తాత మా అయ్యకు చెప్తే…
నాయిన నాకు చెప్పిండు
బిడ్డా… మనం రైతులమే కాదు
దేశానికే రాజులమని
ఇగ నేను ఊహల ప్రపంచంలో
ఉయ్యాలలూగుడు మొదలుపెట్టిన…
భళిరా అంటే బండి గీరె
మీదెసుకొనే రకం నేను
నాయకులందరూ పైకి లేపి నన్ను
చెట్టు ఎక్కిచ్చిండ్రు అనుకున్న
మునగ చెట్టు అని తెలుసుకోలేకున్న..
ఎందుకంటే నేను
ఊహల ప్రపంచంలో ఊరేగుతున్న…
॥ఊహల ప్రపంచంలో॥
పిల్లనిచ్చే మామ అడిగిండు
ఏం నౌకరి నీదని..
ఎవ్వనికి తల వంచని
ఉద్యోగం నాదని
గల్లా ఎగిరేసి చెప్పిన..
ఎందుకంటే… నేను…
॥ఊహల ప్రపంచంలో॥
నీ చేతులు మట్టిని తాకితేనే
మా వేళ్ళు నోట్లోకి పోతాయి
అనే ప్రసంగాలు విని
ఉబ్బి తబ్బిబ్బయి పోయిన..
నా అంత మొనగాడే లేడనుకున్నా
ఎందుకంటే నేను
॥ఊహల ప్రపంచంలో॥
నువ్వే దేశానికి నిజమైన రాజువు
నువ్వే వెన్నెముకవు అని చెప్పి
నాయకులే నా వెన్నుపూసను
విరగ్గొట్టినా.. విరగ్గొడుతున్నా
పసిగట్టలేకపోతున్నా..
ఎందుకంటే నేను
॥ఊహల ప్రపంచంలో॥
నేడు ఒక్క బత్త యూరియా కోసం
రాజు నుంచి ఏకంగా నన్ను
దేవున్ని చేసిండ్రు.. ‘వసుదేవున్ని’
అయినా మంచిదే.. నోరు మూసుకున్న
ఎందుకంటే నేను
॥ఊహల ప్రపంచంలో॥
తన బిడ్డను బ్రతికించుకోవడం కోసం..
ఆనాడు గాడిద అడ్డం
నా పంటను బతికించుకోవడం కోసం…
ఇప్పుడు నాయకులడ్డం
ఇప్పుడు నేను ఊహల ప్రపంచం నుంచి
బయటపడ్డ రాజును కాదని తెలుసుకున్న
నిజానికి నేను/ ఎద్దు కొమ్మును..
నాగటి కర్రును../ బండి ఇరుసును..
గద్ద ముక్కును…/ గరుత్మంతుని రెక్కను..
ఏనుగు తొండాన్ని../ ఎలుగుబంటి గోరును
పులి పంజాను.. అయినా/ నేను ఉత్త మనిషినే…
సత్తువ లేని రైతునే../ ఎందుకంటే నేను
ఊహల ప్రపంచం నుంచి బయటపడ్డ…
– ఉప్పుల శ్రీనివాస్ 91002 57358