అనువాదం మూలానికి ప్రాణం పోసి, దానికి కొత్త జీవితాన్నిస్తుంది. ఈ విషయాన్నిధ్రువీకరించేందుకు రెండు ఉదాహరణలివ్వవచ్చు. మొదటిది కాళిదాసుకు సంబంధించినది కాగా రెండవది ఠాగోర్ది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలంను సర్ విలియం జోన్స్ ఆంగ్లంలోకి అనువదించకపోతే, దానికి ప్రపంచ స్థాయిలో ఖ్యాతి వచ్చి ఉండేది కాదు. అదే విధంగా, రవీంద్రనాథ్ ఠాగోర్ తన గీతాంజలి బెంగాలీ మూలంను ఇంగ్లిష్‌లోకి తర్జుమా చేయకపోతే, ఆయనకు నోబెల్ పురస్కారం వచ్చి ఉండేది కాదు.
ఈ విధంగా అనువాదాలు మూల రచనలకు పునర్జన్మను ప్రసాదిస్తాయి.అవి కేవలం పదాలను కాకుండా వాటి ప్రపంచాలనే మారుస్తాయి! కాబట్టి, అనువాదకుడిని సృజనాత్మక సహ రచయిత (creative co-author)గా ఎంచవచ్చు. అతడు మూలాన్ని మరొక భాషలో మళ్లీ సృష్టిస్తాడు.
అనువాదపు ఇతర ప్రయోజనాలేమంటే.. వాటి ద్వారా మనం ఇతర ప్రాంతాల, నాగరికతల సాంస్కృతిక ఆత్మను, ప్రవృత్తిని, జీవితం గురించిన కొత్త దృష్టి కోణాలను, భిన్నమైన అభివ్యక్తి రీతులను తెలుసుకుంటాం. అనువాదం మానవ సమూహాల మధ్య సంబంధాలను, సహానుభూతిని సాధిస్తుంది. అందుకే ప్రసిద్ధ ఇటాలియన్ నవలాకారుడు, కథా రచయిత ఇటాలో కాల్వినో అనువాదం గురించి ఇలా అంటారు: ‘అనువాదాలు లేకుంటే నేను నా దేశ సరిహద్దులకే పరిమితమైపోతాను. కనుక, అనువాదకుడు నాకు అతి ముఖ్యుడైన మిత్రుడు’.
అనువాదాలను బేరీజు వేయడంలో ఏకరూపత, సమానత్వం లేవు. వాటి మీద అభిప్రాయాన్ని వెలిబుచ్చడంలో కొంత తికమక నెలకొని ఉంది. దీనికి కారణం అనువాదాన్ని మూల విధేయ, స్వేచ్ఛాయుత, అనుసృజనాత్మక రీతుల సమాహారంగా కాక ఒకే అంశంగా పరిగణించడం.
ఒమర్ ఖయ్యాం రుబాయీలకు ఎడ్వర్డ్ ఫిట్జెరాల్డ్ చేసిన ఆంగ్లానువాదాన్ని వ్లాడిమిర్ నబాకోవ్ నిరసించారు. అందులో, మూలంలో లేని అందాన్ని తీసుకురావాలనే అనవసర ప్రయత్నం ఉందనీ, కనుక అది అనువాద ప్రక్రియకు ద్రోహం అని ధ్వజమెత్తారు.
లక్ష్యభాషలో వికృతంగా ధ్వనించినా సరే, అనువాదం యథాతథంగా, కచ్చితంగా, మూల విధేయంగా ఉండాలని నిక్కచ్చిగా చెప్పారు. ఇంకొక అడుగు ముందుకు వేసి, మూలంలో పఠనానుకూలత (readability) లేకపోతే అనువాదంలో కూడా అది ఉండకూడదు అన్నారు. ఒక్క నబాకోవ్ మాత్రమే కాదు, పోస్ట్ గేట్, టైట్లర్, నీదా మొదలైన మరెందరో కూడా మూల విధేయ అనువాదానికి సంపూర్ణమైన మద్దతు తెలిపారు. టి.ఏచ్.సేవరీ మాత్రం అనువాదం మూలం లా కాక అనువాదం లాగా ఉండాలన్నారు.
అసహజంగా, పరిహాసాస్పదంగా మారనంత వరకు అనువాదం యథాతథంగా ఉండవచ్చు. జాతీయాలను (idioms ను) మక్కికి మక్కిగా తర్జుమా చేసినప్పుడు అది నవ్వు తెప్పించే అవకాశముంది. ఉదాహరణకు, ‘నీ కడుపు చల్లగుండ’ను May your stomach be cool అని తర్జుమా చేసినప్పుడు, లేదా I have a bigger fish to fryను ‘వేపడానికి నా దగ్గర మరో పెద్ద చేప ఉంది’ అన్నప్పుడు అలా జరుగుతుంది. మనం అనువదించింది లక్ష్య భాషలో కూడా జాతీయం అయినప్పుడు యథాతథ అనువాదం బాగానే ఉంటుంది. ఇది చాలా అరుదు. Tying the knotను మూడు ముళ్లు వేయడంగా, kicking the bucketను బాల్చీ తన్నడంగా తర్జుమా చేయడం ఉదాహరణలు.
