సెకన్ల ముల్లు కదలకపోయినా,
కాలం అదృశ్య నదిగా
నిశ్శబ్దంగా ప్రవహిస్తూనే ఉంది
కనిపించదు, కానీ
ప్రతిక్షణం మనపై తన
వేలిముద్రలను వదిలివెళ్తుంది
ఆకాశం రంగులు మార్చే కాన్వాస్ వెనుక,
అద్దంలో కరిగే రూపాంతరం వెనుక,
రాలిపడిన ఆకుపచ్చటి జ్ఞాపకం వెనుక…
దాగున్న ఒకే ఒక్క రసవేది.
గతం-ఎండిపోయిన పూలపరిమళం,
భవిష్యత్తు ఒక అపరిచిత వెలుతురు నీడ…
ఈ రెండింటి మధ్య నలిగిపోయే ‘వర్తమానం’,
కాలపు అరచేతిలో మెరిసే ‘ప్రాణరేణువు’!
అడుగుల కింద ఉన్న నేలను జార్చేస్తూ,
తలమీది నల్లటి రంగును
వెండిగా మారుస్తూ…
ముగింపు లేని ప్రయాణంలో
మనల్ని తను దాటుకుంటూ వెళ్తుందా?
లేదా మనమే కాలాన్ని దాటుకుంటూ
కరిగిపోతున్నామా?
తరిగొప్పుల
విఎల్లెన్మూర్తి
8008577834