తెలంగాణ ప్రజల ప్రకృతి పండుగ బతుకమ్మ, ప్రత్యేకించి ఇది స్త్రీల పండుగ, ఆడపడుచుల పండుగ. ఈ పండుగ ఆశ్వయుజ పాడ్యమికి ముందు వచ్చే పితృ అమావాస్య రోజున ప్రారంభమై దుర్గాష్టమితో ముగుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మహర్నవమితో ముగుస్తుంది. పెత్రమావాస్య రోజు ఎంగిలిపూల బతుకమ్మగా బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది.
కారణం ఎంగిలి పడిన తరువాత బతుకమ్మను చేస్తారు. కనుక ఎంగిలిపూల బతుకమ్మ అని కొందరు. ఎంగిలి పూలతో బతుకమ్మని పేరుస్తారు కాబట్టి ఎంగిలిపూల బతుకమ్మ అయ్యిందని మరి కొందరి అభిప్రాయం.
సాధారణంగా పండుగలు, వ్రతాలు, నోములు లాంటివాటిలో శుచి శుభ్రతతో వంటచేసి పూజ అనంతరం నైవేద్యాన్ని దేవునికి సమర్పించి తర్వాత భోజనం చేస్తారు. కానీ పెత్రమావాస్య రోజున మాత్రం వంటావార్పు, పూజ, భోజనం అనంతరం నిదానంగా బతుకమ్మను పేరుస్తారు.
బతుకమ్మ మొత్తం 9 రోజుల పండుగ. 9 రోజులకు బతుకమ్మకు 9 పేర్లు. 9 రకాల ప్రసాదాలుంటాయి.
1. ఎంగిలి పువ్వుల బతుకమ్మ: నువ్వులు, బియ్యం పిండి, నూకలు.
2. అటుకుల బతుకమ్మ: బెల్లం, అటుకులు.
3. ముద్దపప్పు బతుకమ్మ: ముద్దపప్పు, పాలు, బెల్లం.
4. నానబియ్యం బతుకమ్మ: నానేసిన బియ్యం, పాలు, బెల్లం.
5. అట్ల బతుకమ్మ అట్లు: దోశలు నైవేద్యం, అప్పటికప్పుడు బియ్యం పిండితో వేస్తారు.
6. అలిగిన బతుకమ్మ: ఆ రోజు అమ్మవారు అలిగి వెళ్లిందని అసలు బతుకమ్మను చేయరు/ ఆడరు.
7. వేపకాయల బతుకమ్మ: బియ్యం పిండితో వేపకాయలను చేసి నైవేద్యంగా పెడతారు..
8. వెన్నముద్దల బతుకమ్మ: నువ్వులు, బెల్లం, వెన్న, నెయ్యితో నైవేద్యం
9. సద్దుల బతుకమ్మ: రకరకాల సద్దులతో నైవేద్యాలు.
శాస్త్రీయ దృక్కోణం: బతుకమ్మ పండుగ సమయానికి కొత్తగా పళ్ళు గర్భం దాల్చిన ఆడబిడ్డలు తల్లిగారింట ఉంటారు. వ్యవసాయ పనులతో అలిసిపోయిన స్త్రీలకు బలవర్థకమైన ఆహారం అందించాలి. పెండ్లి కావలసిన ఆడబిడ్డలందరికీ రుతుస్రావానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండటం కోసం పౌష్టికాహారం అవసరం. అలాగే 9 రోజులు బతుకమ్మలు పేర్చి, ఆటలాడి, పాటలు పాడి ఎంతో శ్రమించి ఉంటారు. అలాంటి అలసటను పోగొట్టేవిధంగా మంచి ఆరోగ్యకరమైన ప్రసాదాలు, వారి శరీరానికి కావలసిన పౌష్టికాహారాన్ని ఇచ్చే సద్దులు ఈ పండుగ సందర్భంగా తయారుచేస్తారు. అందుకే ఈ పండుగని స్త్రీల పండుగ అని ఆడబిడ్డల పండుగ అని అంటారు.
