సబ్బండ శ్రమ శక్తి ఆయుధమ్మయి తిరుగబడు ఈ నేల పూరించు వేన వేల ధిక్కార ధ్వనులు పూయించు త్యాగాల పూలు విరజిమ్ము ఈ నేల.. అమరుడేమాయెరా – అతని ఆశయమ్మేమయిపాయె – కనుకొలుకులలో రాలిపడు అగ్ని తప్త అశ్రు జలధారల మహోజ్వల పోరుకెరటాలేమైపాయె.. నాగడ్డ బొందల గడ్డయిపాయే, పేగు తెంచుకు త్యాగాన్ని ముద్దాడిన బిడ్డ కల తడియారకనేపాయే! ఏమైపాయె నా జీవనది.. ఎందుకిట్లాయె!!
పోరాట ధ్వనిలోన ఎగిరెగిరి దుంకిన గజ్జెలేమైపాయె, గంభీర కంఠస్వర కుత్తుకలన్ని నేలరాలిపోయెనా – మొలలు తెగనరుకుకొని మూలకు కూసునెనా, పదియారు పట్నాలు పదినూర్ల గ్రామాలు ఒక్క పెట్టున చిచ్చులేపిన చిర్రె చిటికెలేమయిపాయె! భేరీలు రణభేరీలు రౌద్రమ్ములొలికించి సాగించినా సమరమ్మేమయిపాయె. ఏమైపాయె నా జీవనది.. ఎందుకిట్లాయె!
పరిసెరాముండ్ల జెట్టలన్నీ పుట్టి చేతులిరిగిపాయెనా, కళలకు పక్షవాతమ్ములొచ్చేనా పాండురోగమ్ములొచ్చేనా, దాశరథి కాళోజీ నాయాత్మయని పలికిన కూటమ్ములేమాయె- నివ్వెరపోయెనా నిర్ఘాంతపోయెనా ఆకాశమ్ములే తెగిపడిన ఒడిసిన సిరాపాళీల రక్తమ్ము నింపి రచనా రహదారుల సాగింతు కవ్వింపు కాదిది కదనమ్మని భీషణ భాషణల్జేసిన కూపస్థ మండూకాలేమైపాయె-శిలనాభిలో చిక్కుకుపాయెనా – రాకాసుడపహరించెనా బాలనాగమ్మ బందీయైన తీర… ఏమైపాయె.. నా జీవనది ఎందుకిట్లాయె!!
– విశ్వనాథుల పుష్పగిరి