నీ ఒంటినిండా
చీకటిని పులుముకున్నాక
ఎందుకంత ముస్తాబవుతావని!
నీ సిగ నిండా
నక్షత్రాల మిలమిలలే కదా
మరి నీ కౌగిట్లో పూదోటలన్నింటినీ
బంధించుకుంటావెందుకని?
మమ్ముల్ని మాత్రం జోపుచ్చాక
నువ్వు మాత్రం, జాబిలిని తలకెత్తుకొని
కన్నార్పకుండా నిదురోతావెందుకని?
మా ఊసులు పాసులు బజ్జోబెట్టి
సెలయేటి పాటందుకుంటావెందుకని?
మా కునుకులకు
నీ చీకటిని కాపలా పెట్టి
చల్లని గాలితో షికార్లు చేస్తావెందుకు?
మాట వరసకు నీవు
చీకటిని ముసుగేసుకుంటావు గాని
గుట్టు చప్పుడు కాకుండా
నీ మనసంతా నిండిపోయాక
ఏ వేకువ జాముకో
ఆకలి పిలుపులతో
మేం బ్రతుకు పాట అందుకున్నాక
మెల్ల మెల్లగా నువ్వు జారుకుంటావు!
– వినోద్ కుత్తుం 96343 14502