నిన్ను నువ్వే ద్వేషించుకునే క్షణం రావడం
నిజంగా నరకమే
నిర్ణయాలు కొన్ని తదనంతర కాలంలో
పశ్చాత్తాపంగా మిగిలి
సల్ఫ్యూరిక్ ఆసిడ్లా కాల్చడం
నిజంగా గుండెలో మొల దిగడమే-
లివింగ్ టుగెదర్ నుండి
బ్రేకప్ పార్టీలో ఇద్దరూ కాగితపు
నవ్వులను పంచుతున్నపుడు
ఒక అనిర్ధారిత సమీకరణం
భళ్లున తెగిన చప్పుడౌతుంది
తర్వాత.. వర్షం కురుస్తున్న రాత్రి..
ఒంటరొంటరిగా
ఇద్దరూ ఒంటరి రోడ్డుపై నడుస్తున్నపుడు
మనిషి పచ్చని గుబురు చింతచెట్టులో నుంచి
బుర్రున ఎగిరొచ్చే ఊదారంగు పక్షవుతూ
ఒకటే ఉక్కపోత-
ఎక్కడో ఒకచోట ఒక
‘కవ్వింపు’ ఎదురౌతుంది
అకస్మాత్తుగా నువ్వు బూటుకాలి
కింద పండిన ‘టమాట’ వౌతావు
చితికిపోవడం.. పడిలేవడం..
లేచి మళ్లీ పడటం
కల్కి గాంధారి వేళ ఒంటరిగా
నిశ్శబ్దంగా కన్నీరు కార్చడం
…అంతా సాఫ్ట్వేర్ దిగ్భ్రమ
ఇన్‌స్టాగ్రాంలు.. ఫేస్‌బుక్‌లు.. పోస్టింగులు
రీల్స్, షార్ట్స్, బోల్డ్..
ఏఐ అక్రమ సంబంధాల
గుల గుల నవ్వులూ…
అన్నీ ధూర్త సమకాలీనతకు పుట్టిన
గజ్జికుక్క కూనలు-
అరేయ్ భాయ్… జీవితం
చిన్నదే ఐనా అతిపెద్దది
కొలమానం మైక్రో, నానో, పికో,
ఫెంటోలలో జరుగుతున్నపుడు
జననం అతి సూక్ష్మాతి సూక్ష్మం
మరణం ఇంకా అత్యల్ప మహాల్పం- ఊఁ
రామా ,చంద్రమౌళి
9390109993