కానీ, బాల్చీ తన్నడం చాలా సంవత్సరాల నుండి వాడుకలో ఉన్నందుకు ఇప్పుడు ఎబ్బెట్టుగా అనిపించడం లేదు గానీ, మొదట్లో వికృతంగా తోచి ఉండవచ్చు. మూల విధేయ/యథాతథ అనువాదాన్ని అంగీకరించడమంటే ముక్కస్య ముక్కగా అనువదించడం మంచిదని చెప్పడం కాదు. కానీ, ఒకవేళ ఎబ్బెట్టుతనం స్ఫురించకపోతే అలా చేసినా ఫరవాలేదు. చాలా తక్కువ స్వేచ్ఛ తీసుకుని, మూలానికి అతి దగ్గరగా ఉండేలా అనువదించడం ముఖ్యం. వాక్య నిర్మాణం మూలంలో ఉన్నంత సహజంగా ఉండాలి. స్వేచ్ఛానువాదం/అనుసృజన చేస్తున్నప్పటి సంగతి వేరు.
అనువాదం ఎంత కష్టసాధ్యమైన పనో చెబుతూ కొరవి గోపరాజు ఒక అద్భుతమైన సామ్యం చెప్పారు. ఆయన మూల రచయితలను, అనువాదకులను విలుకాళ్లతో పోల్చారు. మొదటి విలుకాడైన మూల రచయిత బాణాన్ని వదలడంలో నైపుణ్యాన్ని చూపిస్తే, అందుకు మనం అతడిని అభినందించాల్సిందే. కానీ అతనికి పూర్తి స్వేచ్ఛ ఉందనే విషయాన్ని మరవకూడదు. రెండవ విలుకాడైన అనువాదకునికి స్వేచ్ఛ అసలే లేదు. అతడు తన బాణాన్ని సరిగ్గా మూలరచయిత వేసిన చోటనే తగిలేలా కొట్టాలి.
ఏ అనువాదం మంచిదని ప్రశ్నిస్తే, మూలంలోని సారాన్ని, ఆత్మను పట్టుకునేదే మంచిది అని చెబుతారు చాలామంది. ఈ సమాధానం చాలా వరకు సరైనదే కానీ, సంపూర్ణమైనది కాదు. సారం, ఆత్మలతో పాటు మూలంలోని మూడ్‌ను, టోన్‌ను, శైలిని కూడా అనువాదంలోకి తేవాలి. ఎందుకంటే, అనువాదకుడు రచనను వేరే భాషలోకి మార్చడం మాత్రమే కాకుండా, మూల కవిని/రచయితను పాఠకుల ముందుంచుతూ తను మూల రచయిత వెనుకకు పోయి దాక్కోవాలి. మూడ్‌ను, టోన్‌ను తెచ్చేందుకు యథాతథ అనువాదం తప్పక అవసరం కాకపోవచ్చు కానీ, శైలిని తేవడం కోసం మాత్రం అది అవసరం.
కాబట్టి, అనువాదం ఎన్నో చిక్కులతో కూడుకున్న క్లిష్టమైన పద్ధతి లేదా ప్రక్రియ. మూలంలో జాతీయాలు, నుడికారాలు, మాండలికం, యాస మొదలైనవి ఉన్నప్పుడు చాలా జాగ్రత్తను పాటించాలి. మూలంలోని సారం, ఆత్మ, మూడ్ టోన్, శైలి… వీటన్నిటినీ తర్జుమాలోకి తెచ్చే ప్రయత్నం చేయాలి.
(20 నవంబర్, 2025 నుండి వరుసగా మూడు రోజుల పాటు హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగిన తెలంగాణ-ఈశాన్య రాష్ర్టాల సమారోహంలో
చేసిన నా ఆంగ్ల ప్రసంగానికి స్వీయ అనువాదం స్వల్పమైన మార్పులతో.)
‘బాల్చీ తన్నడం’ చాలా సంవత్సరాల నుండి వాడుకలో ఉన్నందుకు ఇప్పుడు ఎబ్బెట్టుగా అనిపించడం లేదు గానీ, మొదట్లో వికృతంగా తోచి ఉండవచ్చు. మూలవిధేయ/యథాతథ అనువాదాన్ని అంగీకరించడమంటే ముక్కస్య ముక్కగా అనువదించడం మంచిదని చెప్పడం కాదు. కానీ, ఒకవేళ ఎబ్బెట్టుతనం స్ఫురించకపోతే అలా చేసినా ఫరవాలేదు. చాలా తక్కువ స్వేచ్ఛ తీసుకుని, మూలానికి అతి దగ్గరగా ఉండేలా
అనువదించడం ముఖ్యం. వాక్య నిర్మాణం మూలంలో ఉన్నంత సహజంగా ఉండాలి. స్వేచ్ఛానువాదం/అనుసృజన చేస్తున్నప్పటి సంగతి వేరు.
-డాక్టర్ ఎలనాగ