మట్టి మాట్లాడుతుంది
మట్టి వాసన వెదజల్లుతుంది
నెత్తిన మొలిచే ఎండ
గుండెల్ని చీల్చిన
కాసిన్ని చినుకులతో
తడితడిగా మాట్లాడుతుంది.
జీవకోటికి జవసత్వాన్ని ఇచ్చే భాషలో
మాట్లాడుతుంది.
ఒక చెట్టు గానో
ఒక చేను గానో
ఒక పువ్వు గానో
ఎదగడానికి ఆధారమౌతూ
ఏదో జీవ భాష మాట్లాడుతుంది
మనిషిని శ్వాసించమంటుంది
మనిషిని ప్రేమించమంటుంది
విద్వేషాలు రగిలిన చోట
మానవత్వపు భాష మాట్లాడుతుంది.
రైతుల కళ్లలోకి చూసి
చేనుగా మాట్లాడుతుంది
కష్టానికి ప్రతిఫలంలా మాట్లాడుతుంది.
మట్టిని నమ్మిన మనిషి
మారణాయుధం కాకూడదని
కన్నీరు కారుస్తూ మాట్లాడుతుంది.
మానవ తప్పిదాలకు తల బాదుకుంటూ
మాట్లాడుతుంది.
ఎర్రెర్రని సంకేతాలతో మాట్లాడుతుంది.
– గవిడి శ్రీనివాస్ 7019278368