కథా రచనలో ఆయనదో విశిష్ట శైలి. నిత్య జీవితానుభవాలను కథలుగా మలచడంలో ఆయనది అందె వేసిన చెయ్యి. కథల కల్పనలో గట్టి దిట్ట. అతడు సాహితీరంగాన విరబూసిన కథల ముల్లె. ఆయన చూడటానికి సాదాసీదాగా ఎప్పుడూ సంకలో సంచితో కనిపిస్తారు. ఆయనను కదిలిస్తే చాలు ఆయన గళం నుంచి, కలం నుంచి కథలు ధారలు ధారలుగా కురుస్తూనే ఉంటయి. మర్రి చెట్టు ఊడల లెక్క అల్లుకుపోతూనే ఉంటయి. పదునైన కత్తిలాగా, చేయి తిరిగిన వ్యక్తిలాగా కథల సేద్యం చేస్తూనే ఉంటరాయన. ఆయన మరెవరో కాదు, నల్లగొండ గడ్డ అక్షరాల బిడ్డ దేవులపల్లి కృష్ణమూర్తి.
1940లో ఉమ్మడి నల్లగొండ జిల్లా, సూర్యాపేట సమీపంలోని అనంతారం అనే గ్రామంలో దేవులపల్లి కృష్ణమూర్తి పుట్టి పెరిగారు. 10వ తరగతి చదువుతుండగానే నకిరేకల్‌కు చెందిన అమ్మాయిని ఆయన పెండ్లి చేసుకున్నారు. విద్యాభ్యాసం పూర్తయ్యాక లోయర్ డివిజన్ క్లర్క్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన తదనంతరం నల్లగొండకు బదిలీపై వచ్చారు. రెవెన్యూ శాఖలో పనిచేసి 1998లో ఎమ్మార్వోగా ఉద్యోగ విరమణ చేశారు. దేవులపల్లి తన 15వ ఏటనే స్వగ్రామాన్ని విడిచి వెళ్లిపోయారు. నకిరేకల్‌లో కొంతకాలం నివాసం ఉండి ఆ తర్వాత నల్లగొండకు వచ్చారు. నల్లగొండలో నోముల సత్యనారాయణ, పిట్టల రామచంద్రు, కొల్లోజు కనకాచారి, బోయజంగయ్య, మేరెడ్డి యాదగిరిరెడ్డి వంటి రచయితల పరిచయం వల్లనే తన జీవితంలో సాహిత్యానికి నాంది పడిందని ఆయన అంటుంటారు.
ఉద్యోగం చేస్తున్న సందర్భంలోనే సాహితీవేత్తలతో పరిచయం పెరగడం, వారితో సాన్నిహిత్యంగా మెలగడం వల్లనే సాహిత్యం వైపు దేవులపల్లి ఆకర్షితులయ్యారు. ఇట్లా అనేక సాహిత్య సభలు, సమావేశాలకు తరచుగా హాజరయ్యేవారు. నల్లగొండ నుం చి హైదరాబాద్‌కు మకాం మార్చాక, బి.నర్సింగ్‌రావు (మా భూమి)తో దేవులపల్లికి అనుబంధం పెరిగింది. తన జీవితంలోని సమస్యలనే కథలుగా ఎందుకు రాయకూడదని అనుకొని ఉద్యోగ విరమణ పొందాక, అంటే తన 70వ ఏట ఆయన రచనలు మొదలుపెట్టారు. అందరూ బాల్యం నుంచి లేదా నడీడు వచ్చినంక సాహిత్య సృజన చేయడం సాధారణం. కానీ, దేవులపల్లి కృష్ణమూర్తి వయసు మళ్లినంక కథారంగంలోకి వచ్చారు. ఈ విషయం చాలామందికి, ముఖ్యంగా నేటి తరానికి తెలియదు.
ఈ పదేండ్ల కాలంలో ‘ఊరువాడ’, ‘కథలగూడు’, ‘యక్షగానం’,‘బయటి గుడిసెలు’, ‘తారుమారు’ వంటి ఏడు అపూర్వమైన కథల పుస్తకాలను ఆయన తీసుకువచ్చారు. ఆయన రాసిన ఏ పుస్తకంలోని కథ చదివినా మన గురించి రాశారనిపించడమే కాదు, తెలంగాణ జన జీవితం కూడా స్పష్టంగా గోచరించడం ఆయన ప్రత్యేకత. 1947-48 సాయు ధ పోరాటం దగ్గరినుంచి, నిన్న మొన్న జరిగిన ప్రత్యేక తెలంగాణ పోరాటం దాకా పోరాటమే ఊపిరిగా బతికిన తెలంగాణ జీవితం కృష్ణమూర్తి కథల్లో కనిపిస్తుంది. ఆయన అద్భుతమైన కథలు రాయడమే కాకుండా పాటలు కూడా రాశారు, అంతేకాదు, సేకరించారు కూడా.