వివిధ జిల్లాల్లో సద్దులు: ఈ అంశంలో దాదాపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సారూప్యత మనకు కనిపిస్తుంది. అయితే తెలంగాణలోని పాత పది జిల్లాల్లోని బతుకమ్మ సద్దులని గమనించినట్లయితే చింతపండు పులిహోర, దద్దోజనం లాంటివి అన్ని జిల్లాల్లో గమనించవచ్చును. మిగిలిన సద్దులు జిల్లాలను బట్టి వేర్వేరుగా ఉంటాయి.
పోషక విలువలు: బతుకమ్మ సద్దులలో ఉపయోగించే. ఆయా వస్తువులలో అనేక పోషక విలువలు ఉంటా యి. ప్రతి పదార్థంలో కేలరీ లు, సోడియం, పోటాషి యం, విటమిన్లు, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, ప్రోటీన్లు, ఫ్యాట్ తదితర పోషకాలుంటాయి. వాటిని తినడం వల్ల శరీరానికి అవరమైన శక్తి లభించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడం, బరువును తగ్గించడం మెదడు చురుగ్గా పనిచేసేలా ప్రోత్సహించడం చేస్తాయి. బతుకమ్మ కోసం చేసే సద్దులు బలవర్థకమైన ఆహారంగా చెప్పవచ్చును. ముఖ్యంగా స్త్రీలలో రక్తహీనతను అరికట్టడం, రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచడంలో చాలా ఉపకరిస్తాయి.
భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, ఆచారవ్యవహారాలలో ఎన్నో అద్భుతమైన రహస్యాలు దాగి ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఆచారం పేరుతో, సంప్రదాయం పేరు తో, దేవుడి నైవేద్యంగా చేసే ఈ పదార్థాల వెనుక స్త్రీలు, బాలికల ఆరోగ్యం దాగి ఉందనే ది అసలు రహస్యం. ఏయే కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆయా పోషకాలను అందించే వంటలను నైవేద్యాలుగా తయారుచేసి ఆరోగ్య పరిరక్షణ కోసం మన పూర్వీకులు చేసిన ఈ పద్ధతులను సరిగ్గా గమనిస్తే 1.పుష్పవతి కావలసిన బాలికకు, 2.గర్భిణీ స్త్రీకి, 3.వయసు మళ్ళిన స్త్రీలకు ఈ నైవేద్యాలు/ సద్దులు ఎలాంటి పౌష్టికాహారాన్ని అందిస్తున్నాయో గమనించవచ్చు. తర్వాత ఈ సద్దులను కేవలం సంవత్సరానికి ఒకమారే కాదు. నెలకొకసారి లేదా ప్రతి మూడు నెలలకొకసారి అందించినట్లయితే ఎప్పుడు ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడుతాయి.
స్త్రీలకు ఉండే రుతు సమస్యలు, నడుము/వెన్నుపూసకు సంబంధించిన సమస్యలు, బాలింతలకు పాల సమస్యలు, రక్తహీనత, నీరసం వంటి ఎన్నోరకాల సమస్యలను అధిగమించడానికి ఈ సద్దులు ఎంతగానో ఉపకరిస్తాయి. ఈ బతుకమ్మ ఆట, సద్దులు శరీరానికి ఎంతమంచిని చేస్తాయో బతుకమ్మ పం డుగ స్త్రీలకు మానసిక ఆనందాన్ని కలిగిస్తూనే, స్త్రీలంతా జట్టుగా కలిసి ఉండటం, సమైక్యతను పెంపొందించుకోవడానికి ఉపక రిస్తుంటాయి. కుటుంబలోని స్త్రీలు ఆరోగ్యంగా ఉంటే మొత్తం కుటుం బం ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇదే మన తెలంగాణ ప్రకృతి పండుగ బతుకమ్మలోని ఆంతర్యం.
పి.సుజాత
98495 59304