చిలక్కొట్టిన
జాంపండు తిన్న రక్తం నాది
అందుకే అడవంటే
అంత మోజు
కోకిల కూతకు
గొంతు కలిపిన స్వరం నాది
కనుకనే పక్షులన్నా వాటి అరుపులన్నా అంత ఇష్టం
నెమలి నాట్యాన్ని
జింకల పరుగుల్ని
కుందేళ్ళ హొయలను
అనుకరించి నేర్చినవి
నా నడకలు
వాటి పరుగులెప్పుడూ
చెట్టూ పుట్టల వెంటే
ఇంచు ఇంచూ అందమొలికిన ఆ చోటన
ఇప్పుడు నిప్పు నిప్పుగా నొప్పి కురుస్తోంది
అన్ని కాలాల్లోనూ
ఆమని పూసిన ఆ నేలలో
ఈ కాని కాలం కాష్టాన్ని రగిలిస్తోంది
నేను విన్న
నేను కన్న
కథల్లోని కూనలన్నీ
కన్నీళ్లకు ఆరని మంటల్లో కాలిపోతున్నాయి
నేను పీల్చిన గాలే బూడిదై
నన్ను కమ్మేస్తోంది
నేను తాగిన నీరే ఆవిరై
నన్ను తాగేస్తోంది
ఇప్పుడు మాతృ వేదనను
నేను పలికించగలను
ఏ చరిత నివేదనను
నేను వినిపించగలను
బిగించిన పిడికిలి నిండా
ఊపిరి ఆడని లోకాన్ని చుట్టబెట్టి
అగ్గి రగిలించిన
ఒక్కో ప్రాణాన్ని పిగిలి పిగిలి పొమ్మని శపించడం తప్ప
ఇప్పుడు ఏ దుఃఖాన్నని నేను మోయగలను
ఊరవతలి శ్మశానం
నగరపు నడిబొడ్డుకు తరలి వచ్చేస్తోంటే
నగరమంతా శవాలవ్వబోయే
మనుషులతో నిండిపోతుంటే
ఇప్పుడు ఏ ఆర్ద్ర గీతాలకు స్వరాలను జత చేయగలను
అభివృద్ధి మందు వేసుకున్న
రాజ్యం ప్రాణం
అంపశయ్య మీద రోజులు లెక్కబెడుతున్న ఈ దినాన
బూడిదవ్వక మిగిలున్న
ఏ ఊళ్లో నా ప్రాణాల్ని బంధించను
సూర్యోదయాలు
సూర్యాస్తమయాల నిండా
గుంపులు కట్టిన కొంగల విహారాల రెక్కలు తెగి పడుతుంటే
ఏ పచ్చని ప్రపంచానికై
కలను కనమని కళ్లను పోరు పెట్టను
ఇంతటి
శూన్యాన్ని
ఏ కాంక్షల కొన ఊపిరితో నింపను
ఈ మహా
దైన్యాన్ని
ఎవ్వరి నెత్తురుతో చల్లార్చను
– సుధా మురళి