దేవులపల్లి కృష్ణమూర్తి రాసిన కథల పుస్తకాలకు ప్రముఖ చిత్రకారుడు ఏలె లక్ష్మణ్ బొమ్మలు వేశారు. శ్రీశ్రీ, రావిశాస్త్రి వంటి దిగ్గజాలైన రచయితలు అంటే దేవులపల్లి చాలా ఇష్టపడేవారు. వారి ప్రభావం కృష్ణమూర్తిపై చాలావరకు కనిపిస్తుంది.
‘ఊరు వాడ బతుకు’ సజీవ నవలతో సాహిత్యలోకంలో స్థానం సంపాదించిన దేవులపల్లి.. తెలంగాణ మాండలికంలో రాసిన తొలి యాత్రా చరిత్ర ‘మా యాత్ర’. 25 మంది తన సహచర మిత్రులతో కలిసి నకిరేకల్ నుంచి మినీ బస్సులో బయలుదేరి అజంతా, ఎల్లోరా, అజ్మీర్ దర్గా, జైపూర్, ఢిల్లీ, కలకత్తా, కోణార్క్, దౌల్తాబాద్, హరిద్వార్, ఎర్రకోట, ద్వారకాపురి, అరసవిల్లి, అన్నవరం, భద్రాచలం మొదలగు ప్రాంతా ల్లో యాత్ర చేశారు. ఆ యాత్ర చేసినప్పుడు కలిగిన అనుభవా లు జోడించడమే కాకుండా కల్పి త అంశాలను కూడా చేర్చి ‘మా యాత్ర’ కథల పుస్తకాన్ని రాశారు. ఆయన రాసిన కథల పుస్తకాల్లో తెలంగాణ భాష, సంస్కృతి, ప్రజల జీవన విధానాలు కనిపిస్తాయి.
‘యక్షగానం’ కథల్లో వాళ్ల ఊరి గురించిన అద్భుత భావాలు కనిపిస్తాయి. తన జీవిత చరిత్ర అనుభవాలతోపాటు ఊరు అంటే తనకు ఎందుకు అనాసక్తి కలిగిందో అందులో తెలిపారు. ‘మా యాత్ర’ పుస్తకం చిన్నదే అయినా అందులో మనల్ని నడిపించే ప్రయాణికుల కథలు పెద్దవి. చిన్న పదాలు లేకుండా సాటి యాత్రికుల కష్టాలను, యాతనలను అనాయాసంగా చెప్పుకొచ్చారు. ‘మా యాత్ర’ అనేకానేక ప్రత్యేకతలను సంతరించుకుంది. సరళమైన శైలిలో సాగే రచన ఇది. యాత్ర రచన అంటే ఆయా ప్రాంతాలను పరిచయం చేయడం, అక్కడి వివరాలు నమోదు చేయడం కాదు. పర్యాటక కేంద్రాల సందర్శన అనుభూతుల వ్యక్తీకరణ మాత్రమే కాదు, అంతకుమించి మానవజాతి బహుళ పార్శ్వాలను వ్యక్తీకరించడం. ‘మా యాత్ర’ రచనలోని విశిష్టత ఇదే.
దేవులపల్లి కృష్ణమూర్తి రచనలు సాదాసీదాగా కనిపిస్తాయి. ఏ అలంకరణలు, ఆర్భాటాలు ఉండవు. మంచి పుస్తకం గట్లనే ఉంటది. కవర్ పేజీ నుంచి చివరి పేజీ దాకా ఒక ప్రామాణికతను కలిగి ఉంటుంది. కృష్ణమూర్తి రాసిన కథల్లో సరళమైన వాక్యాలు, అలతి అలతి పదాలు సాగిపోయినట్టు ఉంటయి. మాట్లాడే విధంగానే పదాలు పుస్తకాల్లో కనిపిస్తాయి. వీరి పుస్తకాల్లోని భాషపై విమర్శ కూడా వచ్చింది. అయినా దేవులపల్లి అటువంటి వారిని పట్టించుకోలేదు. రచనా వ్యాసంగం లేకుంటే ఇంతకాలం బతికేవాడిని కాదేమోనని, సాహిత్యమే తన ఆయుష్షుని పెంచిందని నికార్సైన తత్వాన్ని దేవులపల్లి వెలిబుచ్చారు. స్త్రీ జాతిని అవమానపరిచిన దాఖలాలు తన జీవితంలో లేవంటారాయన. వృద్ధాప్యంలో హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్న కురువృద్ధుడు దేవులపల్లి కృష్ణమూర్తి కథా సాహిత్యం నేటి తరానికి స్ఫూర్తిదాయకమవుతుంది.
కోమటిరెడ్డి , బుచ్చిరెడ్డి
94415 61655