ఇప్పుడు వీధులన్నీ
నీచు వాసన కొడుతున్నాయి
ప్రవహించాల్సిన
రక్తం నాచులా గడ్డకట్టింది
మనుషులంతా తమ
వాకిళ్లలోనే జారిపడుతున్నారు
తెలివైన కొందరు పసుపు
నీళ్లు చల్లుకు నిలదొక్కుకుంటున్నారు
సొంత ఇంట్లో మాత్రం
అంతా సనాతనులే
ఎటుచూసినా
ఆలోచించలేని శవాలే
సొంతపనుల్లో తెగ హడావుడిగా
తిరుగుతున్నాయి
నిజం అంటే మర్చిపోయిన జనం
అబద్ధాన్ని ముఖంపై స్పోటకం
మచ్చలంత సహజంగా
పులుముకొని పోతున్నారు
భృకుటి ముడివేసి నుదిటి
రాతలను ప్రశ్నించిన
గుప్పెడు మందీ ఎక్కడి నుండో
కనుమరుగయ్యారు
తమ చేతులకూ బురద
అంటుకుందని తెలియక
పదే పదే అదే చేతులతో
కన్నీళ్లు తుడుచుకునేవారు కొందరు
ఇప్పుడు వాళ్లు కూడా
చేతులు కడిగేసుకుంటున్నారు
కొంతమంది భయంతో,
కొంతమంది భద్రత కోసం
ఇప్పుడిక ఎవరినీ బొట్టు
పెట్టి పిలవక్కర్లేదు
అందరూ ముందు వరుస
కోసమే పాకులాట
పోటీపడటమే ధర్మమని
చాటిచెప్తున్నారు
మరి, అక్కడెక్కడా మనం లేం.
మనం ఇలా మిగల్లేం,
ఇంకోలా మారనూలేం!
– దేశరాజు