వల ఇసిరిన చెయ్యి
వలను ఒడ్డునారేసిన చెయ్యి
ఇప్పుడు పనిలేక పాడువడ్డది
నాడు మా ఊరి చెరువు
మత్స్యకారులకు ఉపాధినిచ్చింది
వల కోడిమె, ఊతం జీవితాన్నిచ్చాయి
నేడు జీవం లేనివయ్యాయి
అలుగు పారుతుంటే
వాగుల్లో, ఒంపుల్లో ఎదురెక్కే శాపలకు
కోడిమె అడ్డంబెడితే సాలు
చేతిలోని సేపల బుట్ట బరువయ్యేది
అలుగు గుక్కినాక వాగుల్లో మడుగుల్లో
గూడ చాటతోటి గుంతలు గుప్పి
పునుకు పడితే చాలు పులుసుకెళ్లేది
అలుగాగిపోయింది, వాగెండిపోయింది
చెరువులో… చేపల పంటెండిపోయింది
వల వేస్తే చాలు వచ్చేది శాపలు
పరకలు, మట్టలు, జెల్లలు
బంగారు తీగలు, కాకి బొచ్చెలు
కరువుదీరా తిన్న కాలం కరువైనాది
ఊరి బాదులలో సేపల కూత చెవులపడేది
వల నాడు పనిచేసేది
నేడు ఖాళీగై కనబడుతుంది
మూలకున్న వల మురిసింది కొన్నాళ్లే…
-దేవరపాగ కృష్ణయ్య
99634 49579