, రోజువారీ శ్రమలోని సూక్ష్మ సౌందర్యాన్ని ఒక ప్రత్యేక సాహిత్యానుభవంగా నిర్మిస్తాయి. ‘వాము’ కేవలం కథల పుస్తకం కాదు- కుమ్మరుల బతుకులోని సూక్ష్మ సౌందర్యాన్ని భావితరాలకు అర్థమయ్యేలా నిక్షిప్తం చేసే ఒక సాంస్కృతిక దస్తావేజు.
ప్రొ.గంపా
వెంకటరామయ్య
9958607789